Revanth Reddy | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : త్వరితగతిన కేసు విచారణ పూర్తిచేయాలని మత్తయ్య కోర్టును కోరారు. హైకోర్టులో స్టే పొందాలని లేనిపక్షంలో ఇక్కడ (ఈడీ కోర్టు) విచారణ కొనసాగుతుందని జడ్జి సురేష్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో శుక్రవవారం ఓటుకు నోటు కేసు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సీఎం రేవంత్రెడ్డి గైర్హాజరయ్యారు. నిందితుడి తరఫున గైర్హాజరు పిటీషన్ను న్యాయవాది కోర్టుకు సమర్పించడంతో మినహాయింపు నిచ్చింది.
అదేవిధంగా ఈ కేసులో ఉన్న సెబాస్టీయన్, ఉదయ్సింహా, వేం కృష్ణకీర్తన్ల తరఫున వారి న్యాయవాదులు గైర్హాజరు పిటీషన్లను దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. విచారణకు సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్యలు మాత్రమే హాజరయ్యారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున వాయిదా వేయాలని నిందితుల తరఫు న్యాయవాదులు ఈడీ కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేస్తూ జడ్జి సురేష్ ఉత్తర్వులు జారీ చేశారు.