హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్‌లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతర్గత జలవివాదాలు, హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ విస్తరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. ఆ తరువాత సీఎం ఏఐసీసీ పెద్దలను కూడా కలువనున్నారు. రాష్ట్రంలో చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల భర్తీపై జాబితాను అధిష్ఠానం పెద్దలకు అందజేసి, ఆమోదం కోరనున్నట్టు తెలిసింది.