హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తనకు బడేభాయ్ అని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అకస్మికం అకాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. గత ఏడాది ఆదిలాబాద్ సభలో మోదీతో అలాయ్‌బలాయ్ తీసుకున్న రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడబోనని ప్రకటించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే ప్రధానమంత్రి కలను నెరవేర్చడంలో తెలంగాణ చేతులు కలపాలని కోరుకుంటున్నదని చెప్పారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య బంధం పెరుగుతూనే వచ్చినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి.
మారిన వైఖరి
తాజాగా టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి తన సహజ ధోరణికి భిన్నంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విరుచుకుపడటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నది. మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సబర్మతిని, గంగానదిని, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీని ప్రక్షాళన చేయొద్దా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం మీనాక్షి నటరాజన్ ప్రభావమేనని కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నాయి.