Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని అన్నారు. ఐకేపీ కేంద్రాల్లోనే వడ్లు ముక్కి మొలకలొచ్చేస్తున్నాయని.. 60 రోజులైనా వడ్లు కొనలేదంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రుతుపవనాలు వచ్చి దుక్కి దున్నాల్సిన రైతులు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తుందని అన్నారు. వడ్లు కొనే దిక్కు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంటాలైన తర్వాత మిల్లుల్లో రైతులతో బేరాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులకొకసారి వచ్చే లారీల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుందని.. చివరికి రైతులు దళారుల కాళ్లు పట్టుకునే దుస్థితి దాపురించింది అన్నారు.పంట పండించేందుకు కష్టపడ్డ రైతు.. వడ్లు అమ్ముకునేందుకు మరింత కష్టపడుతున్నాడని జగదీశ్ రెడ్డి అన్నారు. అన్నిరంగాలతో పాటు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాల్లో గింజలేకుండా ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చంద్రబాబు ఆడించినట్లుగా రేవంత్ రెడ్డి ఆడుతున్నానడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నదులు మళ్లీ దోపిడీకి గురవుతున్నాయని అన్నారు. రేవంత్ కేసుల భయంతో ప్రధాని మోదీ కాళ్లు మొక్కే పనిలో ఉన్నాడని విమర్శించారు. మన సంపద ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా నది దోపిడీ అయిపోయిందని.. బనకచర్లతో గోదావరి దోపిడీకి మరో కుట్ర జరుగుతుందని అన్నారు. బనకచర్ల ద్వారా గోదావరి జలాలు దోపిడీ జరుగుతున్నా రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడని విమర్శించారు. బీజేపీ , టీడీపీ , కాంగ్రెస్ కలిసి తెలంగాణా నీటిని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
కేసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటే.. మంత్రులు చంద్రబాబుతో పైరవీలు చేయిస్తున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు కమీషన్ల పనిలో ఉంటే.. చంద్రబాబు తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నాడని ఆరోపించారు. కండ్ల ముందు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మన నీళ్లు మనకు వాడలేని నీచస్థితిలో ఇక్కడి మంత్రులు, కాంగ్రెస్, బీజీపీ ఎంపీలు ఉన్నారని విమర్శించారు. పాలన చేతగాకపోతే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని హితవుపలికారు.