Harish Rao | పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి పనికి రాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో, తప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదన్నారు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారుతారా? మీ అబద్దాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదన్నారు. మీరు చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్ధమే అని అసెంబ్లీ లోపల, బయట అనేక సార్లు సాక్షాధారాలతో సహా వివరించానన్నారు.
కుక్క తోక వంకర అన్నట్లు పదే పదే చెప్పిన అబద్దాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ వాదులు బయట ఉంటే, తెలంగాణ ద్రోహులంతా ప్రజా భవన్లో చేరి అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారని మంపడిడ్డారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, పదవుల కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అన్నది నాటి మంత్రులుగా ఉన్న నేటి మంత్రులు అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపులో తోడ్పాటు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ మీది ద్రోహ చరిత్రనే రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా స్పందించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నేడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావంటూ చురకలంటించారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ పేట్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 70 మండలాలు, 1226 గ్రామాల్లోని 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచి పెట్టే కుట్ర ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 50లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెబుతున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని.. బీబిఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు నీకు ఇచ్చిన నివేదికలోనే ఇది ఉందని.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు.
తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా?
అని ప్రశ్నించారు. ప్రాణహిత డిజైన్‌తో 3వేల ఎకరాలకుపైగా ముంపు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా? అని గుర్తు చేశారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం నిజం కాదా? ప్రతిపాదించిన రీతిలో ప్రాజెక్టుకు ఒప్పుకోబోమని, అయినా ప్రాజెక్టు కడితే ఖర్చు వృథా కాక తప్పదని చవాన్ హెచ్చరించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంతో తమ్మడిహట్టి ప్రాజెక్టుకు సమస్య ఉండటం వాస్తవం కాదా? కేంద్ర జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పడం వాస్తవం కాదా? ఏ సమస్య లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టిందని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు.
2007లో మొదలు పెట్టిన ప్రాజెక్టును 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కనీసం అనుమతులు కూడా ఎందుకు సాధించలేదు? కేంద్రంలో, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చొన్నారు? తీవ్రంగా స్పందించారు. ప్రాణహిత చేవెళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.17,875 కోట్లతో నిర్మించేందుకు 2007 మే నెలలో జీవో నెంబర్ 124 విడుదల చేశారని.. కేవలం 19 నెలల్లోనే రూ.38,580 కోట్లకు అంచనాలు పెంచుతూ జీవో ఇచ్చారన్నారు. కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపినప్పుడు రూ.40,300 కోట్లకు పెంచారని.. కమీషన్ల కోసం అంచనాలు పెంచామంటున్న ఉత్తమ్.. ఏ కమీషన్లు దండుకునేందుకు రూ.17వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు అంచనాలు పెంచారు? ఎవరి జేబుల్లోకి అవి వెళ్లాయి? అని నిలదీశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానిది కనుకే అప్పటి కాంగ్రెస్ పార్టీ అంతర్రాష్ట్ర కిరికిరిలో పెట్టి, పనులు ముందుకు పోనివ్వనిది నిజం కాదా? అంటూ ధ్వజమెత్తారు హరీశ్‌రావు.