హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘విదేశీ యాత్రలు ఘనం.. సాధించింది శూన్యం’ అన్నట్టుగా తయారైంది మంత్రుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలే అయినా, దాదాపు సగం మంది మంత్రులు విదేశీ టూర్లకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా ఐదు దేశాల్లో పర్యటించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, తాము వృథా ఖర్చులు తగ్గించి, పొదుపుగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్తున్న మంత్రులు ఒకరి వెంట ఒకరు విదేశీ పర్యటనలకు వెళ్లిరావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడానికే విదేశీ పర్యటనలు అని చెప్పుకుంటున్నా, ఆచరణలో కొత్త పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవనే విమర్శలొస్తున్నాయి. అంతేకాకుండా ఎకువమంది అమెరికాకే వెళ్లి రావడం గమనార్హం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చారు. మొదటిసారి ఈ ఏడాది జనవరిలో.. స్విట్జర్లాండ్, బ్రిటన్, దుబాయ్‌లో పర్యటించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. అకడినుంచి లండన్‌కి వెళ్లి థేమ్స్ నదిని పరిశీలించి వచ్చారు. మూసీ రివర్ డెవలప్మెంట్పై చర్చలు జరిపారు. తర్వాత దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆ పర్యటనలో ఆయన వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం అమెరికా, దక్షిణ కొరియా, దుబాయ్‌లో పర్యటించారు. ఈసారి ఆయనతోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. రెండు పర్యటనలతో వేల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రభుత్వం చెప్తున్నా, కొత్తగా ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయో, అందులో ఏవి వాస్తవరూపం దాల్చాయో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఆగస్టులో జరిగిన అమెరికా పర్యటన తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్ సంస్థతో ఒప్పందం అందులో ఒకటి.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 25సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారు. గత 11 నెలల్లో ఆయన సగటున రెండు వారాలకోసారి ఢిల్లీ వెళ్లారు. మంత్రులు సైతం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చా రో లెకలేదు. ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన సందర్భం లేదనే చెప్పొ చ్చు. ఒకట్రెండుసార్లు మినహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతో కలిసి వెళ్లారు. వారితోపాటు ఒకరిద్దరు మంత్రులు వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది. మంత్రులు సొంత పనుల మీద ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నా యి. మంత్రివర్గం అత్యధికంగా పర్యటించిన మూడో నగరంగా బెంగళూరును చెప్పుకోవ చ్చు. ఢిల్లీ పర్యటనలో సగం కర్ణాటక రాజధాని మీదుగా జరిగాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం ఏర్పడింది మొదలు.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా హైదరాబాద్-బెంగళూరు మధ్య విపరీతమైన రాకపోకలు సాగా యి. బెంగళూరులో ఒక మినీ అధిష్ఠానం నడిచిందని కాంగ్రెస్ వర్గాలే అప్పట్లో జోకులు వేసుకున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలవడానికి రాష్ట్ర మంత్రులు వరుస కట్టారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో ఎదురీదుతుండటంతో ఈ ప్రయాణాలు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి.
పెట్టుబడులు తేవడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ బ్రాండ్‌ను మరింత ప్ర చారం చేయడానికి మంత్రులు దేశ, విదేశీ పర్యటనలు చేస్తే ఎవరూ తప్పుపట్టరు. అయితే, ముఖ్యమంత్రి సహా మంత్రుల పర్యటన వల్ల కలిగిన లాభం ఏమిటన్నదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటివరకు ఒక పెద్ద పెట్టుబడి కూడా రాష్ర్టానికి రాలేదని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ పర్యటనల్లో 90% కేవలం రాజకీయ ప్రయోజనాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల కోసమే తప్ప తెలంగాణ కోసం కాదనే ఆరోపణలున్నాయి. బెంగళూరు పర్యటనలు పూర్తిగా రాజకీయ పర్యటనలే. ఇలా మంత్రుల పర్యటనల వల్ల అటు ప్రజాధనం వృథాకావడంతోపాటు ఇటు పాలన కుంటుపడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు పాలనా వ్యవహారాలను ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి పర్యవేక్షిస్తుంటారని, కానీ గత పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు సీఎస్ కూడా వెళ్లారని గుర్తుచేస్తున్నారు. దీంతో పదిరోజులపాటు రాష్ట్రంలో పాలన పడకేసిందని, ముఖ్యమైన ఫైళ్లు అన్నీ ఆగిపోయాయని అంటున్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ, పాలన స్తంభిస్తున్నదని చెప్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి మౌలిక వసతులతో పర్యాటకుల, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. తెలంగాణకు రావాలని, కొత్త ప్రదేశాలను చూసి, కొత్త అనుభూతులు, సరికొత్త అనుభవాలను పోగేసుకోవాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న జూపల్లి మంగళవారం లాస్ ఎంజెల్స్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు, విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, అకడి అధికారులతో మా ట్లాడారు. ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా హైదరాబాద్ ఎదిగిందని వివరించారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ఎన్ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.