Abhishek Singhvi | విభజనచట్టంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకు అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్ఠానాన్ని కోరామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని.. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని.. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అదిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. అపరిష్కృతమైన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో న్యాయస్థానాల్లో అభిషేక్ మను సింఘ్వీ గట్టిగా వాదిస్తారన్నారు. మాజీ ఎంపీ కేకే పెద్దమనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారన్నారు.