హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్‌రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతాయి’ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా రూ.కోటి చొప్పున పరిహారాన్ని బేషరతుగా మృతుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలని, ఆ ఆస్తులను అమ్మి అయినా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని కోరారు. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటిరోజని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పరిశ్రమలో కూలిపనుల కోసం వలస వెళ్లిన 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన ఘోర ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు నివాళులర్పించిన ఆయన.. ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ వైఖరిపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రేవంత్ సర్కార్ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దుర్ఘటన జరిగిన నాడు మృతదేహాల సాక్షిగా ప్రతి బాధిత కుటుంబానికీ రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. ప్రభుత్వం తరఫున కేవలం రూ.లక్ష చొప్పున మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా?’ అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు చట్టబద్ధంగా రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, జీవిత బీమా, వైద్యఖర్చుల బీమా డబ్బులను కూడా ప్రభుత్వం తను ప్రకటించిన పరిహారంలో కలిపి చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆ మొత్తం కంపెనీ జేబులోంచి ఇచ్చేది కాదని, అది కార్మికుల కష్టార్జితమని తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్యఖర్చులను సైతం ఈ అరకొర పరిహారంలోనే కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందడం లేదని, జీతాలు రాక వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.