CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫైర్ అయ్యారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను చెప్పిన మాట నిజమా? కాదా ఇంటికిపోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ చేయాలి. చర్చ చేయకపోతే ఇబ్బంది వస్తది. పిచ్చిలో పడికొట్టుకుపోయే వారు బాగుపడలేదు. మనకు కూడా ప్రమాదం ముంచుకువస్తుంది. నిన్న ఇవాళ తెలంగాణ రైతాంగం మొఖం తెలివికి వస్తున్నది. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఇస్తుంది. విత్తనాలు సరఫరా చేస్తున్నం. కరెంటు ఇస్తున్నం. మన ఎస్సారెస్పీ నుంచి వరద కాలువలో గతంలో మోటారు పెట్టనిచ్చారా? ఇవాళ ఎవరైనా ఎన్ని మోటార్లు పెట్టినవ్ అడిగిరా? అడుగుతరా?. అడగన్నట.. బోరుకో మీటర్ పెట్టాలటా? ప్రతీ ఒక్క మీటర్ లెక్క తీయాలట. కరెంటు మోటార్లకు పెట్టమంటారా? పెట్టండని అంటడు నరేంద్ర మోదీ. ఏంది దాని ఎనుకున్న మతలబు ఏంది. దీనిపై ఇంటికి వెళ్లి ఆలోచన చేయాలి’ అన్నారు.
‘దీనికి వెనుక మతలబు ఏంటంటే.. విమానాలు అమ్మారు. ఓడరేవులు అమ్మారు. రైళ్లు అమ్మారు. బ్యాంకులు అమ్మారు. అన్ని అయ్యాయి.. మిగిలింది రైతుల వద్ద ఉన్న భూమి. ఎరువుల ధరలు పెంచాలి.. దున్నుకాని ధర పెరగాలి.. పంటలకు ధర ఇయ్యద్దు. మన వడ్లు కొనద్దు. కరెంటు మీటర్లు పెట్టాలే. చాతకాక మనం ఎవుసం బంద్ చేయాలే. చాలా బలమైన కుట్ర జరుగుతుంది. ఇప్పుడేం మిగిలింది.. ఒక్క వ్యవసాయం, పంటలు, రైతుల వద్ద ఉన్న భూములు. రైతుల వద్దనున్న భూములు లాక్కోవాలి. మోదీగారి దోస్తులు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలి. అన్ని బిల్లులు పెరిగి.. పంటలు కొనక.. ధరలు పెరగక మనం నాశనమైపోతే.. రైతు ఇక నాతోటి కాదు అంటే.. మీ భూములు కొంటానికి సిద్ధంగ ఉన్నరు.. కార్పొరేట్ కంపెనీలు వస్తయ్.. పెద్ద పెద్ద స్కూట్ కేసులు పట్టుకొని వస్తరు.. వాళ్లకు మీ భూములు అప్పగియ్యిర్రి. మీరు అందులోనే కూలీ పని చేయమంటరు. ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర. సురేందర్‌రెడ్డి నాయకత్వంలో మోతె గ్రామానికి వస్తే.. మోతె ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తే.. ఆ రోజు పిడికిలి బిగించి మీ బిడ్డగా చెప్పా.. ఖచ్చితంగా నా ప్రాణంపోయిన సరే తెలంగాణ రాష్ట్రం తెస్తా.. తెలంగాణ రాష్ట్రాన్ని సక్కగ చేస్తా అని చెప్పా’ అని గుర్తు చేశారు.
‘ఇవాళ కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు, గురుకులాలు, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఇచ్చి ప్రజలను ఆదుకుంటాం. ఏడు ఎనిమిదేళ్ల కిందట ఒక్కో గ్రామానికి వస్తుండే.. ఇవాళ ఎన్ని లక్షలు వస్తున్నయ్. ఈ వచ్చే సదుపాయం పోడగొట్టుకుందామా? మనకు వద్దందామా? అవి ఉచితాలట.. పనికి మాలిన పతకాలట. ఈ నిజామాబాద్ గడ్డ లక్ష్మీగడ్డ. ఈ గడ్డమీది నుంచి భారత రైతాంగ సోదరులకు నేను తీయని మాట అందిస్తున్నా. ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఎన్ఏపీల కింద పెద్ద పెద్ద గద్దలకు, నువ్వు నీ మంత్రులు దోచిపెట్టిన దేశ సంపద రూ.12లక్షల కోట్లు. మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంటు ఉత్పత్తి అవుతున్నదో.. దాంట్లో మొత్తం దేశంలోని రైతులు కలిసి, ఇరిగేషన్ ప్రాజెక్టులు వాడుకునే కరెంటు కేవలం 20.8శాతమే. దాని ధర ఎంత రూ.1.45లక్షలకోట్లు. బ్యాంకులు లూటీ చేసిన వారికి, వేలకోట్లు దోపిడీ చేసిన వారికి కమీషన్లు తీసుకోని రూ.12లక్షల కోట్లు మాఫీ చేశారు.. రూ.1.45లక్షల కోట్లు రైతులకు ఇచ్చేందుకు చేతులు వస్తలేవా? అని ప్రశ్నిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ అన్నారు.