బాన్సువాడ, సెప్టెంబర్ 3: సర్కారు వైద్యాన్ని బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం ఒక్కొక్కటిగా నెరవేరుతున్నది. మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక సౌకర్యాలతో ఫలితాలనిస్తున్నది. అదే కోవలో మారుమూలన ఉన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు దవాఖాన పోటీ పడి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఏకంగా జాతీయస్థాయిలోనే గుర్తింపును తెచ్చుకొన్న ఈ దవాఖాన తాజాగా ఒకే నెలలో 504 ప్రసవాలతో సరికొత్త రికార్డును సృష్టించింది. వంద పడకలు ఉన్న బాన్సువాడ మాతా శిశు దవాఖానలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాతన సాంకేతిక వైద్య పరికరాలను, మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ఎస్ఎన్సీయూ, పక్కనే బ్లడ్ బ్యాంక్ తదితర అన్ని వసతులు కల్పించడంతో వైద్యంకోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఏరియా దవాఖానకు అనుసంధానంగా నిర్మించిన ఈ దవాఖానలో ఆగస్టు మాసంలో 298 సుఖప్రసవాలు, 206 సిజేరియన్ కాన్పులు రికార్డు స్థాయిలో జరిగాయి.
దవాఖానకు అవార్డుల పంట
బాన్సువాడ ఎంసీహెచ్ నిర్మించిన ఏడాది కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. తల్లి పాల ప్రాముఖ్యతను, బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు అందించడంలో జాతీయస్థాయిలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్షియేటివ్ అక్రెడిటేషన్ అవార్డును దక్కించుకొన్నది. ఒకవైపు దవాఖానలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించేలా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతోనూ పలుమార్లు అవార్డులు అందుకొన్నది. ఈ దవాఖాన గతంలో నాలుగుసార్లు కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. రాష్ట్రంలో కేవలం బాన్సువాడ ఏరియా దవాఖానకు మాత్రమే ఎకోఫ్రెండ్ల్లీ అవార్డు రావడం విశేషం.
డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు
బాన్సువాడ మాతా, శిశు దవాఖానలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు కావడం హర్షణీయం. బాన్సువాడ ఏరియా దవాఖానకు అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ దవాఖాన అనతికాలంలోనే జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకొన్నది. క్షేత్ర స్థాయిలో అనునిత్యం పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రత్యక అభినందనలు తెలిపారు.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
రికార్డులు దక్కడం ఆనందంగా ఉంది..
బాన్సువాడ దవాఖానలో నిత్యం వందలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో దవాఖానలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇటీవలే దవాఖానకు జాతీయస్థాయి ఖ్యాతి వచ్చింది. ప్రస్తుతం మూడు నెలలుగా సుఖ ప్రసవాలతో బాన్సువాడ మాతా శిశు దవాఖాన నంబర్‌వన్‌గా నిలిచి మరో మైలురాయి దాటింది. సరికొత్త రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది.
– డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఎంసీహెచ్