Kolluru | రామచంద్రాపురం, జూన్ 20: పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ‘కేసీఆర్ నగర్’ నిలువనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.50 కోట్ల వ్యయంతో ఒకేచోట 15,660 ఇండ్లను నిర్మించారు. సుమారు లక్ష జనాభా ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్+9లో 38 బ్లాక్‌లు, ఎస్+10లో 24 బ్లాక్‌లు, ఎస్+11లో 55 బ్లాక్‌లు.. మొత్తం 117 బ్లాక్‌లుగా నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్రూం విస్తీర్ణం 580 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30 మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు.
12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్‌ని ఏర్పాటు చేసింది. మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వంద శాతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొల్లూరు డబుల్ బెడ్ రూం కాలనీని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు.
ఒకే చోట అన్ని సేవలు
కొల్లూరు డబుల్ ఇండ్ల సమూదాయంలో బస్టాండ్, పోలీస్ ఔట్‌పోస్టు, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగ్, ప్రభుత్వ దవాఖాన, పీహెచ్సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, హైస్కూల్, అంగన్వాడీ భవనాలు, ప్రతి సెక్టార్లో పాలకేంద్రాలు, ఫంక్షన్‌హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్, బ్యాంక్, ఏటీఎంలు, పోస్టాఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
పరిశీలించిన మంత్రి వేముల
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పెషల్ ఛీప్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో చర్చించారు. ‘కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌజింగ్ కాలనీ’గా వ్యవహరించనున్న ఈ కాలనీ ఓ పెద్ద టౌన్‌షిప్‌ను తలపిస్తున్నది.