హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రికి బయల్దేరుతారు. ఉదయం 9:30 గంటలకు యాదగిరిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. 9:40 గంటలకు యాదాద్రి ఆలయం వద్దకు సీఎం చేరుకుంటారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వయంభువుల తొలి పూజలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటల సమయంలో హైదరాబాద్‌కు సీఎం తిరిగి పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.