హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఆయా ప్రచార సభల్లో ఓటర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరనున్నారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వాడీవేడి ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పలు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దని ఓటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నెల 28 వరకు మొత్తం 54 సభల్లో సీఎం ప్రసంగించనున్నారు.
తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ నిర్వహించగా.. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకుగాను 20 స్థానాలకు కూడా అదేరోజు తొలి విడత పోలింగ్ జరిగింది. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు ఈ నెల 17న, రాజస్థాన్‌లోని 200 స్థానాలకు ఈ నెల 25న, తెలంగాణలోని 119 స్థానాలకు ఈ నెల 30 పోలింగ్ జరుగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న వెల్లడించనున్నారు.