CM KCR | కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతోందని.. కౌలుదార్ కాస్తు చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వమని చెబుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అలా రెండు సంవత్సరాలు కౌలురైతు ఉంటే మూడో సంవత్సరం రైతుల భూమి గోల్మాల్ అవుతుందని.. రైతులూ జాగ్రత్త అంటూ సీఎం హెచ్చరించారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని ఉండే. అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేల సాక్షిగా.. అందులో జీవన్‌రెడ్డి కూడా ఉన్నడు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి ఎక్కువ మాట్లాడి తెలంగాణకు ఏకాన కూడా ఇవ్వను. ఏం చేసుకుంటరో చేసుకోండి అన్నరు. ఒక్క కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడిండా? నోరు తెరిచిండ్రా? అంటూ ప్రశ్నించారు.
‘తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా సన్నాసి ? గట్ల ఎట్ల మాట్లాడుతవ్ అని తిరగబడ్డరా? మరి తెలంగాణ కోసం పేగులు తెగే దాక కొట్లాడినోడు ఎవడు ? తెలంగాణ తెచ్చినోడు ఎవడు ? 24గంటల కరెంటును తెచ్చినోడు ఎవడు ? ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లిచ్చినోడు ఎవడు ? మరి ఇవాళ జగిత్యాలను జిల్లా చేసినోడు ఎవడు ? ఎన్కటికి ఎవడో అన్నడట మీరు మొత్తం వంటలు చేసి తయారుపెట్టుండ్రి.. నేను తర్వాత వచ్చి వడ్డన చేస్తాన్నడట? అట్లున్నది కాంగ్రెస్ పద్ధతి చూస్తే. ఇప్పుడచ్చి మా అంత సిపాయి లేరు.. మేం ఆక్ సిపాయిలం అంటున్నరు. ఎవరు నిజమైన సిపాయిలో ప్రజలు గుర్తించాలి. దయచేసి ఆలోచించకుండా గుడ్డిగా ఓటు వేయొద్దు. ఎప్పుడూ ఓట్లు కులం, మతంమీద వేయొద్దు. కులాలు, మతలాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల ప్రయోజనాల కేంద్రబిందువుగా ఓట్లు పడాలి. అది ఆరోగ్యవంతమైన రాజకీయం. సమాజంలో ఎవరూ తక్కువ కాదు. అందరూ సమానమే. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు’ అంటూ గుర్తు చేశారు.
‘ధరణిని తీసివేసి మళ్లీ వీఆర్వోలు పెడుతరట. మళ్లీ 24కాలమ్స్ పెడుతరట. కౌలుదారుచట్టం పెడుతరట. కౌలుదార్ కాస్తు చేస్తే రైతుకు డబ్బులు ఇవ్వరట. కౌలుదారుకే ఇస్తరట. అట్ల రెండుసంవత్సరాలు ఆయన ఉన్నడనుకో మూడో సంవత్సరం నీ భూమి గోల్మాల్. రైతులు ఇగ చిప్పపట్టుకొని తిరగాలే అంతేకదా? మళ్లీ కోర్టులు.. కేసులు.. వకీళ్లు.. తాకట్లు.. పంచాయితీలు.. రైతుసోదరులారా జాగ్రత్త. నేను రైతుబిడ్డను కాబట్టి. నేను స్వయంగా చేస్తాను కాబట్టి.. రైతుల భూములు సేఫ్‌గా ఉండాలని చట్టం తీసుకువచ్చాను. చట్టం పారదర్శకంగా ఉంది. ఎవడి భూమిని ఎవ్వడూం ఏం పీకలేడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది? ధరణి వల్లే ఈ ధర పెరిగింది. బాజాప్తా ఇవాళ భూముల ధరలు పెరిగిన దానికి ధరణి లేకపోతే.. ఎన్ని పంచాయితీలు అయితుండే..? ఎన్ని తలకాయలు పగిలిపోతుండే..? ఎన్ని కేసులు అవుతుండే? ఒకసారి ఆలోచన చేయండి. ఇది గంభీరమైన సమస్య. తెలంగాణ రైతాంగానికి జీవన్మరణ సమస్య’ అన్నారు.
‘ఇవాళ కరెంటు బాధ లేదు. భూముల రికార్డుల ధర బాధ లేదు. మళ్లీ రేపు రైతుబంధు రావాలి.. ఆఫీసుల చుట్టూ తిరగాలి.. పహనీ నకళ్లు తేపో.. అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ తేపో అంటరు. ఆఫీసుల పొంట పోవాలి.. పోతే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అంటడు. రైతుబంధు ఎంతొస్తది అంటడు. రూ.80వేలు వస్తదంటే రూ.30వేలు ఇవ్వకుంటే సంతకం పెట్ట అంటడు. మళ్లీ మొదటికచ్చినట్టేనా? కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లవుతుంది. పాత కాంగ్రెస్ పాలన ఎట్లుండే? మళ్లీ అదే మొదలవుతుంది. మళ్లీ ఒకగలభూమి ఒకరికి రాసి.. జుట్లు ముడేసి.. ఆఫీసుల చుట్టూ తిరిగి.. చెప్పులగరాలి. ఇవాళ రిజిస్ట్రేషన్ ఎంత మంచిగైతున్నది. పావుగంటలో ఎవరి మండల కేంద్రంలో వాళ్లకు అవుతున్నది.
పావుగంటలో మ్యుటేషన్ అవుతుంది. పట్టా అవుతుంది. పాస్ బుక్కులోకి ఎక్కుతుంది.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి వస్తుంది. మునుపు ఆరు నెలలు.. ఏడాది.. రెండేళ్ల పడుతుండే. ముట్టజెప్పేది ముట్టజెప్పినా కూడా రెండేళ్ల వరకు కాకపోతుదుంటే. కొందరు పదేళ్లయినా చేయించుకోలేదు అమాయకులు. ఒకటే భూమి డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుండే. ఇవాళ అవుతుందా? కాదు కదా? అవన్నీ మోసాల నుంచి విముక్తే ధరణి. రైతులు క్షేమంగా ఉన్నరు. మళ్లీ రైతుల నోట్లో మన్నం వోస్తం.. దళారులే మా సుట్టాలు.. పైరవీకారులే సుట్టాలు.. లంచగొండి అధికారులే మా సుట్టాలు కాంగ్రెస్ బాజాప్తా అంటున్నది. మేం ఖుల్లం కుల్లాగా చెప్పినంకు కూడా మా ఓటు వేశారు అంటారు’ అని హెచ్చరించారు.