e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides నేతన్నకు బీమా ధీమా

నేతన్నకు బీమా ధీమా

 • రైతుబీమా తరహాలోనే చేనేత కుటుంబాలకు భరోసా
 • త్వరలోనే 57 ఏండ్లకు ఆసరా పింఛన్‌ అమలు
 • నర్సింగ్‌ విద్యార్థుల ైస్టెపెండ్‌ మూడురెట్లు పెంపు
 • రాష్ట్రంలోని దళితులకు అండగా సాధికారత పథకం
 • పదివేల కోట్లతో వైద్యరంగంలో మౌలిక వసతులు
 • సిరిసిల్ల పర్యటనలోముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనలు
 • చేనేత రంగానికి ప్రత్యేకంగా కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు
 • సిరిసిల్ల జిల్లాకు వైద్యకళాశాల, టూరిజం ప్యాకేజీ
 • తన పునాదులు తానే బలపర్చుకుంటున్న తెలంగాణ
 • ఆరేండ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతం జరిగింది
 • మిషన్‌ భగీరథపై స్టడీకి పదకొండు రాష్ర్టాలు వచ్చినయ్‌
 • తెలంగాణ ఎదపై ఇప్పుడు నాలుగు సజీవ జలధారలు
 • భవిష్యత్తు తరాల కోసమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి
 • రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి రైతుబీమా తరహాలో త్వరలోనే ‘చేనేత బీమా’ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చేలా చేసినట్టే.. నేత కార్మికుడు చనిపోయినా.. అతడి కుటుంబం ఖాతాలోకి రూ.5 లక్షలు పడుతాయని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి త్వరలోనే కార్పస్‌ఫండ్‌ ఏర్పాటుచేస్తామన్నారు. 57 ఏండ్లు నిండినవారికి పింఛన్లు అందజేయడంపై వచ్చే క్యాబినెట్‌లో నిర్ణయిస్తామని చెప్పారు. భవిష్యత్తులో వైరస్‌ ముప్పులను ఎదుర్కోవడానికి రూ.10 వేల కోట్లతో వైద్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. దీంతోపాటు నర్సింగ్‌కాలేజీ, మార్కెట్‌యార్డు, డబుల్‌బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. కొన్ని విషయాలు తలచుకుంటే బాధ అనిపిస్తది. గతంలో ఓసారి సిరిసిల్లలో రాత్రిపూట సమావేశం పెట్టి సిరిసిల్ల పట్టణం మీదుగా సిద్దిపేటకు పోతున్నం. గోడలమీద అప్పుడున్న జాయింట్‌ కలెక్టర్‌ ‘ఆత్మహత్య చేసుకోకండి. చావు పరిష్కారం కాదు’ అని రాయించిండు. గిన్నేండ్ల స్వాతంత్య్రం తర్వాత గివ్వా మనం చూసే దరిద్రం అని మేం అనుకున్నాం. ఇక్కడ చేనేత కార్మికులది దారుణమైన పరిస్థితి. రోజూ చచ్చిపోయేది. ఇక్కడ చేనేత వాళ్లున్నరు, మరమగ్గాల వాళ్లున్నరు, వాళ్లు రకరకాల పద్ధతుల్లో జీవిస్తున్నరు. వాళ్లను ఆదుకోవడానికి ఏం చేద్దామని ఆలోచించినం. రాష్ట్రంలోని నిరుపేదలు పండుగ రోజు కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు అని స్కీం తెచ్చినం. చీరలు ఇక్కడ నేపిస్తున్నాం. దాన్ని కూడా కాలబెట్టిచ్చారు కొంతమంది రాజకీయ కిరికిరి దుర్మార్గులు. ‘అరే నువ్వు కట్టుకోకు.. నువ్వు లక్ష రూపాయల చీర కట్టుకో నిన్ను ఎవడైనా వద్దన్నడా? నాకు లెవ్వు, నేను పేదోడ్ని కదా. నాకు ఆ చీరనే మహాభాగ్యం. అది కూడా కొనుక్కునే స్థోమత లేదు నాకు..’ అనుకునే వాళ్ల కోసం ఈ స్కీం పెట్టినం. అటు వాళ్లకు చీర దొరుకుతది.. ఇటు చేనేత కార్మికులకు పని దొరుకుతది. నిజంగానే బతుకమ్మ చీరలు సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు కొంత అన్నం పెట్టినయ్‌. కొంత ఆదుకున్నయ్‌.

- Advertisement -

అగ్గిమీద నీళ్లు చల్లినట్టు ఇప్పుడు కొంత రిలీఫ్‌ వచ్చింది. కేటీఆర్‌ దగ్గరనే ఆ శాఖ ఉన్నది కాబట్టి ఆయన తిప్పలపడి మరమగ్గాలను మంచిగ చేపిచ్చుడో, కొంత పని ఇప్పించుడోచేసి ఆ కార్మికులకు కనీసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల జీతం వచ్చేలా చర్యలు తీసుకున్నరు. కానీ పూర్తిగా దరిద్రం పోలే. వాళ్ల గురించి ఇంకా చాలా జరగాల్సిన అక్కెర ఉన్నది. వాళ్ల జనాభా కూడా పెద్దగ లేరు. నాకు తెలిసి 15 లక్షల జనాభా ఉంటది. ఒక్క సిరిసిల్లే కాదు గద్వాల, భువనగిరి, దుబ్బాక, సిద్దిపేట.. ఇట్లా వాళ్లు లేని ప్రాంతం ఉండదు. ఇవాళ సిరిసిల్ల నుంచి ఈ శుభ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల కోసం ‘చేనేత బీమా’ తెస్తమని ప్రకటిస్తున్నా. ఇవాళ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షల బీమా టంగ్‌మని బ్యాంకులో పడుతున్నయ్‌. రైతు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా, వాళ్లు ఏక్‌దమ్‌ పరేషాన్‌ కాకుండా అది వాళ్లకు ఒక ఆసరా. రైతు బీమా లాంటి సదుపాయమే రాబోయే రెండు, మూడు నెలల్లో చేనేత కార్మికులకు కూడా ప్రకటిస్తాం. నేత కార్మికుడు చనిపోతే రూ.ఐదు లక్షలు వచ్చేలా బీమా సదుపాయం ఏర్పాటుచేస్తాం. దీంతో వాళ్లకు కొంత ఊరట, కొంత రిలీఫ్‌ వస్తది.

చేనేతలకు కార్పస్‌ ఫండ్‌
మరమగ్గాలు, చేనేతల విషయంలో కొంత డబ్బును కార్పస్‌ఫండ్‌ పెట్టి దాంట్లో చేపట్టాల్సిన చర్యలు కూడా తప్పకుండా ప్రభుత్వం చేపడుతది. నేను చీఫ్‌ సెక్రటరీని కూడా రిక్వెస్ట్‌చేస్తున్నా. దిస్‌ ఈజ్‌ ద మోస్ట్‌ వల్నరబుల్‌ కమ్యూనిటీ ఇన్‌ తెలంగాణ. కాబట్టి వీళ్ల గురించి ఒక స్కీమ్‌ రూపకల్పన చేసి.. మనం అన్ని వృత్తులను ఎైట్లెతే అనుకుంటున్నమో వీళ్లకు కూడా చేయాలి. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేనేతలకు 50% సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు ఇస్తున్నం. కొంత ఆదుకుంటా ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కానీ ఏక్‌ దమ్‌ న అందరికీ పొద్దున లేస్తనే మొత్తం కావాలంటే.. కన్న తండ్రి కూడా చేయలేడు కదా. కొంత టైం పడుతది. ఒకటీ, ఒకటీ ఎవరికి అనుకూలం ఉన్నది. ఎవరి వాతావరణం ఎట్ల ఉన్నది అనే దాన్ని బట్టి చేసుకుంటూ ముందుకు పురోగమించాలే. అల్టిమేట్‌గా ఏం కావాలే. అందరి ముఖాల మీద చిరునవ్వు వికసించే తెలంగాణ కావాలే. గది మన లక్ష్యం. మనకు కులం లేదు. మతం లేదు.. జాతి లేదు.. యావన్మంది నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు కూడా మేం ధీమాతోని.. ఒక ధైర్యంతోని.. గొప్పగ బతకగలుగుతాం… ఇంకా ముందుకు పురోగమించగలుగుతాం అనుకొనే తెలంగాణ కావాలనే లక్ష్యంతోని మనం ముందుకు పోతున్నాం. అందుకు అవసరమైన కార్యక్రమాలు కూడా తీసుకుంటాం.

కేసీఆర్‌ ైస్టెల్‌లో దళిత క్రాంతి
ఎవరైనా వివక్షకు గురైనప్పుడు కలిగే బాధ సామాన్యమైనది కాదు. దానిని నిర్మూలించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నం. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజలకు ఊరట కలిగింది. రూ.వేల కోట్లు పెట్టి యాదవులు, మత్స్యకారులు, చేనేత.. ఇలా అనేక వృత్తి కులాల వారిని ఆదుకుంటున్నం. ఇక మిగిలింది దళితులు. వారికి రెండు రకాల బాధలున్నయి. ఒకటి ఆర్థికంగా పేదరికంలో ఉండటం.. రెండోది సామాజిక వివక్ష కొనసాగడం. ఇవి మనిషిని కలిచివేస్తాయి. ఇది మనకే మచ్చ. మనది గొప్ప రాష్ట్రం. అద్భుతంగా పురోగమిస్తున్న రాష్ట్రం. ఇక్కడ ఎవరూ అభద్రతాభావంతో ఉండకూడదు. మన దళితజాతిని ఎవడో వచ్చి ఉద్ధరించడు. మన రాష్ర్టానికి.. మన జాతికి ఉన్న సమస్యను ఎవరో పరిష్కరించరు. మనమే చేయాలి. ఇందులో భాగంగానే ఈ మధ్య దళిత జాతికి చెందిన ప్రజాప్రతినిధులతో సుమారు 10-11 గంటలపాటు మేధోమథనం చేశినం. కొన్ని కార్యక్రమాలు అనుకున్నం. దానిమీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడునాలుగేండ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నదని ప్రకటిస్తున్నా. సమావేశం సందర్భంగా రసమయి బాలకిషన్‌ అనేక నిర్మాణాత్మక సలహాలు ఇచ్చారు. కేసీఆర్‌ ైస్టెల్‌లో జగమొండి. పట్టువట్టి.. ఒక ప్రభుత్వమే అనుకున్న తర్వాత.. ఇంతమంది పట్టువట్టిన తర్వాత దళిత జాతి పైకి రాదా? మనం తలుచుకుంటే గంగనే 500 మీటర్లు పైకి వచ్చింది. దళిత కుటుంబాలు పైకి రావా? దళితులు శ్రమ జీవులు. వాళ్ల చేతుల్లో లక్ష్మి ఉన్నది. వారికి మార్గం కావాలి అంతే. లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఉంటే వందశాతం విజయం సాధిస్తం. రాబోయే రోజుల్లో ‘ఎస్‌.. నేను తెలంగాణ దళితబిడ్డను. గర్వంగా జీవిస్తున్నా’ అని కాలర్‌ ఎగరేసుకొని గర్వంగా బతికేరోజు వస్తదని నేను నమ్ముతున్నా. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నా.

ఆక్సిజన్‌ కొంటున్నమా?
హరితహారం చాలా ప్రధానమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ దయచేసి కదలాలె. ఆక్సిజన్‌ కొనుక్కుంటరా ఎవడైనా శిగ్గు లేనోడు! ఇప్పుడు కొనుక్కుంటున్నరు. ఇందిరాపార్క్‌ కింద ‘ఆక్సిజన్‌ అమ్మబడును’ అని బోర్డు ఉంటది. దాంట్లకు పోయి ఇంత డబ్బు కట్టి.. కొంతసేపు కూర్చొని వస్తరు. ఇదా మన బతుకు. మనకు ఎద్దు లేదా? ఎవుసం లేదా? పొలాలు లేవా? నీళ్లు లేవా? కొద్దిపాటి శ్రద్ధతో ఎంత అద్భుతమైన ప్రకృతిని మనం చేయవచ్చు. నేను గొప్పలు చెప్పుకునుడు కాదు గానీ.. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే.. 12,769 ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయి. యావత్‌దేశంలో తెలంగాణలో మాత్రమే ఇలా ఉన్నది. గతంలో మనిషి సచ్చిపోతే కాలవెట్టెతందుకు జాగలేదు. సచ్చిపోయిండని దుఃఖం అనుభవించాల్నా? జాగ లేకపోవడం వల్ల కలిగే క్షోభ అనుభవించాల్నా?. నాగరిక సమాజం భరించజాలని ఒక భయంకరమైన బాధ ఇది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రుల బుర్రకు ఇది ఎందుకు తట్టలేదు? మంచినీళ్లకు గతిలేదు. కరెంటు సక్కగరాదు. మనిషి సస్తే కాలవెట్టే జాగలేదు. చెట్లు కొట్టుడు.. జంగల్‌ సాఫ్‌ చేసుడు తప్ప పెట్టుడు లేదు. అందుకే ఆక్సిజన్‌ కొనుక్కునే దుస్థితి వచ్చింది. ఈ బాధలు పోవాల్నంటే మనమే ముందుకు పోవాలె. లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చే కన్నా.. బతుకగలిగే వాతావారణం ఇయ్యాలె. బతుకలేని పరిస్థితి ఉంటే ఏమిచ్చి ఏం లాభం. ముందు తరాలకు మనమిచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద, జల సంపద, పరిశుభ్రమైన వాతావరణం. కాబట్టి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని చిత్తశుద్ధితో చేయాలె. డబ్బులు తక్కువైతే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్‌ చేశైనా సరే.. పల్లెలకు నిధులు ఆపొద్దని సీఎస్‌కు సూచించా. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా డబ్బులు ఇస్తాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఒక సుదూర లక్ష్యంతో చేపట్టినవి. ఇది మన భవిష్యత్‌ తరాలకు సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రంలో ఉన్న యావన్మంది ప్రజాప్రతినిధులకు ఈ వేదిక మీది నుంచి దండం పెట్టి చెప్తున్నా.. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పకడ్బందీగా చేయాలె.

కేసీఆర్‌ను ఎవ్వరూ ఆపలేరు
మనకు అపనమ్మకాలు ఎక్కువ. ఏదన్నా ముచ్చట చెప్తే కాయమేనంటవా? అయ్యేనంటవా? అని మాట్లాడుతాం. మన సంకల్పానికి చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్‌ శుద్ధి తోడైతే 100 శాతం ఏదైనా సాధ్యమే. కానేకాదు అని కాడి కిందపడేసి ఎక్కడోడు అక్కడ పండుకునే టైంలో తెలంగాణే అయ్యింది కదా. దాని తర్వాత కావాల్సినన్నీ కూడా అయితనే ఉన్నయ్‌. అయితయ్‌ కూడా.. ఎవరూ ఆపలేరు. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వచనం ఉన్నంతసేపు ఎవరూ ఆపలేరు. ఈ సిరిసిల్ల వేదికగా నేను ఒకటే మాట చెప్తున్నా. ఎవరూ ఎన్ని రకాలుగా మాట్లాడినా.. ఏం చేసినా.. నేను ప్రారంభించిన ఈ ప్రస్థానాన్ని, కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. ఆ లక్ష్యంతో పోతున్నాం. ఫలితాలు స్పష్టంగా కండ్ల ముందర కనబడుతున్నాయ్‌. మన ముందరే కాదు యావత్‌ ప్రపంచం ముందరఉన్నయ్‌.

త్వరలో 57 ఏండ్లకు పింఛన్‌
పింఛన్‌కు కొంత వయసు తగ్గించి ఇయ్యాలనే డిమాండ్‌ ఉన్నది. 57 ఏండ్లు ఉన్నోళ్లకు గత ఎలక్షన్ల మనం చెప్పినం. తప్పకుండా వచ్చే నెల నుంచి మొత్తం ఎన్యూమరేట్‌ చేసి.. పల్లె ప్రగతి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సమావేశం పెట్టి తర్వాతి క్యాబినెట్‌లో నిర్ణయం చేసి 57 ఏండ్లు నిండినవారందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని మనవి చేస్తున్నా.

కలలో కూడా అనుకోలేదు
పదేండ్ల కింద బతుకుదెరువుకు చీర్లవంచ నుంచి సిరిసిల్ల కు వచ్చినం. నేను బీడీలు చుడుత. మా ఆయన బట్టల దుకాణంలో పనిచేస్తడు. అద్దె ఇండ్లల్ల బతుకులు వెళ్లదీసినం. గతంలో ఇల్లు కోసం దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోలె. కేటీఆర్‌ సారు ఎన్నికలప్పుడు పేదల్లోకు పెద్ద ఇల్లు కట్టిస్తామని చెప్పిండు. ఇప్పుడు సీఎం సారు చేతులమీదుగా పట్టా అందుకున్నం. ఇది కల నా..? నిజమా..? అనిపించింది. మేం ఇంకో పదేండ్లయినా సొంతిల్లు కట్టుకోపోదుం.

 • అన్నలదాస్‌ రుచిత, సిరిసిల్ల

అన్నంపెట్టి ఇల్లు ఇప్పిచ్చిండ్రు
మాది పద్మశాలీ కుటుంబం. నా భర్త సదానందం రెండేం డ్ల కింద అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నడు. నాకు కొడుకు లవన్‌కుమార్‌, బిడ్డ వైష్ణవి. కిరాయి ఇంటిలో ఉంటూ బట్టలుకుడుతూ బతుకుతున్న. నిన్న సిరిసిల్లకచ్చిన మంత్రి కేటీఆర్‌ సారును కలిసిన. ఇల్లు ఇప్పియ్యాలని అడిగిన. మా పరిస్థితిని వివరించిన. సారు మంచిగ మాట్లడిండు. కడుపునిండా తిండిపెట్టి పంపించిండు. ఇయ్యాల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ ఇంటి పట్టా చేతిల పెట్టిండు. మస్తు సంతోషమనిపిచ్చింది.

 • వేముల కవిత, సిరిసిల్ల

ఆక్సిజన్‌ కొనుక్కుంటరా ఎవడన్నా సిగ్గు లేనోడు. ఇప్పుడు కొనుక్కుంటున్నరు. ఇదా మన బతుకు! కొద్దిపాటి శ్రద్ధతో ఎంత అద్భుతమైన ప్రకృతిని మనం తయారుచేయవచ్చు. పిల్లలకు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చే కన్నా.. బతుకగలిగే వాతావరణం ఇయ్యాలె. బతుకలేని పరిస్థితి ఉంటే ఎన్ని ఆస్తులు ఇచ్చి ఏం లాభం? ముందు తరాలకు మనమిచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద, జల సంపద, పరిశుభ్రమైన వాతావరణం. కాబట్టి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని చిత్తశుద్ధితో చేయాలె.

 • ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో కార్మిక, ధార్మికక్షేత్రంగా విరాజిల్లుతున్నది. రాష్ట్రంగా ఏర్పడిన ఏడేండ్లలోనే ఎన్నో అద్భుత ఫలితాలు సాధించాం. జిల్లాపై సీఎంకు పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నది. చిన్ననాటి నుంచి ఇక్కడే తిరిగారు. ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఒకప్పుడు మెట్టప్రాంతంగా ఉన్న సిరిసిల్ల ఎస్సారార్‌ ప్రాజెక్టు నిర్మాణంతో వాటర్‌ జంక్షన్‌గా మారింది. ఎర్రటిఎండల్లో ఎగువ మానేరు మత్తళ్లు దుంకిన అద్భుత ఘట్టాన్ని చూశాం. ఇది కేసీఆర్‌ కార్యదక్షత వల్లే సాధ్యమైంది.

 • మంత్రి కేటీఆర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana