న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం న్యూఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ పార్టీని ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారిగా ఢిల్లీకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధమవుతుండగా సందర్శించి, మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సర్ధార్ పటేల్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు జోధ్‌పూర్ వంశీయులకు చెందిన బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు లీజుకు తీసుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఈ వారం వరకు ఢిల్లీలోనే ఉంటారని, ఈ సందర్భంగా పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఆయన ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫాయ్‌లో ములాయం పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు.