హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎం కేసీఆర్ ముంబై పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై పయనమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల్లో మితిమీరుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటంలో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్పవార్తోనూ చర్చలు జరుపనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ఢిల్లీ కోటను బద్దలు కొడ్తామంటూ రణనినాదం చేసిన కేసీఆర్కు ఇప్పటికే పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. కేసీఆర్తో కలిసి నడుస్తామని ఆయా పార్టీల నేతలు స్వయంగా వచ్చి చెప్పారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కేసీఆర్కు సంపూర్ణ మద్దతు పలికారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ముంబై వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరిన విషయం తెలిసిందే.