పండిన ధాన్యాన్ని కొనేవరకు కేంద్రంతో కొట్లాటే.. రేపట్నుంచి ఉద్యమమే
కార్యాచరణ ప్రకటించిన మంత్రి కేటీఆర్
పండిన ధాన్యాన్ని కొనేవరకు వదలబోం
కేంద్రంలో మూర్ఖపు, రైతు వ్యతిరేక, పిచ్చి ప్రభ్వుతం
వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదు
గోయల్‌కు ఎంత అహంకారం, ఎంత కండ కావరం
తెలంగాణ రైతులను, మంత్రులను అవమానిస్తరా
బాయిల్డ్ రైస్ ఎగుమతి లెక్కలన్నీ బయటపెడుతాం
ఆంక్షలు అడ్డం వస్తున్నాయని గోయల్ అబద్ధాలు
పార్లమెంటును, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తవా
ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం: మంత్రి కేటీఆర్ హెచ్చరిక
వరి సాగు చేస్తే కేంద్రంతో కొనిపిస్తా అన్న వాళ్లెక్కడ?
బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడరేం
రైతులను ఆగం చేసిన బీజేపీ నాయకుల సంగతి చూస్తాం!
సంజయ్ యాదికున్నదా?
29.09.2021
రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నేను తీసుకొంటా.
28.10.2021
కేంద్రంలో అధికారంలో ఉన్నది.. బీజేపీ ప్రభుత్వం. మేము హామీ ఇస్తున్నం. రాష్ట్ర ముఖ్యమంత్రీ.. ఈ యాసంగిలో పంట ఎంతొస్తది? ఎంత కేంద్రానికి ఇయ్యదల్చుకున్నవ్. వెంటనే స్పష్టంచేయి. కేంద్రానికి లేఖ రాయి. ఒప్పించే బాధ్యత నాది.
ఇప్పుడు వడ్లు కొనిపించవేం సంజయ్?
నిలదీసిన కేటీఆర్
తెలివి తక్కువ వాళ్లు ఎవరు గోయల్..?
‘నా సమజ్ కే లియే తో.. మేరే పాస్ బాత్ కర్నే కే లియే కుచ్ హై నహీ (తెలివితక్కువ వాళ్లకు నేను చెప్పేది ఏం లేదు)’ అని గోయల్ అంటరా? తెలివి తక్కువవాళ్లు ఎవరు? తెలంగాణ రైతులా? తెలంగాణ ప్రజలా? తెలంగాణ ప్రభుత్వమా? నీ బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ. బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన మంత్రో.. నా సమజ్ ఎవరో చెప్పాలి.
గోయల్ నీకు అంత అహంకారమా? అంత కండ కావరమా? మంత్రులు ఢిల్లీకి వస్తే పనిలేక వస్తరా అని అంటరా? ప్రజలకు నూకలు తినడం నేర్పాలంటవా? ఇదేనా మాట్లాడే తీరు. మీ బీజేపీ దౌర్భాగ్యపు నాయకులే రైతులను రెచ్చగొట్టి వరి సాగుచేయించారు. వాళ్లను వదిలిపెట్టం.. అంతుచూస్తాం. తెలంగాణ రైతులను, పౌరులను అవమానించిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు.
-మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ హెచ్చరిక
ఉద్యమ కార్యాచరణ
ఏప్రిల్ 4: అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు
ఏప్రిల్ 6: 4 జాతీయ రహదారులపై రాస్తారాకో
ఏప్రిల్ 7: జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళనలు
ఏప్రిల్ 8: ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం. ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలతో నిరసన.
ఏప్రిల్ 11: ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో 11న నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రెండో విడత కార్యాచరణను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎంతవరకైనా కొట్లాతుందని ప్రకటించారు. శనివారం తెలంగాణభవన్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు వరి సాగుచేస్తే కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనేకమార్లు ప్రకటించారని, ఇప్పుడు కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రకటించడంతోనే, సీఎం కేసీఆర్ రైతులకు వరి వేయవద్దని విజ్ఞప్తి చేశారని.. అప్పుడు వరివేయాలని రెచ్చగొట్టిన బండి, కిషన్‌రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం యాసంగిలో వరి వేయవద్దని చెప్తే, రాద్ధాంతంచేశారని గుర్తుచేశారు. వరి వేస్తే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయిస్తామని సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కేటీఆర్ మీడియాకు చూపించారు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తనదేనని బండి సంజయ్ మూడుసార్లు మాట్లాడారని, వరి వేయొద్దన్న సీఎం కేసీఆర్ మాటలను పట్టించుకోవద్దని కూడా అన్నారని గుర్తుచేశారు. సంజయ్ మానసిక పరిస్థితిపై కొన్ని అనుమానాలు ఉన్నాయనుకొన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా కేంద్రంతో వడ్లు కొనుగోలు చేయిస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
వన్ నేషన్ – వన్ రేషన్ ఉన్నప్పుడు, వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. పంజాబ్, ఇతర రాష్ర్టాల్లో కొన్నట్టుగానే తెలంగాణలో ధాన్యం కొనాలన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పిచ్చిగా, తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాట మన్నించి యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు తగ్గించారని, 35 లక్షల ఎకరాల్లో సాగుచేశారని చెప్పారు. బీజేపీ నేతలు అయోమయానికి గురి చేయడంతోనే ఆ మాత్రం సాగుచేశారని పేర్కొన్నారు. యాసంగిలో వరి ధాన్యం కొంటరా? కొనరా? చెప్పాలనే డిమాండ్‌తో నిరుడు నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేశారని, నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరం కలిసి ధర్నా చేశామని తెలిపారు. అయినప్పటికీ కేంద్రం స్పందించలేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్నది మూర్ఖపు, రైతు వ్యతిరేక, పిచ్చి ప్రభుత్వమని తేలిపోయిందని చెప్పారు. రైతులపై ప్రేమ లేని, తలాతోక లేని, కార్పొరేట్లకు వత్తాసు పలికే ప్రభుత్వమని తేలడంతోనే వరి సాగు వద్దని పిలుపునిచ్చామని తెలిపారు.
తీర్మానాలు చేసి పంపినా స్పందన లేదు
వరి ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితి కేంద్రానికి తెలియాలని, ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు, పీఏసీఎస్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలకవర్గాలు ధాన్యం కొనుగోలు తీర్మానంచేసి ప్రధాని, గోయల్‌కు పంపించాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తీర్మానాలు పంపి నాలుగైదు రోజులైనా దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఉలుకూ పలుకూ లేని కేంద్రం తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొన్నదని వెల్లడించారు. ‘నూకలు అలవాటు చేయండని తెలంగాణ ప్రజలను బీజేపీ అవమానించింది. మీకేం పనిలేదా అంటూ మంత్రులను అవమానించింది. రైతులను రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి వరిసాగు చేయించి బీజేపీ నాయకులు ఉసురుపోసుకొన్నారు’ బీజేపీ మాటలను ప్రజలను ముందు ఉంచుతాం. మరో ఉద్యమ కార్యాచరణ తీసుకొంటున్నాం’అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా రెండో విడత ఆందోళన కార్యక్రమాలను వివరించారు.
కేంద్ర మంత్రిపై హక్కుల తీర్మానం
నాలుగైదు ఏండ్లుగా బాయిల్డ్‌రైస్‌ను కేంద్రం గత సంవత్సరం విదేశాలకు ఎగుమతి చేసిందని, ఆ లెక్కలు కూడా బయటపెడుతామని కేటీఆర్ చెప్పారు. కోటి టన్నులకు పైగా ఎగుమతి చేశారని, ఆహార భద్రత కోసం సేకరించిన బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు చట్టం ఒప్పుకోదని, డబ్ల్యూటీవో ఆంక్షలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు, దగాకోరులా గోయల్ మాట్లాడారని మండిపడ్డారు. లక్షలాది మంది రైతుల కోసం ఆహార భద్రతా చట్టాన్ని సవరించలేరా అని నిలదీశారు. రాష్ర్టాలు వ్యాపారం చేసుకోవాలని సలహా ఇచ్చారని, ఒక రాష్ట్రం వేరే దేశాలతో నేరుగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌ను, దేశ ప్రజలను, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించిన పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని ప్రకటించారు. మీడియా సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, విప్ బాలరాజు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, జీవన్‌రెడ్డి, కేపీ వివేకానంద, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, క్రాంతి కిరణ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్ రెడ్డి, బండి రమేశ్ పాల్గొన్నారు.
పీయూష్ గోయల్‌పై ఫైర్
కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘నా సమజ్ కే లియే తో.. మేరే పాస్ బాత్ కర్నే కే లియే కుచ్ హై నహీ (తెలివితక్కువ వాళ్లకు నేను చెప్పేది ఏం లేదు)’ అని గోయల్ వ్యాఖ్యానించారని.. తెలివి తక్కువ వాళ్లు ఎవరో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రైతులా, తెలంగాణ ప్రజలా, తెలంగాణ ప్రభుత్వమా అని అగ్రహం వ్యక్తం చేశారు. నీ బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన మంత్రో నా సమజ్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. నీకు అంత అహంకారమా? అంత కండకావరమా అంటూ గోయల్‌పై కన్నెర్రజేశారు. ‘మంత్రులు ఢిల్లీకి వస్తే పనిలేక వస్తరా అని అంటరా? నాలుగు గంటలు పడిగాపులు కాశాం. పనిలేక ఢిల్లీకి వస్తమా. నువ్వు మంత్రివి కాబట్టి వచ్చినం. నిన్ను కలిస్తే రైతులకు ఏమైనా లాభం అయితదని వచ్చాం. మా ప్రజలకు నూకలు తినడం నేర్పమంటవా? ఇదేనా మాట్లాడే తీరు’ అంటూ గోయల్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బీజేపీ దౌర్భాగ్యపు నాయకులే రైతులను రెచ్చగొట్టి వరి సాగుచేయించారని, నేతలను వదిలిపెట్టబోమని..అంతుచూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ రైతులను, తెలంగాణ పౌరులను అవమానించిన ఏవరినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.
టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ
పార్లమెంట్‌లోనూ నిరసన
ఈ నెల 8 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతారని కేటీఆర్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపారిలా మాట్లాడుతున్నారు తప్ప, రైతుల పక్షాన మాట్లాడటం లేదని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు శృతి, లయ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దళారి పాత్ర పోషిస్తున్నదని బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఇలాంటి బేవకూఫ్‌ల మాటలు వినే రైతులు ఆగమాగంఅయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు: కేటీఆర్ ట్వీట్
కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టూ ఆల్’ అని ట్వీట్ చేశారు.