హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు అందరికీ ఇచ్చినా ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ.1.70 లక్షల కోట్లు. సంవత్సరానికి రూ.30 వేల కోట్లో.. రూ.40 వేల కోట్లో ఖర్చు వెట్టుకుంట పోతే మూడు నాలుగేండ్లల్ల మన దళితవాడలన్నీ బంగారు మేడలైతయి. నీ కొస్తదా? నా కొస్తదా? ఎల్లయ్యకు వస్తదా? మల్లయ్యకు వస్తదా? అని ఎవ్వరికీ అనుమానాలు వద్దు. ప్రతి కుటుంబానికీ వస్తది’ అని చెప్పారు. దళితబంధు పథకాన్ని సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
కిరికిరిగాళ్లకు హార్ట్ ఫెయిలయితది
అందరికీ పథకం ఇస్తే ఎక్కడికి పోతదో నాకు తెలుసు. ముందే లెక్కవెట్టుకున్న. ఈ లెక్కలన్నీ నేను ఒక్కటేసారి చెప్తే కిరికిరిగాళ్లు హార్ట్ ఫెయిలై సస్తరని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా. అందరికీ ఇచ్చుడు పెద్ద ఇష్యూయే కాదు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు అందరికీ ఇచ్చినా ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ.1.70 లక్షల కోట్లు. సంవత్సరానికి రూ.30 వేల కోట్లో.. రూ.40 వేల కోట్లో ఖర్చు వెట్టుకుంట పోతే మూడు నాలుగేండ్లల్ల మన దళితవాడలన్నీ బంగారు మేడలైతయి. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిననాడు నేను ఒక్కడినే. నా ఎంబడి పిడికెడు మంది మాత్రమే ఉన్నరు. పెద్ద పెద్ద రాకాసులతోని, భయంకరమైన పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడినం. అమాయకులైన తెలంగాణ జనాన్ని ఎంటేసుకొని జరిగిన పోరాటమది. 15 ఏండ్లు సుదీర్ఘంగా కొట్లాడి ఎైట్లెతే విజయాన్ని సాధించినమో దళితబంధును కూడా విజయతీరాలకు చేర్చుకుందం. గవర్నమెంటు జెయ్య కూసున్నంక. ఒక అడ్మినిస్ట్రేషన్ పట్టువట్టినంక వంద శాతం విజయం సాధిస్తది.
‘ఇయ్యాలటి నుంచి పట్టువడితే మన వాడలన్నీ బంగారు మేడలైతయి. వెన్నెల విరజిమ్ముతది’ అని గోరటి ఎంకన్న రాసిండు. ఆయన కల నెరవేరాలె. దానికోసం ఓపిక, నైపుణ్యం అవసరం. ఈ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చే గొప్ప సంస్కారం అవసరం. హుజూరాబాద్ కాడ నిన్న మొన్న కొంతమంది లడాయి చేసినరని తెలిసింది. లడాయి చేపిచ్చేటోడు రూ.10 లక్షలు ఇస్తడా మనకు? ఈ కిరికిరిగాళ్లు చేస్తరా? గతంలో చేశిర్రా? ఇప్పుడు చేస్తరా? అవసరమనుకొంటే మళ్లా 20 రోజుల్లో నేనే హుజూరాబాద్‌కు వస్త. అప్పుడు ఇంత ఆర్భాటం అవసరం లేదు. స్వయంగా కొన్ని మండలాలు తిరుగుత. దినమంతా గడిపి ఏం ఇబ్బందైతున్నదో, ఎట్లా ముందుకు పోవాల్నో చర్చిద్దం. మీ జిల్లా కలెక్టర్ మంచి అధికారి. ఈ ఉద్యమం గొప్పగా ముందుకు తీసుకుపోవాల్నంటే గొప్ప ఓపికమంతుడు కావాలని నేనే ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన.
సీఎంవోకు రాహుల్ బొజ్జా
రాహుల్ బొజ్జా ప్రస్తుతం ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్నడు. ఆయన కూడా దళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తారకం తెలంగాణ ఉద్యమకారులకు లాయర్‌గా పనిచేశిన్రు. రాహుల్ నేటి నుంచి సీఎంవోలో కార్యదర్శిగా ఉండాలె అని నేను, సీఎస్ నిర్ణయం తీసుకున్నం. రాహుల్ ఆదేశాలన్నీ అమలు కావాలె. పథకం అమలు మీద అపనమ్మకాలు అవసరం లేదు. గతంలో ఎక్కడా లేని పథకాలు ఇయ్యాల మన దగ్గర ఎట్ల సాధ్యమైతున్నయి? మనసున్న ప్రభుత్వాలు ఉంటే అయితది. ప్రజల అనుమానాలు, అపోహలు పటాపంచలు చేసి పేదరికంలో ఉన్నవాళ్లకు కావాల్సిన సహాయ, సహకారాలు అందుతా ఉన్నయి.
దళితులు కాలరెగరేయాలి
తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె. అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 75 లక్షల మంది దళిత ప్రజానీకం కూడా ధనిక ప్రజానీకమై కాలర్ ఎగరేసి, ‘ఎస్.. మాది తెలంగాణ. మేము దళిత సోదరులం. మేము పైకొచ్చినం’ అని చెప్పే రోజు రావాలె.
కొత్త బ్యాంకు ఖాతాల్లోనే దళితబంధు పైసలు
పాత అకౌంట్లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు వేసుకొని స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీకిచ్చే కార్డులో ఉండే ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీరు ఏం పెట్టుబడి పెట్టారు.. ఏ పని ప్రారంభించారు.. ఎంత విజయవంతమైందనే విషయంపై ప్రభుత్వం, జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తరు.
సింహాల్లా కదలండి
దళిత బిడ్డలారా, దళిత మేధావులారా.. దళిత సమాజం పెద్దలారా.. సింహాల్లా కదలండి. ఇది ఆషామాషీ పథకం కాదు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోపాటు దళిత సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ పర్యవేక్షిస్తరు. మొత్తం 23-25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నరు. దళితబంధు కమిటీలు వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది, రాష్ర్టానికి 42 మందితో కమిటీలు వేస్తున్నాం. వీళ్లంతా కలిస్తే లక్ష మందికి పైగా అవుతున్నరు. అంటే 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు, దళితబంధు కమిటీల్లోని లక్ష మంది సభ్యులు కలిసి 1.25 లక్షల మంది దళిత సైన్యం దళితబంధు పథకాన్ని పర్యవేక్షణ చేస్తది. వీళ్ల ఆధ్వర్యంలోనే దళిత రక్షణ నిధి ఏర్పాటైతది.
విద్యార్థులారా.. గ్రామాలకు వెళ్లండి
ఇక్కడ మన ఎర్రొళ్ల శ్రీనివాస్ ఉన్నడు. మొన్నటిదాకా ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. చాలా మంది విద్యార్థి నాయకులున్నరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన దళితవారు ఉన్నరు. దళిత మేధావులను ఒక్కటే కోరుతున్న.. దళిత విద్యార్థులందరికీ ‘గో టూ విలేజ్.. ఎడ్యుకేట్ ఆవర్ మాసెస్’ (గ్రామాల్లోకి వెళ్లండి.. మన ప్రజలను చైతన్యపరచండి) అని పిలుపునిచ్చి.. అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లోని దళిత విద్యార్థులందర్నీ ఒక వారం రోజులో పది రోజులో గ్రామాలకు పంపించి.. ప్రజలను చైతన్యం చేయాలి.
లబ్ధిదారుల ఎంపిక ఉండదు
దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఉండదు. అన్ని కుటుంబాలకు వస్తది కాబట్టి అధికారులే వచ్చి కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి అందరూ ఆనందంగా దళితవాడల్లో పండుగలు చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి.. అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ముగింపు సందర్భంగా.. దళితబంధుపై అందరం పట్టుబట్టి విజయం సాధించుదామా? అంటూ సీఎం సభికుల్ని అడగడంతో ‘సాధిద్దాం’ అంటూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. చిన్నగా కాదు.. పిడికిలి బిగబట్టి చెప్పాలె అంటూ వారిని సీఎం ఉత్సాహపరిచారు. జై దళితబంధు నినాదం చేసిన సీఎం కేసీఆర్.. సభికులతోనూ చేయించారు. చివరగా జై భీమ్.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పలువురికి లాంఛనంగా దళితబంధు చెక్కులను పంపిణీ చేశారు.
హుజూరాబాద్.. దేశానికి ఆదర్శం కావాలె
నేను చేపట్టింది ఏదీ వెనకకు పోలేదు. యావత్ తెలంగాణ సమాజం గర్వపడేలా, భారతదేశం మనదగ్గర నేర్చుకొనేలా ముందుకు పోవాలి. ఇంత గొప్ప పనిచేయాలంటే కావాల్సింది ఓర్పు-నేర్పు. ఈ స్కీం ఒక్క హుజూరాబాద్కో, పక్కనున్న హుస్నాబాద్కో పరిమితం కాకుండా మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలుకావాలి. ఇక్కడి అనుభవాలతోని స్కీంను బలోపేతం చేసి రాష్ట్రమంతా అమలు చేస్తం.
రూ.వేల కోట్లతో దళిత రక్షణ నిధి
దేవుని దయతప్పి.. ఏదైనా కుటుంబం ఇబ్బంది పాలైతే.. ఆ కుటుంబం మునిగిపోకుండా కాపాడుకోవాలి. ఇందుకోసం ఓ రక్షణ నిధిని అంతర్గతంగా ఏర్పాటు చేస్తున్నం. మీకిచ్చే రూ.10 లక్షల్లో రూ.10 వేలు పక్కకు పెడతం. ప్రభుత్వం కూడా మరో రూ.10 వేలు జమ చేస్తది. హుజూరాబాద్‌లో ఓ 25 వేల దళిత కుటుంబాలు ఉన్నయనుకొంటే ఒక్కొక్కరు రూ.10 వేలు జమచేస్తే రూ.25 కోట్లు అయితయి. ప్రభుత్వం మరో రూ.25 కోట్లు ఇస్తది. ఈ రూ.50 కోట్లు హుజూరాబాద్ దళిత ప్రజలకు రక్షణనిధిగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఆపాయం వచ్చినా, ఇబ్బంది అయినా ఆ కుటుంబం కిందికి పోకుండా ఈ రక్షణ నిధి కాపాడుతుంది. మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి రూ.40-50 కోట్లు జమైతయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు దళిత రక్షణకు బ్యాంకుల్లో ఉంటయి. మీరు ఇక కిందికి పోయే ప్రశ్న లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో పేదరికంలో కూరుకుపోయే సందర్భం రానేరాదు.
ఆ పథకాలను దళితులు ఏనాడూ వ్యతిరేకించలేదు
ఏదీ ఆషామాషీగా కెలికి ఊరుకోడు కేసీఆర్.. ఏదిచేసినా బ్రహ్మాండంగా చేస్తడు. గత ఏడేండ్ల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నం. దాదాపు లక్ష కోట్లు రైతాంగంకోసం ఖర్చు పెట్టినం.. ఇంకా పెట్టబోతున్నాం. దీన్ని ఏనాడూ దళితులు వ్యతిరేకించలేదు. రూ.11 వేల కోట్లు పెట్టి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సోదరులకు గొర్రెల స్కీం అమలు చేస్తున్నం. ‘సార్.. మాకు కూడా ఏదన్నా చేయలి’ అని అడిగారే తప్ప దళితులు వ్యతిరేకించలేదు. తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి.. దండం పెట్టి అప్పీలుచేస్తున్నా.. వాళ్లను కూడా బాగు చేసుకుందం. మన పక్కన్నే ఉండే దళితవాడలో వాళ్లు బాధపడుతుంటే.. మూలుగుతుంటే, పేదరికంలో మగ్గుతుంటే మన గుండెలు కూడా ద్రవించిపోతున్నయి. ఎప్పటివరకు మన దళితులు బాగుపడరో అప్పటివరకు మన సమాజం బాగా లేనట్లే లెక్క. శరీరంలో ఒక చెయ్యికి పుండు అయితే అది పండుకోనియ్యది. అట్లనే సమాజంలో ఓ పెద్ద భాగం దరిద్రంతోని, పేదరికంతో ములుగుకుంటా, వివక్షతో మగ్గుతూ కునారిల్లడమనేది ఏ సమాజానికీ మంచిది కాదు. ధర్మం కూడా కాదు. మనందరం పట్టుబట్టి, జట్టుకట్టి యావత్ తెలంగాణ జాతి.. మన దళిత జాతిని బాగు చేసుకొందం. మన దళితజాతిలో ఉన్న రత్నాలను వెలికి తీసుకొద్దం. దళితజాతిలోని శక్తిని బయటికి తీసుకొద్దం. ఆ శక్తితోని మన రాష్ట్ర ఎకానమీ పెరుగుతది. అవకాశాలొస్తే.. మన దళితులు పెట్టుబడిదారులైతే.. వాళ్లు చేసే సృజన అద్భుతమైన ఆర్థిక ప్రగతికి దోహదపడుతది.