హైదరాబాద్ : 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించింది. కానీ, ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు. దేశంలో దళితవర్గం పట్ల సామాజిక వివక్ష, అణచివేత నేటికీ కొనసాగుతున్నది. ఫలితంగా దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోయాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో దళితబంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. యావత్ దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, వచ్చిన పనిని లబ్దిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం అని తెలిపారు.
దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ని కూడా ఏర్పాటు చేసింది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టడానికి ఈ నిధి దోహద పడుతుందన్నారు. దళితులు వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో దళితులకు పదిశాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గత ఏడాది దళితబంధు పథకం ద్వారా దాదాపు 40 వేల కుటుంబాలకు లబ్ది చేకూరింది అని కేసీఆర్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం స్పష్టం చేశారు.