– సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ
సూర్యాపేట, ఫిబ్రవరి 09 : గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్‌కు లొంగితే వార్డుల్లో అభివృద్ధి నిర్వీర్యం అవుతుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మేక భారతి తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి గతంలో కౌన్సిలర్‌గా గెలిచి భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా వదిలేస్తే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదరించి అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం హేయనీయమన్నారు.
ఎన్నికల సమయంలో కార్చే కన్నీళ్లకు, సెంటిమెంట్లకు లొంగితే ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ వార్డు సమస్యలను అవగతం చేసుకుని మీకోసం తానున్నా అంటూ వస్తున్న మేక భారతి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్ పాలెం సర్పంచ్ ఉప్పల సైదులు, బీఆర్ఎస్ సూర్యాపేట మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బడుగుల సైదులు, బొమ్మగాని శ్రీనివాస్, మద్ది శ్రీనివాస్, మద్ది ఉపేందర్ రెడ్డి, ఈదుల శంకరయ్య, అనంతుల వాసుదేవరెడ్డి, కోటమ్మ, విజిత, రేణుక పాల్గొన్నారు.