Congress | నమస్తే తెలంగాణ నెట్వర్క్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి. అవగాహన లేమితో అడ్డగోలు ప్రేలాపనలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రైతులను ముంచేందుకు మళ్లీ తయారయ్యారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలపాటు నిరంతరం సరఫరా అవుతున్న కరెంటుతో రైతన్న భూముల్లో బంగారు పంటలు పండుతుంటే చూడలేని రేవంత్ వంటి కాంగ్రెస్ నేతలు రాష్ర్టాన్ని తిరిగి ఉమ్మడి పాలన నాటి కాలానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టున్నారని మండిపడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్న కాంగ్రెస్ నేతల ప్రకటనలపైనా అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు. 50 ఏండ్ల నాటి పటేల్, పట్వారీ వ్యవస్థ తమకొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారుల గోస లేని ధరణి ఉండగా మరేదీ తమకు వద్దని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
10 హెచ్‌పీ మోటర్ వాళ్లు కొనిస్తరా?
గతంల మా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంటుండె. కరెంట్ సరిగ్గా ఉండక ఎవుసం ఆగమైతుండె. నెలకు రెండుమూడు సార్లు మోటర్లు కాలుతుండె. రాత్రి పూట ఇచ్చే రెండు మూడు గంటల కరెంట్‌కు పొలాల కాడ జాగారం చేసేటోళ్లం. రాత్రిళ్లు పురుగులు, పాములు, తేళ్లు కుట్టేవి. ఎంతోమంది ప్రాణం పోయింది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యారో కరెంట్ కష్టాలు తప్పినయి. 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తున్నది. నాటి లెక్క మోటర్లు కాలుతలేవు. ఎప్పుడంటే అప్పుడు పొలానికి పోయి కరెంట్ పెట్టుకొని నీళ్లు పారించుకుంటున్న. కాంగ్రెసోళ్లు ఎవుసానికి మూడు గంటల కరెంట్ ఇస్తమని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నరు. మూడు గంటల కరెంట్‌తో ఎకరం కూడా పారది. ఇక అంత పెద్ద మోటర్ వాళ్లు కొనిస్తరా? ఇవన్నీ పనికిరాని మాటలు. కేసీఆర్ సార్ మంచిగా పని చేస్తున్నరు. మేమంతా అండగా ఉంటాం.
-ఏలేటి చంద్రారెడ్డి, రైతు, రాజారాంపల్లి, జగిత్యాలగ
ఎవుసపోని బాధ రేవంత్కేం తెలుసు
24గంటల కరెంటు ఇచ్చుడుతో కేసీఆర్ గవర్నమెంట్‌కు మంచిపేరు రావట్టే. ఇది ఓర్వలేక రేవంత్‌రెడ్డి మస్తు మాట్లాడుతడు. ఎవుసపోని బాధ ఆయనకేం తెలుసు. మూడు గంటలల్ల ఎకరం పొలం పారిత్తడంట ఈ మొగోడు. ఎవ్వలన్న ఒప్పుకునే ముచ్చటేనా ఇది. 24 గంటల కరెంటు ఇస్తే మరి ఆయనదేం బోయింది.
ఆయనయన్నీ తొండి మాటలు, కొంటె చేష్టలు. ఎనకట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడస్తుండెనో, ఎప్పుడు పోతుండెనో బాయిల కాడికి పోయి కరెంటు కోసం కావలి కూసునే పరిస్థితి ఉండే. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇయ్యకపాయె. ఏదో తిప్పల బడి కేసీఆర్ ఇస్తుండు. ఇచ్చేటోన్ని కాళ్లల్ల కట్టెబెట్టుడు మంచిదా ఇది. కరెంటు విషయంల ఎవుసపోల్లకు ఏం రంది లేదు. బిల్లు లేకుండా 24 గంటలు కరెంటు ఇడుస్తున్నరు. నాకు ఆరు ఎకరాల ఎవుసంల రెండు బోర్లు, ఒక బాయి ఉన్నది. ఉల్లిగడ్డ, పత్తి, వరి పండిస్తా. ఎప్పటికీ కరెంటు ఉంటే నీళ్లు పారబెట్టనికి ఆత్రం ఉండది. మనకు వీలైనప్పుడల్లా వచ్చి పారబెడ్తం. అన్యాయం మాట్లాడొద్దు. కరెంటు విషయంల కేసీఆర్ సర్కార్ మంచిగనే చేసింది. మూడు గంటల కరెంటు చాలు అని రేవంత్ నోరుజారి ఎవుసపోల్లకు మేలు చేసిండు. లేకుంటే ఓట్ల కోసం చెప్పే మాటలకు కాపోల్లు మోసపోతుండె. కరెంటు గురించి మాట్లాడితే కేసీఆర్ సర్కార్ లెక్క ఎనకటికి ఎవ్వలు జెయ్యలే. ఇంక ముందట గూడ ఎవ్వలు చెయ్యరు. ఇది గ్యారంటీ.
-చాకలి సాయిలు, సత్యగామ, నారాయణఖేడ్ మండలం,సంగారెడ్డి జిల్లా
దళారులు లేరు.. మధ్యవర్తులు లేరు
ధరణితో దళారులు లేరు.. మధ్యవర్తులు లేరు. ఆన్లైన్ కావడంతో ఆఫీస్‌లో క్షణాల్లో అయిపోతున్నది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. భూమి రికార్డుల తిప్పలు తప్పినయ్. గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్నాం. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తమని అంటున్నరు. ఇగ మళ్ల రైతులకు ఇబ్బందులే. గతంల భూమి రికార్డులు సక్కగ లేకనే ఆఫీస్‌ల చుట్టూ తిరిగి గోస పడ్డం. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా సీఎం కేసీఆర్ కొత్తగా ధరణి పోర్టల్ తీసుకొచ్చి మాకు పట్టాబుక్లు ఇచ్చిండు. రైతుబంధు పథకం పైసలు సమయానికి వస్తున్నయ్. ఆన్లైన్లో భూరికార్డులు భద్రంగా ఉండడంతో ఆనందంగా వ్యవసాయం చేసుకుంటానం. గతంల ఏచిన్న భూ సమస్య వచ్చినా ఆఫీస్‌ల చుట్టు తిరిగినా పనికాకపోయేది. తెలంగాణ వచ్చినంక రైతులకు కష్టాలు దూరమైనయ్.
– ఎండీ సలీం ఖాన్, రైతు, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి
౩ గంటల కరెంట్‌తో దొయ్యకూడ తడ్వది
కాంగ్రెసోళ్లు చెప్పినట్టు మూడు గంటల కరెంటిస్తే ఒక్క దొయ్యకూడా తడ్వది. 10హెచ్‌పీ మోటర్లు పెట్టి ౩గంటల కరెంటిస్తే బోర్‌బావుల్లో ఉన్న నీళ్లన్నీ అయిపోతయ్. మోటర్ కొనడానికి డబుల్ ఖర్చులైతయ్. ప్రతి మడికి పైపులు వేయాల్సివస్తది. కరెంట్ ట్రిప్ అయితది.లోడ్‌పడి మోటర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతయ్. పంటలు ఎండిపోతయి. మళ్లా పాత కథే అయితది. రైతులంతా అప్పుల పాలవుడే తప్ప మరేం ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే కరెంట్‌తో రంది లేకుండా ఎవుసం చేసుకుంటున్నం. ఈ రోజు నేను పండిచిన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల్లో తీసుకపోతున్నారు. కాంగ్రెసోళ్లను నమ్ముకుంటే మళ్లా దుఃఖమే. గా తెలంగాణ అచ్చిననంకనే రైతుకు పతారా పెరిగింది. భూముల ధరలు మస్తు పెరిగినయి. ఎవుసం మంచిగ సాగుతున్నది. మళ్లీ కరెంట్ ౩గంటలు అని మమ్మల్ని ఆగంజేయద్దు. ఇప్పుడే కరెంట్ మంచిగున్నది.
– గోపాల్‌నాయక్, రైతు, బద్రియతండా, చిలిపిచెడ్ మండలం, మెదక్ జిల్లా
మూడుగంటల కరెంటుతో నారుమడి కూడా పారదు
రైతులు బాగుపడడం కాంగ్రెస్‌కు ఇష్టం ఉండదు. మూడు గంటల కరెంటుతో నారుమళ్లు కూడా తడవవు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు మూడుగంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లతో లాభం ఉండదు. రైతులంతా ఒకేసారి మోటర్లు చాలు చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి. సమపంలోని సబ్స్టేషన్లపైనా భారంపడి ఇండ్లలో కరెంటుకు ముప్పు వస్తుంది.
Farmers
1౦ హెచ్‌పీ మోటర్లు మూడు ఒకేసారి స్టార్ట్ చేస్తే మూడు సెకన్లలోనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. రైతుల గోస మళ్లీ మొదలువుతంది. గిప్పుడు సర్కారు 24 గంటల కరెంటు ఇస్తున్నది. పంటలు మంచిగా పండుతున్నయ్. 10హెచ్‌పీ మోటరు పెడితే భూగర్భ జలాలు కిందికి పడిపోతాయి. బోర్లో నీటి ఊటలు అందుబాటులో లేకుండా అవుతాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతులమంతా సంతోషంగా ఉన్నాం. సచ్చినా కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మం. వాళ్లకు ఓటేస్తే మా బతుకులు మళ్లీ ఆగం చేస్తరు.
-దేవిరెడ్డి కోటిరెడ్డి, రైతు, సుబ్బారెడ్డిగూడెం, నల్లగొండ
అంత పెద్ద మోటర్ పెట్టుడు సాధ్యం కాదు
కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు 10 హెచ్‌పీ మోటర్ వాడకం సాధ్యం కాని పని. అట్ల ఎందుకు అంటున్రో వాళ్లకే తెల్వాలి. రైతులు పైన మోటర్ అయితే ౩ హెచ్‌పీ, నీళ్ల మోటర్ అయితే ౫ హెచ్‌పీ వాడుతరు. 10 హెచ్‌పీ మోటర్ అనేది పరిశ్రమలు ఉన్నోళ్లు వాడుతుంటరు.
గామోటర్ రైతులు పెట్టాలంటే ఎంతో ఖర్చయితది. ఆ ఖర్చులు ఎవరు భరించాలె. రైతులను కాంగ్రెస్ అయోమయంలో పడేస్తున్నది. 10 హెచ్‌పీ మోటర్‌కు ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌ఫార్లర్లు పని చేయవు. అంత పెద్ద మోటర్ వాడితే స్టార్టర్లతో పాటు పైప్‌లైన్ కూడా మార్చుకోవాలె. గివన్నీ రైతులకు అవసరమా? రైతులను ముంచడానికే కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడుతున్నరు. గిప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న కరెంటే కరెక్ట్‌గా ఉంది. 24 గంటలు ఉచితంగా ఇస్తన్రు. రైతులందరం సంబురంగా ఎవుసం చేసుకుంటున్నం.
– పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, రైతు, గుండ్లపల్లి, పెద్దపల్లి
రైతులను ఆగం చేసే కుట్ర
సీఎం కేసీఆర్ పుణ్యాన ఇప్పుడు పంటలకు పుష్కలంగా కరెంట్ అందుతున్నది. స్టార్టర్ ఎప్పుడు ఒత్తితే అప్పుడు మోటర్లు నీళ్లు పోస్తున్నాయి. 24 గంటల కరెంట్ వల్ల ఎవరికి ఎప్పుడు వీలుపడితే అప్పుడు పొలానికి వెళ్లి మోటర్లు ఆన్ చేస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం లేదు. తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పడం సరికాదు. అందరూ 10 హెచ్‌పీ మోటర్లు పెట్టి, అందరూ ఒక్కసారి ఆన్‌చేస్తే ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మిగలదు. అన్నీ కాలిపోతాయ్. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే రైతులను ఆగం చేసే కుట్రలు పన్నుతున్నట్టు ఉంది. వారేదో కిరికిరి పెట్టాలని చూస్తున్నరు. కాంగ్రెస్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
-కొత్త రవి, రైతు, పొన్నెకల్, ఖమ్మం
ఆరు గంటలకే అరిగోసవడ్డం
ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గంటల కరెంట్‌కే అరిగోసవడ్డం. ఇప్పుడు మూడు గంటలే సాలంటన్రు. రైతులను మళ్లీ బిచ్చమెత్తుకునేటట్టు చేత్తామనుకుంటన్రు. రైతులు ఇప్పుడిప్పడే తెల్లగ బతుకుతన్రు. ఆనాడు రైతులు పడ్డ కష్టాలు గుర్తుకు అత్తలేవా? ఇచ్చేది ఆరుగంటలే. దాంట్ల లైన్లు మార్చుకుంట కరెంట్ ఇచ్చేటాళ్లకు తలపాణం తోకకచ్చేది.
పంటకు నీళ్లువెడితే గంటసేపయినా మోటర్ సక్కగ ఒత్తదో లేదో.. నీళ్లయిపోతయో, కరెంట్వోతదో అని బిక్కుబిక్కుమనిజూసేది. ఎకరం పొలం పారడానికి పొద్దంతా ఎదురుజూసేది. రాత్రి మోటర్లు తక్కువ వోత్తయని బాయిలకాడికి వోయి నిరారం కావలి ఉండి పొలం పారిచ్చుకునేది. నాకున్న నాలుగున్నర ఎకరాలు పంట ఏస్తె రెండెకరాలే సేతికి అచ్చేది. ఎవుసం జేయాలంటే పాణాలు పణంగ పెట్టాల్సి అచ్చేది. నానాగోసలు వడ్డం. తెలంగాణ సర్కారు అచ్చినంక సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గట్టి నీళ్ళను దీసుకచ్చిండు. బాయిల్ల ఊట వెరిగి చేయివెడితే అందెటట్టు ఉన్నయి. వానకాలం, ఎండకాలం అనే తేడా లేకుంట నీళ్లు పుష్కలంగ ఉంటున్నయి. ఇగ కరెంటయితే 24 గంటలు ఉంటంది. మా గోసలు దీరినయి అనుకుంటన్న టైంల మళ్లా కాంగ్రెసోళ్లు ఎవుసానికి మూడు గంటలు కరెంట్ సాలు.. 10 హెచ్‌పీ మోటరు పెట్టాలె అని అంటన్రు. మూడు గంటల కరెంట్‌కు ఎకరం గూడావారది. 10 హెచ్‌పీ మోటర్లు కొనాలంటే రైతులు అప్పులు జేయాల్సి అత్తది. ఆ కాంగ్రెస్ మాకద్దు.. సీఎం కేసీఆర్ సారే మళ్లా గెలువాలె.
– పెద్ది సమ్మిరెడ్డి, రైతు, చల్లూరు, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా
బాగుపడ్డ ఎవుసాన్ని ఖరాబ్ చేసుకోం
నేను చిన్నకారు రైతును. ఉన్నపాటి పొలంలో సర్కారు పథకాలతో మంచి కరెంటు, నీటి సరఫరాతో సుఖంగా ఉంటున్న. మంచిగా ఉన్న జీవితంలో కొత్త సమస్యలు తెచ్చుకోం. కాంగ్రెస్ పార్టీ నాయకులు పథకాల పేరు చెప్పి మమ్మల్ని గోస పెట్టేందుకు చూస్తున్నరు. కాంగ్రెస్ సర్కారులో రాత్రి పొలాల వద్ద నీటి గోసలు పడ్డాం. అవి ఇంకా గుర్తుకున్నయ్..
Farmers
ఇప్పుడు కరెంటు మంచిగా అస్తుంది. పంటలకు కావాల్సిన నీరు మంచిగా అందుతున్నది. బోర్లు పాతవే మంచిగున్నయి. 10 హెచ్‌పీ బోర్లు పెట్టుకోమంటే మళ్లీ కరెంటు తిప్పలు తప్పవు. మాకు పంట పొలాల్లో నీటి పారుదల మంచిగా చేసుకునేందుకు కరెంటు మంచిగా అందిస్తున్నరు. రాత్రి పంట పొలాల్లో నీరు పారించేందుకు వెళ్లే అవసరం లేకుండా పోయింది. మళ్లీ కరెంటు కోతలు లేకుండా ఉండాలంటే, కరెంటు మంచిగా రావాలంటే తెలంగాణ సర్కారుకే ఓటు వేస్తా… బాగైన వ్యవసాయాన్ని తిరిగి ఖరాబ్ చేసుకోం.
– కేతావత్ టోప్యా నాయక్, రాజీవ్‌నగర్ తండా, నిజామాబాద్
కాంగ్రెసోళ్ల కోసమే ధరణి తీస్తమంటున్నరు
ధరణిని తీసేసి కాంగ్రెసోళ్లు బాగుపడుదామనుకుంటున్నరు. గిప్పుడు గా పోర్టల్‌తోనే రైతుల భూములకు భద్రత ఉన్నది. గతంలో దళారులకు ఎంతో కొంత ముట్టజెప్పితనే పనులయ్యేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి తేవడంతో ఆ తిప్పలు తప్పినయ్. నేను మూడేండ్ల కింద రెండెకరాల భూమి కొన్నా. అంతకుముందు నాకు ఎకరం భూమి ఉండే. నా వద్ద పాత పాస్‌బుక్ ఉండడంతో కొత్తగా కొన్న భూమి వివరాలు రిజిస్ట్రేషన్ రోజే నా బుక్కులో అధికారులు రాసిన్రు. రూపాయి ఖర్చు కాలేదు. గంట సమయం కూడా పట్టలేదు. ధరణి వల్ల అన్ని విధాలా కరెక్టుగా ఉన్న భూములు అమ్మడం, కొనడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ రిజిస్ట్రేషన్ల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ బాగుంది. కొత్త పాస్‌బుక్‌లో కొన్న భూమి వివరాలు నమోదు కావడంతో నాకు రైతుబంధు కూడా అందుతున్నది. ఎవరు ఏమన్నా ధరణి చాలా బాగుంది. ఎన్నికలచ్చినయని ఒక్కో పార్టీ ఒక్కో రకం కథ మొదలుపెడుతది. మనం నమ్మొద్దు. నమ్మితే ఆగమైతం.
-అరుణ్ గణేశ్, ఇచ్చోడ, ఆదిలాబాద్
పట్వారీల వేధింపులు ఇప్పటోళ్లకు తెల్వదు
పటేళ్లు, పట్వారీలు ఎట్లుండెనో, వాళ్లు ఎట్ల పీడించెనో ఇప్పటోళ్లకు తెల్వదు. అందుకే కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ అట్లాంటోళ్లను చూడాల్సొస్తది. వాళ్లయితే ఒకరి పేరు మీదున్న భూమిని మరొకరి పేరుమీద రాసేటోళ్లు. భూమి ఒక దగ్గర, సర్వే నంబర్ ఇంకో దగ్గర ఉండేవి. దాన్ని సరిచేయాలంటే వాళ్లు చెప్పినట్టు చెయ్యాలి. గ్రామాల్లో మాట వినని రైతుల భూముల వివరాలను తారుమారు చేసేటోళ్లు. రైతులు వారి చెప్పుచేతుల్లో ఉండేలా పటేళ్లు, పట్వారీలు చేసెటోళ్లు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు చెబుతున్నట్టుగా ధరిణిని తీసేస్తే మళ్లీ ఇదే పద్ధతి వస్తది. కాంగ్రెస్‌వన్నీ పాతకాలపు విధానాలు. వాటితో ఎన్ని తిప్పలు పడ్డామో మాలాంటి రైతులందరికీ తెలుసు. అందుకని ఏ రైతు కూడా కాంగ్రెసోళ్ల మాటలను నమ్మరు. పొరపాటున నమ్మితే మాత్రం ఆగమవుడు ఖాయం.
-చీమల రామస్వామి, రైతు, కొల్లాపురం, ఇల్లెందు మండలం, భద్రాద్రి జిల్లా