హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు జనగణన చేపట్టడం లేదు? దీని వెనుక ఏం కారణం ఉన్నది?’ అని కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో 1871లో జనగణన మొదలైందని, 1881లో మొదటి జనాభా లెక్కలు ప్రకటించారని గుర్తు చేశారు.
గత 140 ఏండ్లలో 2011 వరకు ఏ ఒక్కసారి కూడా జనగణన ఆగలేదని తెలిపారు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ దానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా జనగణన ఆపలేదని చెప్పారు. కానీ, మోదీ హయాంలో మొదటిసారిగా జనగణన ఆగిపోయిందని మండిపడ్డారు. ‘జనగణన జరిగితేనే దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుస్తుంది. అదే జరిగితే బండారం బయటపడుతుందని వీళ్ల బాధ’ అని పేర్కొన్నారు. ‘ఈ రోజు బీసీ కులాలవాళ్లు కుల గణన చేయాలని అడుగుతున్నరు. ఎందుకు చేయరు? ఎస్సీలు 15 శాతం అని ఎప్పుడో జమాన్ల నిర్ణయం చేశారు.
నాకు తెలిసి ఇప్పుడు 16.5-17 శాతం దాటిపోయారు. కొన్ని రాష్ర్టాల్లో 19 శాతం కూడా దాటినరు. ఈ రోజు జనగణన జరిగితే ఇంకో రెండు శాతం రిజర్వేషన్ పెరుగుతుందని ఎస్సీ బిడ్డలు ఆశపడుతున్నరు’ అని వివరించారు. జనగణన లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా పరిపాలన చేయలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రణాళిక బద్ధమైన పరిపాలన ఉండాలంటే జనగణన అనేది బేసిక్ ఇన్పుట్. వితౌట్ సెన్సెస్ యు విల్ నెవర్ హావ్ ఏ బేసిక్ ఇన్పుట్.
ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం చీకట్లోకి బాణం కొడుతున్నది. లెక్కలేదు.. ఆచారం లేదు.. మేం చెప్పిందే లెక్క.. మేం మాట్లాడిందే మాట.. వింటే విను.. లేకపోతే చంపేస్తాం అన్నట్టు వ్యవహరిస్తున్నరు. జనగణన మీద ప్రతి అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలె’ అని స్పష్టం చేశారు. ‘దాల్ మే కుచ్ కాలా హై.. యే బీ సోంచ్నేకీ బాత్ హై’ అంటూ జనగణన ఆపడం వెనుక ఏదో కుట్ర దాగున్నదని అనుమానం వ్యక్తం చేశారు.