KCR | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జైళ్లో చిప్పకూడు తిన్నా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దొరికిన చోటల్లా భూ కబ్జాలకు పాల్పడిన రేవంత్‌ను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదల భూము లు గుంజుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేసి భూమాత తెస్తామని చెప్తున్నదని నిప్పు లు చెరిగారు. కొడంగల్, పరిగి, తాండూరు, మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘రేవంత్‌రెడ్డి పెద్ద భూకబ్జాదారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేసిండు. పొద్దున లేస్తే ఆయన దృష్టంతా కబ్జాల మీదనే ఉంటది. మహబూబ్‌నగర్ జిల్లాలోనే అనేక భూ కబ్జాలు చేసిండు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికిన దొంగ. ఇంకా సత్యహరిశ్చంద్రు డి లెక్క మాట్లాడితే ఎట్లా? కామారెడ్డిలో ప్రజ లు అంగి ఊడదీసి ఉతుకుతున్నరు. కొండగల్‌లో లాగు ఊడదీసేలా ఓడించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదరికం లేని తెలంగాణను చూడటమే తన కల అని ప్రకటించారు. ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పా రు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, పదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరి కండ్లముందే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా పెన్షన్ రూ.2 వేలు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని రూ.5 వేలు చేస్తాం. కంటివెలుగు, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పెట్టి తొలుత పేదల సంక్షేమాన్ని చేపట్టాం. వ్యవసాయ స్థిరీకరణపై దృష్టిసారించాం. మా రుమూల పల్లెలకు, తండాలకు కూడా తాగునీరు ఇచ్చాం. ప్రజలకు ఏవి అవసరమో తెలుసుకొని మానవీయకోణంలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. రైతు పక్షాన, ప్రజల పక్షాన ఉండేటోళ్లను కాపాడాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో పోల్చి చూడాలి. అభ్యర్థుల గు ణగణాలతోపాటు అంతకంటే వారి వెనుక ఉన్న పార్టీల చరిత్రను, పాలసీలను, పేదలు, రాష్ట్రం గురించి పార్టీ దృక్పథాన్ని, అవగాహనను చూసి ఓటేస్తేనే ఐదేండ్లపాటు మంచి పరిపాలన అందుతుంది’ అని సీఎం కేసీఆర్ అ న్నారు. ఎన్నికల తర్వాత రైతుబీమాను రూ. 16 వేలకు పెంచుతామని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో ముస్లింల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. బీజే పీ భయం చూపి ముస్లింలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా వాడుకొన్నదని విమర్శించారు. మైనార్టీ యువత కోసం తాము ప్రత్యేక ఐటీ పార్క్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు చూ డాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు.
రైతుబంధు దుబారా అన్న కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వద్దంటున్నారు. 3 గంటలు సరిపోతుందని చెప్తున్నారు. అదెట్ల అని అడిగితే 10 హెచ్‌పీ మోటర్లు కొనుక్కోవాలని చెప్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల బో ర్లు ఉన్నాయి. వాటన్నింటికి 10 హెచ్‌పీ మోట ర్లు ఎవరు కొనివ్వాలి? పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు మళ్లీ కాట కలుస్తది. గతంలో రైతుల బతుకులు ప్రభుత్వం చేతిలో ఉండే. మేం ఆ అధికారాన్ని రైతులకే అప్పగించాం. అ లాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాట్లాడుతున్నారు’ అని సీఎం మండిపడ్డారు.
ఇక పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి. నూరుశాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలె. ఈ రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలేదాక పనిచేయాలనే ఉద్దేశంతోనే ఫైట్ చేస్తున్నం. నేను ఇప్పటికే మీ దయతో రెండుసార్లు సీఎం అయ్యాను. ఇక నాకు పదవని కాదు.. తెలంగాణ అన్నింట్లో నంబర్-1 కావాలనే కమిట్మెంట్తోని కొట్లాడుతున్న.
-సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం 3,500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చటంతో ఇప్పు డు లంబాడా బిడ్డలే సర్పంచ్‌లుగా అభివృద్ధి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘హైదరాబాద్‌లో పేరుకే బంజారాహిల్స్. కానీ సమైక్యపాలనలో అక్కడ బంజారాలు లేకుంటపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఎయిర్కండిషన్డ్ బం జారా భవన్‌ను, బ్రహ్మాండమైన హాల్‌ను నిర్మించింది. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నం. బీఆర్ఎస్కు సేవాలాల్ సేన మద్దతు తెలపడం ఆనందంగా ఉన్నది. అందుకు నా కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో లంబాడాలు, బంజారాలు కోరినవన్నీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
నరేందర్‌రెడ్డి గెలిచాకే కొడంగల్ ఎంతో అభివృద్ధి చెందిందని, నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకుని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కేసీఆర్ ప్రశంసించారు. బస్‌డిపో, డిగ్రీ కాలేజీ, రోడ్లు వచ్చాయని చెప్పారు. ఈ సారి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన స్థాయి పెరుగుతదని, ప్రమోషన్ వస్తదని చెప్పారు. ‘కొడంగల్ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక రోజు నేనంతా ఇక్కడే ఉండి ఎన్ని వందల కోట్లు కావాలంటే అంత ఇస్తం. పరిశ్రమలు, ఉద్యోగాలు, రోడ్లు, పారిశ్రామికవాడలు కావాలని అడుగుతున్నరు. అన్నీ చేస్తం. నరేందర్‌రెడ్డి గెలిస్తే ప్రజలకు లాభమైతది. రేవంత్‌రెడ్డి గెలిస్తే పైరవీకారులకు లాభమైతది. కొడంగల్‌ను అభివృద్ధిచేసే బాధ్యతనాది. పాలమూరు రంగారెడ్డి నీళ్లు యాడాది కాగానే వస్తయి. ఈ ప్రాంతం సస్యశ్యామలమైతది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
పరిగిలో 52 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని, రిజర్వేషన్లు ఇచ్చామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రారంభించామ ని, అందరికీ అందేవరకూ ఈ పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కులం, మతం లేకుండా అందరినీ కలుపుకొని పోతున్న పార్టీ బీఆర్ఎస్ అని, అన్ని వర్గాలకూ మేలు జరిగే విధంగా ప్రవేశపెట్టామన్నారు. ‘మహేశ్‌రెడ్డి నా మిత్రుడు హరీశ్వర్‌రెడ్డి కొడుకు. హరీశ్వర్‌రెడ్డి నాకు చాలా సన్నిహిత మిత్రుడు. 20-30 ఏండ్లు మేము కలిసి పనిచేశాం. మహేశ్‌రెడ్డి కూడా నా కొడుకులాంటి వాడు. పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐతోపాటు మరో రెండు మండలాలు కావాలని కోరుతున్నారు. ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లోనే వాటిని 100 శాతం మంజూరు చేయిస్తా. వచ్చే ఎన్నికల్లో పరిగిలో మహేశ్‌రెడ్డిని గెలిపించండి. నేనే స్వయంగా పరిగి వచ్చి, ఒకరోజు అక్కడే ఉండి అన్నీ చేయిస్తా’ అని హామీ ఇచ్చారు.
తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలన్నడట. అట్లున్నది కాంగ్రెస్ తీరు. మళ్లీ పైరవీకార్లను తెస్తం, వీఆర్వోలను తెస్తం అంటున్నారు. బీఆర్ఎస్కంటే మంచిగ చేస్తామని చెప్పాలి కానీ ఉన్నదంతా ఊడగొడతం అంటే అర్థమేంది? కాంగ్రెస్ తీసుకొచ్చేది భూమాత కాదు. భూ మేతనే. ధరణి తీసేస్తే మళ్లా పట్వారీ రాజ్యం, దళారులు, లంచగొండుల రాజ్యమొస్తది.
-సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్ గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎట్లయిందో అందరూ ఆలోచించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘మహబూబ్‌నగర్‌లో అప్పట్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవి. మహబూబ్‌నగర్‌లో ఎంపీగా ఉన్నప్పుడు నా సిగ్గు పోయినంత పనయ్యేది. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యం మనకిచ్చిన కానుక 14 రోజులకు ఓసారి మంచినీళ్లు. ఇవాళ పట్టణంలో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం. ప్రతిరోజూ నల్లా నీళ్లు ఇస్తున్నాం. బైపాస్‌రోడ్డు నిర్మించాం. మురికి గుంతలా ఉన్న మహబూబ్‌నగర్ చెరువు కట్టపై ఇవాళ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేస్తున్నరు. మహబూబ్‌నగర్ పక్కనే ఉన్న ఎకో పార్కుకు నా పేరు పెట్టారని తెలిసి సంతోషపడ్డ. శ్రీనివాస్‌గౌడ్ రూ.30 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు తెచ్చి పంచాడు. పట్టుబట్టి ఐటీ టవర్ తీసుకొచ్చాడు. దివిటిపల్లి దగ్గర రూ.10 వేల కోట్లతో అమరరాజా బ్యాటరీ కంపెనీని ఏర్పాటు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ సహకారం లేకుంటే ఆ కంపెనీ వచ్చేదా? పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. మహబూబ్‌నగర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి శ్రీనివాస్‌గౌడ్. ఆయన నాయకత్వంలో పాలమూరు మరింత బ్రహ్మాండమైన ప్రగతి సాధిస్తుంది. శ్రీనివాస్‌గౌడ్‌ను మంచి మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు.
ఆకలి బాధలు, పేదరికం లేని తెలంగాణను చూడటమే తన కల అని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘చెట్టుకొకరు.. గుట్టకొకరు అయిన రైతాంగం మొఖాలు ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నయ్. ఇంకో పది-పదిహేనేండ్లు ఇలాగే రైతుబంధు, కరెంటు ఇస్తే ఎక్కడోళ్లక్కడ మంచిగైతరు. నేను కోరుకున్న బంగారు తెలంగాణ అంటే అదే. రైతు తన సొంత పెట్టుబడితో వ్య వసాయం చేసుకునే రోజే బంగారు తెలంగాణ. నేను కలగన్నది అదే. కాంగ్రెసోళ్లకు తెలియదు. నేనేదో పదవికోసం కొట్లాడుతున్న అనుకుంటున్రు. వాళ్లు పిచ్చోళ్లు.. మూర్ఖులు. తెలంగాణ తెచ్చినం.. ఇక పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి. నూరుశాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలె. ఈ రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలేదాక పనిచేయాలనే ఉద్దేశంతోనే మేము ఫైట్ చేస్తున్నం. నేను ఇప్పటికే మీ దయతో రెండుసార్లు సీఎం అయ్యాను. ఇక నాకు పదవని కాదు.. రాష్ట్రం అన్నింట్లో నంబర్-1 కావాలనే కమిట్మెంట్తోని కొట్లాడుతున్న. తెలంగాణ తలసరి ఆదాయం నేడు రూ.3.18 లక్షలు. ఇది ఇండియాలోనే నంబర్-1 స్థానం. ఇంకా ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇంకా తెలంగాణ చిక్కబడాలంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరం’ అని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు, పేద లు పడ్డ ఇబ్బందులు అందరికన్నా ఎక్కువ తాండూరు ప్రజలకే తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నాడు మంచినీళ్లు కూడా ఇయ్యలేదు. కాగ్నా, కాకరవెల్లి నదిలో గుంతలు తీసి వడగట్టుకుని నీళ్లు తాగేది. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కరెంటు సక్కగ లేక ఒక్క తాండూరులోనే 30-40 మంది రైతులు చనిపోయారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాం డూరు అభివృద్ధి చెందుతున్నది. పైలట్ రోహిత్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తా అంటే మ హేందర్‌రెడ్డి సహకరించారు. జిలుగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్, పాలిటెక్నిక్ కాలేజీ కావాలని కోరుతున్నారు. వాటన్నింటినీ నెరవేర్చుతాం. రోహిత్‌రెడ్డి యువకుడు, కష్టపడేవాడు. బీజేపీ కుట్రను ఛేదించి జైళ్లో వేయించిన ఘ నుడు. రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు.
ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా పేదలకు ఇండ్లు కట్టాల్సి ఉన్నది. వచ్చే సంవత్సరం మిషన్‌మోడ్‌లో ఇండ్లు నిర్మిస్తాం. జాగాలు లేనివాళ్లకు జాగాలిస్తాం. జాగాలు ఉన్నవాళ్లకు గృహలక్ష్మి కింద ఇండ్లు మంజూరు చేస్తాం
– సీఎం కేసీఆర్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పెద్ద భూ కబ్జాకోరు అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి పెద్ద భూ కబ్జాదారు. పొద్దున లేస్తే కబ్జాలు పె ట్టుడు.. పైసల గురించి మా ట్లాడుడు. ఈ జిల్లాలనే చాలా భూ కబ్జాలు చేసిండు. తొమ్మిదేండ్లల్ల రేవంత్‌రెడ్డి ఏకాన పనిచేయలె. వీన్ని తిట్టి.. వా న్ని తిట్టి నోరుపారేసుకోవడం తప్ప కొడంగల్‌లో ఏమన్నా పని చేసిం డా? డిసెంబర్ 3న బీఆర్ఎస్సే గెలుస్తుంది. అనుమానమే లేదు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పోస్టు కోసం 15 మంది పోటీపడుతున్నరు. వీళ్లు ము ఖ్యమంత్రి అయ్యేదెన్నడు? అసలు కాంగ్రెస్ గెలిస్తే కదా! కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావు. సీఎం అయితడని మోసపోయి ఓటు వేసిండ్రను కో.. మళ్లీ కథ మొదటికొస్తది. వాళ్లిచ్చే నోట్ల కట్టలు, మందు సీసాలకు మోసపోవద్దు. కొడంగల్‌లో ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డిల పోటీకొచ్చిండు. అక్కడి వాళ్లు తుక్కుతుక్కు ఓడగొడుతున్నరు. అంగీ ఊడేదాకా సంపుతున్నరు. ఇక్కడ (కొడంగల్‌లో) లాగు ఊడిపోయేలా తుక్కుతుక్కుగా ఓడించండి. మనకు వీళ్ల పీడపోవాలె. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తికాదు. ప్రజలమీద ప్రేమ ఉన్నోడే రాజకీయాల్లో ఉండాలె. భూ కబ్జాలు చేసేటోళ్లు కాదు. రేవంత్ గుణమేంటో కాంగ్రెస్ పార్టీవాళ్లే చెప్తున్నరు. తెలంగాణ కోసం మనం కొట్లాడిన్నాడు రేవంత్‌రెడ్డి ఆంద్రోళ్ల సంకలుండె. తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుపాకీ రాముని లెక్క తుపాకీ పట్టుకుని బయలుదేరిండు. తెలంగాణ వచ్చినంక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి రూ.50 లక్షలు ఇచ్చుకుంట దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. చిప్పకూడు తిన్నా సిగ్గురాలే. మళ్లీ సత్యహరిచంద్రుడి లెక్క మాట్లాడితే ఎట్ల? 30 తారీకు వరకు సీసాలిస్తడు. ఆ త ర్వాత అవతల పడుతుడు. పూరా గైర్ జిమ్మేదార్ మాట. ఉస్మానియా విద్యార్థుల అడ్డాకూలీలట! తాగుబోతులట! రైతుబంధు బిక్షమట! జర్నలిస్టులు మాట్లాడితే పండబెట్టి తొక్కుతా అన్నడు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఎప్పుడన్నా ఇట్ల అన్నడా? ఇంత మంచిగ ఉండేటోళ్లు కావాల్నా? ఏకాణ పనిచేయని రేవంత్‌రెడ్డి కావాల్నా? నిర్ణయించండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.