ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్‌కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్‌లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును నిలబెట్టాలె.. రైతు సల్లగుంటే పల్లెలు సల్లగుంటయి, పది మందికి అన్నం పెడతరని రైతుల కోసం ఎన్నో చేసినం… అవి ఫలించాయి. రైతు పథకాల ద్వారా అనేక లాభాలు జరిగినయి. ఇవన్నీ ఒక సంకల్పంతో చేసినం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఉచిత కరెంటుపై తమది ఉక్కు సంకల్పమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు ఇవ్వటం అంటే తమాషా కాదని, 24 గంటల విద్యుత్తు ఇవ్వటం వల్లే ఇవాళ వడ్లు ఉసికె పండినట్టు పండుతున్నాయని తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తే రైతులు వీలును బట్టి పంటకు నీళ్లు పెట్టుకుంటారని స్పష్టం చేశారు. 3 గంటల విద్యుత్తు అంటే.. ‘3 గంటలతోని యాడబోస్తరయా.. 24 గంటలు ఇస్తే బతుకుతం కానీ. అదెట్లా సాధ్యం’ అని రైతులు తిడుతున్నరని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పండిన వడ్లకు, ఉన్న గిర్నీలు చాలటం లేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భువనగిరి ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వందల మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు ఇచ్చేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని నాటి కష్టాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..
సబ్స్టేషన్లు ఎట్లా కాలిపోతుండే?
నా కన్నా ముందు చాలా మంది సీఎంలు పనిచేసిన్రు. వాళ్లెవరూ ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయిన్రు? కరెంట్ బాధలు హరీశ్ కన్నా ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసిన. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వాటిని ట్రాక్టర్ల పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోయేది? నాలుగు రోజులైనా వచ్చేది కాదు. 4 ఎకరాల పొలం వేస్తే రెండు ఎకరాల పొలం ఎండిపోవుడే. వేసినపంట కూడా పూర్తిగా పండేది లేదు. తెలంగాణ వచ్చినరోజు రైతులకు నేను ఏడ్చుకుంట చెప్పిన.. దండంపెట్టి చెప్పిన రెండు మూడేండ్లు ఆగున్రీ.. బతికి ఉండండీ మిమ్ములను నేను కాపాడుకుంట అని చేతులెత్తి దండంపెట్టి చెప్పిన. కొంతమంది తెలిసీ తెల్వక.. తెలివిలేక మాట్లాడతరు. వాటిని నేను పట్టించుకోను. కలెబడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలె. నిలబడాలంటే 100 శాతం గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలె. రైతులు బాగుండాలె. రకరకాల బాధలు వారికి తొలిగిపోవాలని రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చుకున్నం. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటున్నం. ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటల కరెంటు ఇండియాలో ఇవ్వరు. వాగ్దానాలు చేసి మోసం చేస్తరు తప్ప ఇయ్యరు.
ఆ రోజు యాదికొస్తే భయం
కరెంట్ ఇవ్వటం అన్నది చాలా కఠినమైన పని. దాన్ని మెయింటెన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను సీఎం అయ్యాక కరెంట్ ఆఫీసర్లను పిలిచి మాట్లాడిన. ‘మీరు అబద్ధాలు చెప్పొద్దు. రైతులకు నిజంగా మంచిగ కరెంట్ ఇయ్యాల్నంటే ఇయ్యగలుతమా? లేదా? దానికి ఎంత టైమ్ పడ్తది? డబ్బు ఎంతైనా ఫర్వాలేదు. చెప్పండి’ అంటే దానికివాళ్లు ‘ఒక 5 రోజుల టైం ఇయ్యండి సర్ ఆలోచించుకొని చెప్తం’ అన్నరు. 5 రోజుల తరువాత వచ్చి ‘మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుతం సర్’ అన్నరు. 24 గంటల కరెంట్ ఇవ్వాల్నంటే ఏమేం కావాలని అడిగితే.. సబ్‌స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెంచాలె. అంతా అసమతుల్యంగా ఉన్నది. 220 కేవీ, 132 కేవీ, 420 కేవీ ఇట్లా బాధలు ఉన్నవి. వాటిని సమతుల్యం చేస్తే మోటర్లు, ట్రాన్స్ఫార్మార్లు కాలకుండా ఇచ్చే విద్యుత్తు ప్రజలకు క్వాలిటీగా అందుతదని చెప్పిన. ఆరోజు యాది చేసుకుంటే ఇప్పటికీ కూడా భయం అయితది. ఏ ఇంట్ల చూసినగనీ జనరేటర్, ఇన్వర్టర్, కన్వర్టర్, స్టెబిలైజర్, ఇంట్లో టీవీ, ఫ్రిజ్ కాలిపోతది. ఇట్లా చాలా భయంకరంగా ఉండేది. హైదరాబాద్‌లో ఏదైనా షాపులకు పోతే జనరేటర్‌తో డీజిల్, పెట్రోల్ కంపు. 7-8 నెలల పాటు బాగుచేసి వ్యవసాయరంగం తప్ప అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినం.
కరెంట్ ఇచ్చుడు తమాషా కాదు
కరెంట్ అప్పుడప్పుడు ఫ్లక్చుయేట్ అవుతుంటది. అది 50 సైకిల్స్ మీద నడవాలె. అంతకన్నా తక్కువ వచ్చినా.. ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుద్ది. అప్పటికప్పుడు 50-100 మెగావాట్లు కొనాల్సి ఉంటది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటది. సర్కారుకు ఫైల్ పంపే అవసరం లేకుండా రూ.25 కోట్లు ఖర్చు పెట్టే అనుమతి కావాలని అధికారులు అడిగిండ్రు. రూ.25 కోట్లు కాదు. రూ.30 కోట్లు ఇస్త నాకు కరెంట్ కావాలె అని చెప్పిన. కరెంట్ ఇవ్వాలంటే తమాషా కాదు.. విల్ పవర్ కావాలె. అంత ఈజీ కాదు. ప్రతి విషయంలో ప్రభుత్వం దూసుకుపోయి.. పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణలోనే ఎట్లా ఇయ్యగలుగుతున్నం? ఏ కారణం చేత ఇవ్వగలుతున్నం? రైతుల కడుపు నిండా అందాలే. ఎన్ని హెచ్‌పీల మోటర్ పెట్టుకున్నా ‘కౌన్ హై’ అనేవారు లేరు. లేకపోతే కరెంటోళ్లు పెట్టే బాధలు మాములుగా ఉండేవా? వైర్లు కోసేసుడు. బెదిరించుడు.. పట్టుకపోవుడు. వాటిని అన్నింటి నుంచి తెలంగాణ వాటి నుంచి బయటపడ్డది. వ్యవసాయ రంగం చాలా సక్కగైంది.
ఉసికెపండినట్టే వడ్లు
వ్యవసాయానికి ఇంత డబ్బా అని కొంతమంది ఎకనమిస్టులు అంటుంటరు. రూ.10 వేల రైతుబంధు ఇస్తరు, రైతుబీమా ఇస్తరు. కరెంట్ ఫ్రీగా ఇస్తరు. ధాన్యం కొనుగోలు చేస్తరు. మళ్లా మీరే అమ్ముతరు. ఎఫ్సీఐతోని కొనిచ్చే వరకు టైం అయితది. దీంతోని బ్యాంకుల వడ్డీ ప్రభుత్వం మీద పడ్తది అంటున్నరు. ఇవన్నీ అంటే ఒకటే చెప్పిన.. మా రైతుల కోసమే కదా. లేకపోతే మా రైతులు ఆగమైపోతరు. చెట్టుకొకడు.. గుట్టకొకడు అయి భూములు అమ్ముకున్నరు. నాశనమైపోయిన్రు. కాబట్టి, గ్రామీణ ప్రాంతాలు కుదురుకునేదాకా, వ్యవసాయం మంచిగ కళకళలాడేదాకా 10-15 ఏండ్లు చెయ్యాలె. ఆ తర్వాత ఇయ్యకున్నా ఫర్వాలేదు అని చెప్పిన. అట్ల చేస్తేనే ఇయ్యాల వ్యవసాయం తెల్లబడి రైతుల చేతుల్లో డబ్బులు కనవడ్తున్నయి. రైతు దగ్గర నాలుగు రూపాయలుంటే మార్కెట్ల షావుకార్ల గల్లలు గలగలలాడుతాయి. పిల్లల్ని మంచి చదువులు చదివిస్తరు. అన్ని రకాలుగా బాగుంటవి. ఆ డబ్బంతా మళ్లీ మార్కెట్లకే వస్తది. రైతు దగ్గర ఆగదు. దాంతోని కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి చెందుతది. దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటరు. మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ అయినం. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా రివర్స్ వచ్చింది. రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో దాని బాకీ తేలిపోయింది. పంటలు బ్రహ్మాండంగా పండుతున్నవి. ఒక్కోసారి మూడు కోట్ల టన్నులు పండుతున్నవి. వడ్లు ఉసికెపండిన పంటే వడ్లు పండుతున్నవి. అంత బ్రహ్మాండంగా పంట పండితే గుండెలు ఉప్పొంగిపోతున్నవి.
భూ రికార్డును మార్చే హక్కు సీఎంకే లేదు
ధరణి పోర్టల్ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నయ్. గతంలో రైతుల వద్ద ఓ భూమి ఉండేది. దానికి పట్టాలు కూడా ఉండేవి. ఆ భూమి వారిదే అయినా దానికి ఎంతోమంది యజమానులు ఉండేవారు. వీఆర్వో, గిర్దవార్, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ వరకూ అందరికీ అధికారం ఉండేది. వారంతా పెత్తనం చెలాయించేవారు. కేసులు పెట్టి, దొంగ పంచాయితులు పెట్టేది. వాటిల్లో ఎవడు గెలిస్తే వాడిదే భూమి. ఇవాళ ధరణితో ఈ వ్యవస్థను మొత్తం తీసేశాం. నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేని విధంగా వ్యవస్థను రూపొందించాం. తెలంగాణ మొత్తం భూభాగమే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. అందులో ఒక కోటి 56 లక్షల ఎకరాలు ధరణిలోకి వచ్చేశాయి. ఒక్కసారి ధరణిలోకి వచ్చిందంటే ఎవ్వరూ మాట్లాడేదే లేదు. భూమి హక్కు యజమాని బొటనవేలు పెడితే తప్ప, నెత్తికొట్టుకున్నా మారది. ఎవ్వరికీ మార్చే అధికారం లేదు. ఆఖరికి సీఎంకు కూడా లేదు. ఎవరు అమ్మినా, కొన్నా వెంటనే సైట్లలో చూసుకోవచ్చు. ఇది తెలియక కొందరు దుష్ప్రచారం చేస్తున్నరు.
రైతు నిలబడాలె
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు గోసపడ్డం. కరెంట్‌కు గోసపడ్డం. ధాన్యం అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. రైతులు సిటీ కొచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి చూసినం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా కరువు ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును నిలబెట్టాలె.. రైతు సల్లగుంటే పల్లెలు సల్లగుంటయి, పది మందికి అన్నం పెడతరని రైతుల కోసం ఎన్నో చేస్తున్నం. అవి ఫలించాయి. రైతు పథకాల ద్వారా అనేక లాభాలు జరిగినయి. ఇవన్నీ ఒక సంకల్పంతో చేసినం.
బీఆర్ఎస్ అంటే టాస్క్
బీఆర్ఎస్ రాజకీయం కంటే కూడా టాస్క్ కోసం పుట్టిన పార్టీ. ఎట్టిపరిస్థితుల్లో రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యం కోసం పుట్టిన పార్టీ. అప్పటికే ఆగమైపోయిన బతుకులను బాగుచేసుకోవాలనే తపనతో పుట్టిన పార్టీ. గతంలో చాలా మంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. ఆ రోజుల్లో వారు కొట్లాడిండ్లు కాబట్టి. ఆ తరువాత ఉద్యమం నీరుగారిపోయినా కూడా మళ్లీ స్టార్ట్ చేసి కొట్లాడినం. ఇది కండ్ల ముందటి చరిత్ర. అనేక అవహేళనలు, అవమానాలు.. అయ్యేదా? పోయ్యేదా? అని రకరకాల మాటలు మాట్లాడిండ్రు. భగవంతుడి దయ. మన అదృష్టం. చాలా గొప్పగా రాష్ర్టాన్ని సాధించుకున్నం. అప్పుడు చాలా మంది నానా ఇబ్బందిపెట్టారు. హైదరాబాద్ మీద కాంప్రమైజ్ కావాలంటే హైదరాబాద్ లేని తెలంగాణ తలకాయలేని మొండెం మాకెందుకు? అని పానం పోయినా ఒప్పుకోమని చెప్పి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ మనం సాధించుకున్నం. ప్రభుత్వాలు పనిచేస్తాయి. అది పెద్ద విషయం కాదు. ఎవరైనా పనిచేయాల్సిందే. తోచినకాడికి చేస్తరు. కానీ, మనం పనిచేసిన పద్ధతి ఏదంటే? ప్రతి దాన్ని ఒక టాస్క్‌లాగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించటాన్ని ఎట్లయితే భావించుకున్నమో అట్లనే అన్నీ చేసుకుంటూ పోతున్నం. అట్లనే కరెంట్ విషయంలో చేసుకున్నం.
ఆలేరు, భువనగిరికి మహర్దశ
కాళేశ్వరంతో నీళ్లు తెచ్చినం. రేపో మాపో బస్వాపుర్ రిజర్వాయర్ కూడా నిండబోతున్నది. అద్భుతంగా నీళ్లొస్తయి. ఈ సంవత్సరం బస్వాపురాన్ని నింపుతాం. కొత్త ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక్కసారే నింపకూడదు కాబట్టి మూడో భాగం చొప్పున నింపుతున్నాం. కాల్వలకు నీరు అందేమందం నీళ్లు వస్తయి. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు బ్రహ్మాండంగా వజ్రపు తునకలైతయ్. అంత గొప్పగా నీళ్లు అందిస్తాం. మల్లన్నసాగర్ నుంచే నీళ్లు ఇస్తాం. ఆ ప్రాంత రైతులకు నెత్తి మీద కుండ పెట్టున్నట్లే. అదొక నీళ్ల ఖజానా. 50 టీఎంసీ ప్రాజెక్టు. దీంతో భువనగిరి, ఆలేరులో శాశ్వతంగా కరువు రాదు.
అనిల్‌కుమార్‌రెడ్డి భవిష్యత్తుకు నాదీ భరోసా
అనిల్‌కుమారెడ్డి చాలా ప్రభావంతమైన వ్యక్తి. కష్టపడి వ్యాపారం చేసి జీవితంలో పైకొచ్చిన వ్యక్తి. శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి చెరొక పోస్టు తీసుకొని మంచిగా పనిచేసుకోవాలని చెప్పా. ఇద్దరూ జోడెడ్లలాగ జోరుగా బండి లాగాలి. భువనగిరి జిల్లా బండి లాగితే.. అద్భుతంగా ముందుకెళ్లాలి. నా మాట గౌరవించి వచ్చారు. వారితోపాటు వారి వెంట వచ్చిన వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం. అనిల్‌కుమారెడ్డి రాజకీయ జీవితానికి నేనే జిమ్మేదారి. రేపటి తెలంగాణ మీది. భవిష్యత్తు మీది. యువకులు.. పాలించుకునేది మీరే. నడిపించుకునేది మీరే. నేనొక తొవ్వ చూపించిన. ఎవ్వరూ వెయ్యేండ్లు బతకరు కదా. ప్రాణం మంచిగుంతసేపు చేస్తాం. యువకులు విభేదించుకొని రాజకీయాలు చేయొద్దు. నాగార్జునసాగర్ నోముల నర్సయ్య చనిపోయినప్పుడు.. ఆయన కొడుకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే బాగోదని ఆయన బిడ్డ భగత్‌కు సీటిచ్చినం. అక్కడ కోటిరెడ్డి అనే లీడర్‌కు నాడే ఎమ్మెల్సీ ఇస్తమని చెప్పిన. నా మాట గౌరవించి కోటిరెడ్డి సహకారం చేశారు.
ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినం. ఒక్కసారి నేను చెబితే దానికి తిరుగుండదు. అనిల్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి కలయిక భువనగిరి జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించుకున్నం.యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చాలా చేయాల్సింది ఉన్నది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్, రవీంద్రనాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లమోతు భాసర్‌రావు, భూపాల్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల సుమన్, జీవన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఏ సందీప్‌రెడ్డి, బీ నరేందర్‌రెడ్డి, వీ నర్సింహారెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్‌కుమార్, టీఎస్ఫుడ్స్ చైర్మన్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల వెంకటేశ్‌యాదవ్, వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్ ముదిరాజ్, వలిగొండ సర్పంచ్ లలితాశ్రీనివాస్, వలిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వలిగొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, భువనగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లెంల జంగయ్యయాదవ్, వరింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ పాశం శివానంద్, మైనార్టీ ప్రెసిడెంట్ షరీఫుద్దీన్, నమాత్‌పల్లి సర్పంచ్ శాలిని, మాజీ ఎంపీపీ కుంభం వెంకట్‌పాపిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కుంభం విద్యాసాగర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వలిగొండ మండల నాయకుడు బీ రమేశ్‌రెడ్డి, వలిగొండ మండల పరిషత్తు ఉపాధ్యక్షురాలు బీ ఉమాదేవి బాలనర్సింహ, జీ రవి, కే వెంకటేశ్, బీ సహదేవ్‌గౌడ్, వార్డుసభ్యులు ఏ శేఖర్, ఆర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీ మురళి, పీ సహదేవ్, కిరణ్‌కుమార్, కే సాయిగౌడ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పల్లెర్ల సుధాకర్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, మైసోల్ల లక్ష్మీనర్సు సహా భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
3 గంటలు అంటే రైతులు తిడుతున్నరు
రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ముందు అధికారులు గజగజ వణికిపోయిండ్రు. ఏం కాదు.. మంచిగనే ఉంటది అని చెప్పిన. 24 గంటలు కరెంట్ ఇస్తే ఎవరి వీలునుబట్టి వాళ్లు పెట్టుకుంటరు. కరెంటు ఉంటదన్న భరోసా ఉంటే ఆరామ్‌గా ఉంటరని, పరేషాన్ కావద్దని చెప్పిన. ఇప్పుడు రైతులను అడిగితే ఏం చెప్తున్నరు? 3 గంటలతోని యాడబోస్తరయా అని రైతులు తిడుతున్నరు. 24 గంటల ఇస్తే ఎవరి వీలునుబట్టి వాళ్లు పెట్టుకుంటరు. బతుకుతం కానీ. అదెట్లా సాధ్యం అని అంటున్నరు. ఆనాడు 24 గంటలు కరెంట్ ఇస్తే భూగర్భజలాలు ఎండిపోతయని రైతులు కూడా అర్థం కాక అనుకున్నరు. దానికోసం మిషన్ కాకతీయ పెట్టుకున్నం. ఏపీలో చెరువులు ఆగమైపోయినయ్. మనం 46 వేల చెరువులను మంచిగచేసి వాటి సామర్థ్యం పెంచుకున్నం.
రాష్ట్రంలో పండిన వడ్లకు గిర్నీలు సరిపోతలేవు.
రాష్ట్రంలోని వడ్లను గిర్నీలు పట్టలేకపోతున్నాయి. వాటి సామర్థ్యం సరిపోవటం లేదు. దీంతో జపాన్ కంపెనీ వాళ్లను పిలిచి మాట్లాడినం. కోటి టన్నులకు మరో రెండున్నర కోట్లు ఖర్చు చేస్తేనే ఈ పనవుతుందని చెప్పాం. వడ్లు బుల్లెట్లు లెక్క వస్తున్నయ్. పంట అయిపోయిన దగ్గర్నుంచి రెండు నెలల దాక అమ్ముతున్నరు. కోనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లను సాధ్యమైనంత వరకు కొంటున్నం. నేను కూడా రైతు బిడ్డనే. చిన్నప్పుడు నా తండ్రితోలితే నేను కూడా ట్రాక్టర్లు కట్టుకొని, బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో రోజుల తరబడి ఉన్నం. వడ్లు నెత్తిమీద పెట్టుకొని పోయి, పడిగాపులు పడ్డం. అప్పుడు షావుకారి ఒక చిట్టీ చేతులో పెట్టి.. పది రోజులకు రా, నెల రోజులకు రా.. అని పంపేది. ఇక వాని దయ. నాడే అంత ఘోరమైన పరిస్థితి ఉండె. ఈ రోజు అలాంటి సమస్యే లేదు.
ధరణే లేకపోతే రైతుబంధు పైసలెట్లా?
ఇయాళ తెలంగాణలో భూముల విలువ ఎంతో పెరిగింది. ఈ ధరణే లేకపోతే.. ఆ పెరిగిన ధరలకు ఎన్ని తాకట్లు అవుతుండె? ఎంతమంది సచ్చిపోతుండె? ఎన్ని హత్యలైతుండె? ధరణి వల్లే చాలా ప్రశాంతంగా ఉన్నయి పల్లెలు. ఎవరో ఒక్కరికో.. ఇద్దరికో సమస్య ఉంటే వాటిని ప్రభుత్వం పరిష్కారం చేస్తది. ఎలాంటి తిరుగుడు లేదు. ఎలాంటి దరఖాస్తులు లేవు, కడుపుల సల్ల కదలకుండా ఇంట్ల కూసుంటం. సీదా రైతుబంధు పైసలొచ్చి మన బ్యాంకు అకౌంట్లనే పడుతున్నయ్. మనకు సెల్లో మెసేజ్ వస్తది. ఒకవేళ ధరణి తీసేస్తే రైతుబంధు పైసలు ఎట్ల రావాలె? ఏ పద్ధతులో రావాలె? మళ్లా.. ఆ డబ్బుల కోసం దరఖాస్తు పెట్టాలె. మళ్లా ఎమ్మార్వో ఆఫీసుకు పోవాలె. వానికి సలామ్ కొట్టాలె. మళ్లీ లంచాలు పెట్టాలె.
ధరణితోనే రైతుకు శాశ్వత పరిష్కారం
ధాన్యం అమ్మినప్పుడు అప్పటిలెక్క ఇప్పుడు మండీల చుట్టు చిట్టీలు పట్టుకొని షావుకార్ల చుట్టూ తిరిగే దందా లేదు. సీదా పైసలొచ్చి బ్యాంకుల పడుతున్నయ్. మొదటి పంట ధాన్యం అమ్ముకొని ఆ డబ్బులు తీసుకునే లోపే.. మళ్లీ రెండో పంట పెట్టుబడి ప్రభుత్వం నుంచి వస్తున్నది. కాబట్టి రైతులు మూడు, ఐదు రూపాయల మిత్తికి అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఆ విధానం బందైపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టమొస్తెనే తీసుకుంటున్నారు. లేకపోతే లేదు. ఇదొక మంచి అద్భుతమైన పరిణామం. ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే పరిణామం. మహారాష్ట్రలో వీఆర్వోను తలాటీ అంటారు. అక్కడి సభల్లో తలాటి ఉండాల్నా? తీసెయ్యాల్నా? అంటే.. ముక్తకంఠంతో తీసెయ్యాలని చేతులెత్తుతుండ్రు. మన ధరణి అంత సదుపాయం దేశంలో ఎక్కడా లేదు.