CM KCR | ‘ఆ రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ను చూస్తే భయమైతంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేనా మహారాష్ట్రలో వచ్చి పడుతడు.. మా పుంగి బజాయిస్తడని వాళ్లకు తెలుసు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్నాటకలో కరెంటును కాటకలిపిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ కాటకలుపుతది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో లేదు. తెలంగాణలో మాత్రమే ఉన్నది. కేసీఆర్ జగమొండి కాబట్టి.. ఏం చేసినా మా రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లయ్ చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాకు చెప్పిండు. ఆర్డర్ వేసిండు. బోరు మోటర్లకు మీటర్లు పెట్టాలి.. బిల్లు వసూలు చేయాలని చెప్పిండు. నేను తలకాయపోయినా పెట్టా అని చెప్పాను’ అని స్పష్టం చేశారు.
‘ఎందుకంటే పండెటోనికి ఎరుక గూని వాటం. నా తెలంగాణ ఉన్నదే బోరుబావుల మీద. నా రైతులు బతుకున్నదే బోరుబాయిలతోని. ఇవాళ మేం భూగర్భజలాలు పెంచుకున్నాం. కాకతీయ కింద చెరువులు బాగా చేసుకున్నాం. దేవుడి దయతో కాలం మంచిగైతుంది. మంచిగ భూగర్భ జలాలున్నయ్. ఆ బోర్లు లేకపోతే మా బతుకే లేదు. అలాంటప్పుడు ఎట్ల మీటర్లు పెట్టాలే.. నేను పెట్టా అని చెప్పిన. సంవత్సరానికి రూ.5వేల కోట్ల బడ్జెట్ కోస్తామని చెప్పి కోసేసిండు. ఈ ఐదు సంవత్సరంలో రూ.25వేలకోట్ల నష్టపెట్టిండు. అయినా మీటర్లు పెట్టలేదు. ఒకడు మీటర్ పెట్టెటోడు.. ఇంకోడు మూడుగంటలే అనేటోడు. మరి ఎవడు కావాలో మీరే నిర్ణయించాలి. నేను చెప్పేది ఆషామాషీ వ్యవహారం కాదు. మన బతుకులతో చెలగాటం. గోల్మాల్, లంగమాటల కోసం కాదు. తెలంగాణ జీవన సమస్య, బతుకుపోరాటం. ఆషామాషీ వ్యవహారం కాదు. మళ్లీ తెలంగాణ మొదటికే రావాల్నా? మళ్లీ బతుకపోవడు.. విడిచిపెట్టిపోవుడు.. బిచ్చం ఎత్తుకునుడు ఇవే బాధలు రావాల్నా మనకు ? దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా నేను చెప్పే విషయాలను విని.. అన్నిగ్రామాల్లో చర్చ పెట్టాలి’ అని సూచించారు.
‘ఎవరన్నా పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును కొనుకొచ్చుకుంటరా? గంత తెలివితక్కువ తనం ఉంటదా? మంచి పాడిబర్రె అమ్ముకొని దున్నపోతును కొనుకచ్చకుంటరా ఎవడైనా ? ఎక్కడోళ్లక్కడ మంచి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆలోచన చేయాలని చేర్యాల నుంచి పిలుపునిస్తున్నా. కరెంటు వేస్టు.. రైతుబంధు వేస్టు.. మేం మూడేగంటలిస్తం.. వీళ్లు కావాలా? ఉన్నది ఉన్నట్టే 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా ? ప్రజలు నిర్ణయించాలి. ఇవాళ జిల్లాకో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఎవరైనా ఊహించారా? జనగామలో మెడికల్ కాలేజీ వస్తదని అనుకున్నమా? సిద్ధిపేటలో వస్తుందని అనుకున్నమా? ఏ విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను తయారుచేసేటట్టు అయ్యింది తెలంగాణ రాష్ట్రం. నరేంద్ర మోదీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే.. నేను వంద ఉత్తరాలు రాసినా ఒక్కటి కూడా ఇవ్వలేదు’ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
‘పార్లమెంట్లో చట్టం ఉంది. ఖచ్చితంగా కొత్త జిల్లాలు ఏర్పడితే.. ప్రతి జిల్లాకో నవోదయ విద్యాలయం పెట్టాలి. మా తెలంగాణ భారతదేశంలో రాష్ట్రం కాదా? మనం పన్నులు కడుతలేమా? దేశాన్ని సాదే నాలుగైదు రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నం. మనం ధనిక రాష్ట్రం కాబట్టి. కానీ, ఒక్కటి కూడా ఇవ్వలేదు. చట్టాన్ని కూడా గౌరవించలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వనటువంటి.. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి? ఆలోచన చేయాలి. వాళ్లు ఏం మొఖం పెట్టుకొని మనల్ని ఓటు అడుగుతరు ఇవాళ ? ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా కేసీఆర్ను చూస్తే భయమైతుంది. ఈ ఎన్నికల్లో గెలిచేనా మహారాష్ట్రలో వచ్చి పడుతడు.. మా పుంగి బజాయిస్తడని చెప్పి వాళ్లకు తెలుసు. మహారాష్ట్రలో 150 గ్రామ పంచాయతీలు తీర్మానాలు పాస్ చేసి మమ్మల్ని తెలంగాణ కలపమంటున్నరు. నేనుపోతే అక్కడ పెద్ద గాలిగత్తర ఉన్నది. నేను అక్కడ సభ పెడితే మనదగ్గర ఎట్ల వస్తున్నరో అట్ల వస్తున్నరు అక్కడ. దాని కోసం ఇద్దరు ఏకమయ్యారు చీకట్ల. వీడు గెలవాలని వాడు బలహీన అభ్యర్థి పెట్టుడు.. వీడు గెలవాలని వాడు పెట్టుడు. ఈ లఫంగ దందాకట్టి కేసీఆర్ బొండిగె ఈడనే పిసికేత్తే మేం సేఫ్ ఉంటంరనేది జరుగుతున్నది ఇప్పుడు. రాజకీయాల్లో తెలివితోటి ఉండాలి. వివేచన శక్తిని వినియోగించాలి. మన చుట్టూం ఏం జరుగుతున్నది గమనించాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలను అప్రమత్తం చేశారు.