హైదరాబాద్: ఎవరికైతే అవకాశం రాలేదో వారు తొందరపడాల్సిన అవసరం తేదని, ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ముందుముందు ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్భంగా తెలంగాణ భవన్లో (Telangana Bhavan) సీఎం కేసీఆర్.. వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు రెండు కార్యక్రమాలు ఉన్నాయి. హుస్నాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. సమయానికి అన్ని జరిగిపోయేలా ముగించుకుందాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో పదే పదే ఒక మాట చెప్పాను. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు వస్తాయి, విజయం సాధిస్తారని ఆత్మవిశ్వాసం ప్రకటించాను. మీ అందరికీ అవకాశం రావడం సంతోషంగా ఉంది.
కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. అలా మార్చుకున్న చోట విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. వేములవాడలో మార్చుకోవాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టే అక్కడ అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలి. ప్రజలకు దండం పెట్టి ఓటు కావాలని అడుగుతాం. రాజకీయాలన్నతర్వాత మంచి, చెడు ఉంటాయి. అలకలు ఉంటాయి. అందరి కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇది తప్పక పాటించాలి. గత ఎన్నికల్లో ఒకరిద్దరికి చెప్పాను. వ్యక్తిత్వం మార్చుకోవాలని చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారు.
జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘట్టం. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.