CM KCR | ఖమ్మం : బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిన్నమొన్నటి దాకా కేసీఆర్ వల్ల మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు.. నరం లేని నాలుక కాబట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారొచ్చు కానీ సత్యం మారదు. నిజం నిజం లాగే ఉంటుంది. నిజం నిప్పులాంటింది కదా..? ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీకు అందరికీ తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం ఈ జెండా ఎత్తి, ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఉద్యమ ప్రారంభంలో చాలా అవమానాలు, అవహేళన చేశారు. తెలంగాణ ఎట్ల వస్తది.. సాధ్యం కాదు.. కేసీఆర్ బక్క పలచనోడు ఎవడో పిసికి చంపేస్తడు అని మాట్లాడారు. కానీ 14. 15 ఏండ్లు పోరాటం తర్వాత యావత్ తెలంగాణ ఒక ఉప్పెన అయి కదిలేతే దేశ రాజకీయ పరిస్థితి తలవంచి తెలంగాణ ఇచ్చింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఆ రోజు నేనే కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా.. అని ఆమరణ దీక్ష చేపట్టాను అని కేసీఆర్ తెలిపారు. ఆమరణ దీక్షకు పూనుకుంటే తనను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జైల్లో పెట్టారు. అనేక మోసాలు చేశారు. మాటలతో నమ్మించారు. అన్నింటిని అధిగమించి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం స్పష్టం చేశారు.
భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజు మన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. ప్రత్యేకించి ఆయన వచ్చారు. పాలేరుకు మీరు ఎందుకు వస్తున్నారంటే నాది కూడా పాలేరు నియోజకవర్గమే.. 45 ఏండ్లలో 40 ఏండ్లు కరువుకాటకాలకు గురైంది. ఇవాళ మీరు నీళ్లు అందిస్తున్నారు. సంతోషమైందని వచ్చానని మహేందర్ రెడ్డి తెలిపారని కేసీఆర్ గుర్తు చేశారు.
మీ అందర్నీ కోరేది ఒక్కటే మాట. బీఆర్ఎస్ రాక ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేశాయి అని కేసీఆర్ తెలిపారు. కొన్ని మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. పాలేరుకు మోక్షం లభించందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. భక్తరామదాసు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఎండిపోయిన పాలేరు చెరువులు నిండుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉపేందర్ రెడ్డి ఉపన్యాసం విన్నాను అని కేసీఆర్ తెలిపారు. అది ఉపన్యాసం లాగా లేదు. ఇంటి మనషులతో మాట్లాడినట్లు ఉంది. నా సెల్ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? అని అడిగారు. ఇది నాయకత్వ లక్షణం. ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు ఉండటం అదృష్టం అని కేసీఆర్ అన్నారు.