CM KCR | హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ తనయుడు.. పీజేఆర్ తెలంగాణ గురించి అద్భుతమైన పోరాటం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజలు, సామాన్యుల కోసం రాజీ పడకుండా పోరాడిన పాపులర్ నాయకుడు పీజేఆర్. వారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చాలా ఉత్సాహవంతుడు. ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. క్రియాశీలకంగా మీతో పాటు పని చేస్తానని చెప్పారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించాను. ఆయన భవిష్యత్ నా బాధ్యత. ఎందుకంటే పీజేఆర్ వ్యక్తిగతంగా నాకు మిత్రుడు, విష్ణు కూడా నా కుటుంబ సభ్యుడే. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది అని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగతి సాధించింది. కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటాయి. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారు. భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పింది. సేఫ్‌గా ఉన్నాడు. హేయమైన దాడులు సరికాదు. మీరంతా తగిన బుద్ధి చెప్పాలి. అద్భుతమైన విజయం సాధించాలి. ఐకమత్యంతో ముందుకు పోవాలని కోరుతున్నాను అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.