హుజూరాబాద్: బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచి పనులు చేసే బీఆర్ఎస్ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేస్తే మీ ఓటును మోరీల పారేసినట్టే అయితదని ఓటర్లను ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన అనంతరం సీఎం హుజూరాబాద్ సభలో పాల్గొన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గంలో మంచిగ పనులు జరుగుతయని అన్నారు. గుడ్డిగ ఓటేసి ఆగం కావద్దని కోరారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. పెట్టుబడి కోసం రైతుబంధు తెచ్చింది. కర్మగాలి ఎవరైనా చనిపోతే రైతుబీమా ఇస్తుంది. మీరు పండించిన పంటను కొనుగోలు చేసి బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నది. ఇవన్నింటిపై మీరు గ్రామాల్లో చర్చపెట్టాలె. గుడ్డిగ ఓటేసుడు గాదు. దయచేసి బాగా ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు బీజేపాయిన గెలిస్తే ఏమైతది..? ఇప్పటికి ఎన్నేండ్లాయె గెలిచి..? ఏకాణ పని అయ్యిందా..? పైంగ పెద్దపెద్ద మాటలు. ఎల్లయ్యకు ఎడ్లు లేవు.. మల్లయ్యకు బండి లేదు. వట్టియే మాటలు. శూన్య ప్రియాలు.. శుష్క హస్తాలు. ఏం జరుగదు. అదే కౌశిక్‌రెడ్డి గెలిస్తే పనులు జరుగుతయ్’ అని సీఎం చెప్పారు.
‘నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నా. తెలంగాణల నేను 50 శాతం పైన తిరిగిన. ఈ ఎన్నికలల్ల వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నది. మరె గవర్నమెంట్ దిక్కు ఉండే కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిదా..? వేరేటోళ్లు గెలిస్తే మంచిదా..? మీరే ఆలోచన చేయాలె. మీ ఓటు వేరే ఎవరికి వేసినా మోరీల పారేసినట్టే. మురిగిపోతది. కేసీఆర్ హుజూరాబాద్‌కు ఏం తక్కువ జేసిండు..? మీ కాలువలు లైనింగ్ చేయించలేదా..? మునుపటి వారాబందీలు బందయ్యి ఇప్పుడు కాలువల నిండ నీళ్లు వస్తలేవా..? మీ దగ్గర ధాన్యం కొంటలేరా..? మీకు రైతుబంధు వస్తలేదా..? మీ దగ్గర దళిత బంధు అన్ని ఇండ్లకు రాలేదా..? మరి ఇన్ని జేసిన కేసీఆర్‌ను గాదని, ఎవడ్నో ఎత్తుకుంటే ఏమొస్తది..? హుజూరాబాద్ నియోజకవర్గం ఇవన్నీ ఆలోచన చేయాలె. మిత్రుడు కౌశిక్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి’ సీఎం కోరారు.