CM KCR | చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం అని కేసీఆర్ పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, కాలే యాదయ్యకు మద్దతుగా ప్రసంగించారు.
యాదయ్య నాకు దగ్గరి మనిషి. మీ అందరికీ తెలుసు. ఆయన అడిగిన తర్వాత నేను కాదనే ముచ్చట కాదు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఆయన దళితబంధు కావాలని అడిగారు. కాలే యాదయ్య కోరినట్టు దళితబంధు మీకు వచ్చేటట్టు చేస్తాను. చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం. మీకు అందరికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేస్తా. దాంతో చాలా బాగుపడుతాం. ముందుకు పోగలుగుతాం. మీరు కోరుతున్న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇంకా కాలుష్య రహిత పరిశ్రమలు కూడా వస్తాయి. చాలా మంది లైన్లో ఉన్నారు పరిశ్రమలు పెట్టడానికి. యాదయ్య చీమకు, దోమకు కూడా నష్టం చేసే మనిషి కాదు. తోచిన కాడికి పని చేస్తడు తప్ప ఏ మనిషికి నష్టం చేయడు. వేరే పార్టీల వ్యక్తుల చరిత్ర మీకు తెలుసు. దళితబంధు ఒకే విడుతలో వస్తది కాబట్టి.. ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పడొద్దు అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.