CM KCR | హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1(Aditya L1) స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నది. విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ57 నుంచి ఆదిత్య వేరుపడింది. దీంతో మిషన్ సక్సెస్ అయినట్లు ఇవాళ ఇస్రో ప్రకటించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ దిశగా ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ తన జర్నీ మొదలుపెట్టినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. సుమారు 1.04 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి వేరుపడిన ఆదిత్య ఎల్1 కక్ష్యలోకి చేరింది. ఉదయం 11.50 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ప్రవేశించినట్లు ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పేర్కొన్నది. ఎల్1 పాయింట్ దిశగా ఆదిత్యుడి సౌరయానం మొదలైనట్లు వెల్లడించింది.