CM KCR | హైదరాబాద్ : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తున్నాం.. అందులో డౌటే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డికి పోతా అని మొదలు పెట్టినవ్ నీ సంగతి ఏందని జహంగీర్ బాయ్ అడిగిండు. దానికి ఓ కారణం ఉంది. గజ్వేల్‌లో ఇళ్లు, భూమి పెట్టుకుని నేనేందుకు అక్కడికి పోతా అని చెప్పాను. నేను ఇక్కడే ఉంటా.. నీవేం రంది పడకు అని చెప్పాను. గజ్వేల్‌లో ఎవరు గెలుస్తరో.. వానిదే రాష్ట్రంలో గవర్నమెంట్ వస్తదని చెప్పిండు. ఇది వెనుకటి నుంచి ఉన్నది కాబట్టి కచ్చితంగా నువ్వు ఇక్కడనే ఉండాలని చెప్పిండు. నేను పోతలేను.. అపోహ పడకు అని చెప్పిన అని కేసీఆర్ తెలిపారు.
నా కోరిక ఏందంటే.. ఎంత మెజార్టీ తెస్తరు అనేది మీ దయ అని కేసీఆర్ అన్నారు. ప్రజలకు మనమేందో తెలిసిపోయింది. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక లెవల్‌కు వచ్చాం. ఈ టర్మ్‌లో మిగతావన్నీ చేసి పెడుతాం. గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ఒక బాధ ఉంటది.. ఎందుకంటే.. నాకున్న బాధ్యతను, బరువును బట్టి.. నాకు ఒకటే ఒక మిస్సింగ్ ఏముంటది అంటే.. పేరుకు ఎమ్మెల్యేను కానీ ప్రజలకు కనబడను. అదో పెద్ద సమస్య. అందులో మధ్యలో కరోనా ఆగం చేసింది. వచ్చే టర్మ్‌లో ప్రతి నెలలో ఒకరోజు నియోజకవర్గానికి కేటాయించి, ముఖ్య కార్యకర్తలతో కలిసి అభివృద్ధిపై చర్చిస్తాను. అన్ని రంగాల్లో రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా గజ్వేల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.