CM KCR | సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుల సంక్షేమానికి తీసుకువచ్చిన గొప్ప పథకం దళితబంధు. అయితే, పథకానికి ప్రేరణ ఎవరో వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అనేక కార్యక్రమాలు చేశాం. ఊరూరుకు మిత్రులుండేవారు. వారందరితో కలిసి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దళితబంధును తీసుకువచ్చాం. దళితబంధుకు ప్రేరణ మన రామంచ గ్రామం నుంచి వచ్చిన దళిత ఆడబిడ్డ. సిద్దిపేటలో ఉండే ఇల్లు మీకు తెలుసు. మిట్టపెల్లిలో రామకృష్ణ ఓ కార్యక్రమం పెడితే పోతున్నాం. కారుక్కుతున్న సమయంలో అక్కడికి ఓ దళిత బిడ్డ వచ్చి కాళ్లమీద పడ్డది’ అని తెలిపారు.
‘ఏమైందని అడిగితే.. ఏం లేదుసార్.. బిడ్డ పెళ్లి ఎత్తిపోయేట్టు ఉన్నది అని చెప్పింది. ఎందుకంటే.. పెళ్లిలో సైకిల్ పెడుతామని ఒప్పుకున్నం. సైకిల్‌కు డబ్బులు ఎల్తలేవ్. తెల్లారితే పెళ్లి ఉన్నది. పెళ్లి ఎత్తిపోయేటట్టు ఉన్నదని అని చెప్పింది’ అన్నారు. ఆలోచన చేసి.. ఎంతైతదని అడిగాను. గతంలో అట్లాస్ సైకిల్ అని ఉండేది. ఇప్పుడు ఉన్నదో లేదో తెల్వదు. ఆ సైకిల్‌కు రూ.1900 అవుతుందని నా గన్‌మెన్ నాకు చెప్పిండు. రూ.1900 ఇచ్చి సైకిల్ తెచ్చిపెట్టమని ఆ ఆ ఆడబిడ్డకు చెప్పాను. ఆ రోజు నేను ఒక మాట అన్నాను. వాడు ఎవడు నీ బిడ్డను చేసుకునేటోడు. మంచి బంగారమోలో బిడ్డనిస్తే.. నీ బిడ్డను చేసుకుంటుండా.. లేక సైకిల్ చేసుకుంటుండా అని అన్నా. గమ్మది ఏందంటే ఆ పిలగాడు కూడా ఆమె వెంబడి వచ్చిండు. సార్ పిలగాడు వచ్చిండు అక్కడ నిలబడ్డడు అని చెప్పింది. ఇగ రా అని నేను దగ్గరికి పిలిచాను.
నీకు బంగారంలాంటి పిల్ల ఇస్తున్నరు.. అమ్మాయిని చేసుకుంటున్నవా? సైకిల్‌ను చేసుకుంటున్నావా? అన్న. సార్ నా ఇమానంగా చేసుకోవాలని ఉన్నది. కానీ మా అయ్య తిడుతుండు సార్ అన్నడు. సరే అట్లె అని సైకిల్‌ను కొని ఇచ్చాం. కొని ఇచ్చిన తర్వాత మిట్టపెల్లి పోయి వచ్చిన తర్వాత ఆమె వెళ్లిపోయిందని అనుకున్నా. కానీ ఏం చేసిందంటే.. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ పట్టుకొని నిల్చున్నది. సైకిల్‌కు మీరే కొబ్బరికాయ కొట్టాలని.. నీ చెయ్యి మంచిది.. దాంతోనే నేను పోతా అన్నది. నేను అప్పడు కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత బాగుందంటే.. ఆ అల్లుడు సైకిల్ తొక్కుతుడున్న.. భార్య ముందట కూసున్నది. అత్త వెనుక కూసున్నది.. ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతుంటే మన నాయకులందరు చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచి వారిని పంపారు’ అని గుర్తు చేసుకున్నారు.
‘దళితుల పరిస్థితి కాబట్టి.. దిక్కుమాలిన, దరిద్రపు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి వాళ్ల అభివృద్ధి కోసం మంచి పథకం తేలేదు కాబట్టి.. ఒక మంచి స్కీమ్ తేవాలని.. సిద్దిపేటలోని అనుభవాలు.. వాటిని గుణపాఠంగా చేసుకొని దళితబంధుకు శ్రీకారం చుట్టాను. తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తున్నా. ఒకటే రోజు పథకాన్ని అమలు చేయలేం. సంవత్సరానికి 50వేల, లక్ష కుటుంబాలకు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళితబంధు అందేవరకు కేసీఆర్ ప్రాణంపోయే వరకు కేసీఆర్ రాజీపడడు అని మనవి చేస్తున్నా. బీసీల్లో ఉండే వృత్తిపనులు వారు మునిగిపోయారు. వారికి కరెంటు ఫ్రీగా ఇచ్చాం. రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. పథకం ఆగలేదు. అపోహకు గురికావొద్దు. నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడున్నప్పుడు ఎన్నో ప్రయోగాలు.
మొగ్దుంపూర్ వెళ్లాం. రోడ్డు బాగాలేదంటే డేరా దించినమ్.. తెల్లారే వెళ్లి శ్రమదానం చేశాం. రామునిపట్లకు వెళ్లాం ఆదర్శగ్రామం చేయాలనుకున్నాం. బ్రహ్మాండంగా ఆ ఊరిలో చాలారోజులు గడిపి కొంత కార్యక్రమాలున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ భారతదేశానికి తలమానికం అయితే.. సిద్దిపేట నియోజకవర్గం యావత్ సిద్దిపేట యావత్ తెలంగాణకే తలమానికంగా హరీశ్ నాయకత్వంలో ముందుకెళ్తున్నది. జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినయ్. మనకు రైలు వచ్చింది. అన్ని రకాల సదుపాయాలున్నాయ్. గొప్ప వర్తక, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా, ఐటీ కేంద్రంగా, కాలుష్యంలేని పరిశ్రమల కేంద్రంగా, అద్భుతమైన వ్యవసాక్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది. ఇదేరకంగా మరోసారి హరీశ్‌రావును దీవించి.. మీ మెజారిటీని మీరే తిరగరాసి విజయం సాధించేలా కారు గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తున్నా’నన్నారు.