హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్‌రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్‌రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పారిశ్రామిక, ఎగుమతుల రంగాలు దీనావస్థకు చేరుకోగా, దేశ అప్పులు గణనీయంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
తాను చెప్పింది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ.. కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వివరాలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తల విశ్లేషణలను ఉటంకిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. గత పదేండ్ల పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త పూజా మెహ్రా రచించిన ‘దిలాస్ట్ డికేడ్’ పుస్తకంలో మన్మోహన్సింగ్, మోదీ ప్రభుత్వాల మధ్య తేడాను అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించారని చెప్పారు.
మోదీ హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి ఉన్నదా? అని సూటిగా ప్రశ్నించారు. అంతటా లోటే తప్ప మెరుగుపడ్డ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ‘దిలాస్ట్ డికేడ్’ పుస్తక రచయిత స్వతంత్ర జర్నలిస్టు, ఆర్థికవేత్త, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని తెలిపారు. పొరుగు దేశాల నుంచి నేర్చుకోండని, అప్పులు చేయవద్దని, ఆర్థకవ్యవస్థను అనర్థవ్యవస్థగా చేశారని పార్లమెంటులో మోదీ గతంలో చెప్పారని గుర్తుచేస్తూ, వాస్తవానికి అప్పులు చేయడంలో వారిని(బీజేపీ) మించిన ఘనులు మరొకరు లేరని కేసీఆర్ విమర్శించారు.
తయారీ రంగంలో దూసుకుపోతున్న చైనా
ఆధునిక ప్రపంచంలో చైనా సహా అభివృద్ధి చెందిన దేశాల పెరుగుదలను అధ్యయనం చేస్తే ఎగుమతులే కీలకంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. ఎక్కువగా ఎగుమతులు చేస్తున్న దేశమే ఎక్కువగా పురోగమిస్తున్నదని, ఇందులో చైనా ఎంతో మెరుగ్గా ఉన్నదని విశ్లేషించారు. మార్కెట్‌ను అధ్యయనం చేసి, తయారీ రంగంలో యూకే, జర్మనీ వంటి దేశాలు ముందుండటంతో చైనా చిన్నచిన్న వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టిందని చెప్పారు. మాంజా, నెయిల్ కట్టర్స్, షేవింగ్బ్లేడ్స్, ఎలక్ట్రానిక్గూడ్స్, ఎలక్ట్రికల్బల్బ్లు, ఫర్నీచర్ వంటివాటిని ఎంపిక చేసుకొని ప్రపంచాన్నే డామినేట్ చేస్తున్నదని వివరించారు. ఎగుమతుల వృద్ధిరేటు ఎంత పెరిగితే దేశం అంత వృద్ధిచెందుతున్నట్టని, పెరగడంలేదంటే మునుగుతున్నట్టు లెక్కని చమత్కరించారు. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న ఎకనమిక్ ట్రెండ్స్ ఇవేనని తేల్చి చెప్పారు.
నేను చెప్పినవి అబద్ధమైతే రాజీనామా చేస్తా
‘విశ్వగురు ఎటుపోయాడు? విశ్వగురువు మేక్ ఇన్ ఇండియా అంటే, ఏందో అయిపోతున్నదంటే, ప్రళయం బద్ధలవుతున్నదంటే.. ఇవన్నీ వాస్తవాలని అనుకున్నాం. ఆయన చెప్పినదాంట్లో ఒక్కమాట కూడా వాస్తవ రూపందాల్చలేదు. ఇది నిజం. నేను చెప్తున్నది అబద్ధమైతే రాజీనామా చేస్తా. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా’ అని కేసీఆర్ సవాల్ విసిరారు. తాను చెప్పినవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ చెప్పిన లెక్కలేనని స్పష్టంచేశారు. ఇవన్నీ భారత ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన లెక్కలని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇందుకు ఎవరిని నిందిస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఎగుమతులు పెంచకుండా అభివృద్ధి కావడమనేది అర్థంలేని ముచ్చటని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మోదీ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
దొందూ దొందే
‘కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా లేదు. దొందూ దొందే. ఇద్దరూ దేశాన్ని ముంచుతారు. కాంగ్రెస్ ముంచింది. ఇప్పుడు ఈయన పాలన ఇంకా ఘోరంగా ఉన్నది అని ఎకానమిస్ట్ రాశారు. అప్పుడు లైసెన్స్ రాజ్ ఉండగా, ఇప్పుడు సైలెన్స్ రాజ్ ఉన్నదని రాశారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. ఏమీ మాట్లాకుండనే అదానీ, మదానీ, అంబానీ దగ్గర లక్షల లక్షల కోట్లు, ఎన్పీఏల పేరిట రూ.14 లక్షల కోట్లు మాఫీలు చేశారని దుయ్యబట్టారు. దాంతో ఏమి ఒరిగిందో, ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చినమంటరు.. ఎవరికిచ్చిన్రో, ఏం సంగతో భగవంతునికే తెలుసని తనదైన శైలిలో పేర్కొన్నారు.
ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్
‘ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్’ అని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పిన మాటలను సీఎం కేసీఆర్ ఉటంకించారు. పార్లమెంటులో బీఆర్ఎస్ సభ్యులు ఏది అడిగినా నో డేటా అవైలబుల్. కరోనాలో ఎంతమంది చనిపోయారంటే నో డేటా అవైలబుల్. ముఖ్యమైన విషయం ఏది అడిగినా ఎన్డీఏ. దటీజ్ ఎన్డీఏ అని కేసీఆర్ చమత్కరించారు.
ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని పార్టీకి ఒక్క ఓటైనా ఎందుకెయ్యాలి?
రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి తెలంగాణలో ఒక్క ఓటైనా ఎందుకు వెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. ‘తెలంగాణకు మెడికల్ కాలేజీలు అడిగితే ఇవ్వలేదు.. గిరిజన యూనివర్సిటీ కోసం గిరిజనశాఖ మంత్రి ఆరుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. యూనివర్సిటీ కోసం ములుగు దగ్గర 300 ఎకరాల స్థలం హ్యాండోవర్ చేసి ఐదేండ్లయ్యింది. జాగా ఇచ్చిన విషయం బీజేపీ సభ్యుడు రాజేందర్‌కు కూడా తెలుసు. ఇదే విషయమై పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ప్రశ్నిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. కేంద్రం ఇంత సత్యదూరంగా ప్రవర్తించవచ్చా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
కేంద్రం తీరుతో రూ.3 లక్షల కోట్ల నష్టం
దేశ జనాభాలో తెలంగాణ జనాభా 3% ఉండగా దేశ జీడీపీలో తెలంగాణ కంట్రిబ్యూషన్ 4.9% ఉన్నదని సీఎం కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణ ఒన్ ఆఫ్ ది ఫీడింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ’ అని చెప్పారు. రాష్ర్టానికి కేంద్రం ఒక్క పనన్నా చేసిందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో నాన్ పర్ఫార్మెన్స్ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని వివరించారు.
నోట్ల రద్దు విషయంలో చెప్పిందొకటి.. చేసింది మరొకటి
నోట్ల రద్దు సందర్భంగా తాను మోదీని వ్యక్తిగతంగా కలిశానని, అప్పుడు ఆయన చెప్పింది వేరు, చేసింది వేరని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని చెప్పింది నమ్మి నాడు నోట్ల రద్దును సమర్థించామని తెలిపారు. నల్లధనం పోతదని, పైసల చలామణీ పోయి డిజిటల్ కరెన్సీ వస్తదని, టెర్రరిస్టులకు పైసలు దొరకకుండా పోతాయని, మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుందని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు అంతా ఉల్టా అయిందని, డీమానిటైజేషన్‌కు ముందు రూ.15-16 లక్షల కోట్ల కరెన్సీ సర్క్యులేషన్లో ఉంటే, ఇప్పుడు 32.43 లక్షల కోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయని వివరించారు. కేంద్రానికి సంబంధించిన ఏ పాలసీ సక్సెస్ అయిందో.. దేని ద్వారా దేశానికి లాభం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీబీసీని బ్యాన్ చేస్తరా?
‘అసలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. మాకు నోరుంది కాబట్టి.. అదరగొడతం కాబట్టి.. మందబలం ఉంది కాబట్టి.. ఎటుబడితె అటే మాట్లాడుతాం.. బీబీసీని కూడా బ్యాన్ చెయ్యమంటం.. ఎక్కువ మాట్లాడితే జైలుకేస్తం.. మిమ్మల్ని ఇది జేస్తం.. అది జేస్తం’ అంటూ ఈ అహంకారాలు, హూంకారాలు ఎంతవరకు కరెక్ట్?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొందరికి భయం ఉండొచ్చని, కానీ అందరూ భయపడరని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వంలో ఏ వివరాలు అడిగినా లేవనే జవాబు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్
స్వతంత్ర భారత చరిత్రలో మోస్ట్ వరస్ట్ పర్ఫార్మింగ్ ప్రభుత్వమేదీ అంటే అది మోదీ గవర్నమెంట్
ఏమి సాధించారని మోదీ ఫొటో పెట్టాలి
వారు సాధించిన ఈ గొప్పదనానికి ఈ సువిశాల భారతదేశానికి ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ రేషన్ షాపుకొచ్చి ప్రధానమంత్రి ఫొటో లేదని డీలర్‌తో కొట్లాడితే ఆ డీలర్ ఏమి చేస్తాడని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. డీలర్‌తో దేశ ఆర్థికమంత్రి కొట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఫొటో పెడతవా? పెట్టవా? నీ సంగతి చూస్తా.. అంటే ఎలా? అని కడిగేశారు. ఏమి సాధించారని, ఏమి గొప్పదనం ఉన్నదని మోదీ ఫోటో పెట్టాలి? అని సూటిగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక మంత్రి వచ్చి రేషన్‌షాపులో మోదీ ఫొటో పెట్టాలని అడగడం విడ్డూరమని చెప్పారు.
బీజేపీ వాళ్లు దివాలా తీసుకుంటూ కూడా మేమే గొప్ప అంటరు. కిందపడ్డా.. అన్నట్టు.
బీజేపీ, కాంగ్రెస్ తీరు ఛోటే భాయ్ సుభానల్లా, బడేభాయ్ మాషా అల్లా అన్నట్టున్నది.