హైదరాబాద్ : మరో మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎగువ నుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని సీఎం చెప్పారు.
రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.