CM KCR | సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పక్కానే పారుతున్నా.. గుక్కెడు నీళ్లకు మనం నోచుకోలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య పాలనలో నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు ఉద్యమంలో నేను పాట రాసిన.
‘పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయే.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలెండే’ అని నేను పాట రాసిన. బాగా ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. నారాయణపేట, మహబూబ్‌నగర్, కొడంగల్, మక్తల్, దేవరకద్ర, షాద్‌నగర్, జడ్చర్లకు ఫుల్‌గా నీళ్లు రావాలి. దాని కోసం ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. దానిపై కేసులు వేశారు. ప్రాజెక్టు అయితే కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని కుట్రలు చేసి 196 కేసులు వేశారు. ఈ మధ్యనే అన్నీ గెలిచాం. దేవుడి దయతో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. అక్కడ లిఫ్ట్ పని కంప్లీట్ అయ్యింది. మొన్ననే పోయి స్వయంగా బటన్ నొక్కినా’ అని తెలిపారు.
‘నారాయణపేట, కొడంగల్, మక్తల్‌కు నీరు వచ్చేలా కాలువను మంజూరు చేశాం. టెండర్లు పిలిచే దశలో ఉన్నది. ఏడెనిమిది మాసాల్లో ఎన్నికల తర్వాత ఆ కాలువ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడూ రాజేందర్‌రెడ్డి నాతో కొట్లాట. సార్ జయమ్మ చెరువు సంగతి ఏందీ? అది కూడా నిండాలి ఖచ్చితంగా అని కాలువ అలైన్‌మెంట్‌ను మార్చి జయమ్మ చెరువులోకి నీరు వచ్చేలా చేసింది రాజేందర్‌రెడ్డే. అట్లనే దామెరగిద్ద, కొడంగల్‌లో కొన్ని ఎత్తయిన ప్రాంతాలున్నయ్. వాటికి కూడా కడుపు నిండా రావాలని చెప్పి.. కర్నాటక బార్డర్లో ఉన్న కానుకుర్తి దగ్గర ఎత్తు ప్రదర్శంలో రిజర్వాయర్ కట్టి లిఫ్ట్ పెడితే.. ఎత్తయిన మండలాలకు నీళ్లు వస్తయ్.. నారాయణపేట పచ్చబడుతుందని రాజేందర్‌రెడ్డి కోరిక’ అని తెలిపారు.
‘నేను వందశాతం నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక సంవత్సరం కాలంలోపే కాలువను తీసుకువచ్చి బ్రహ్మాండంగా చేస్తే.. నారాయణపేట మొత్తం పచ్చనిపంట పొలాలు చూడాలని అనుకుంటున్నా. ఆ కోరికను దేవుడు తీరుస్తడని నమ్మకం ఉన్నది. రాజేందర్‌రెడ్డి కోరిక చాలా పెద్దగున్నది. రింగ్‌రోడ్డు వస్తే హైదరాబాద్‌లాగా అవుతమని అంటున్నడు. నేను మీ అందరికీ చెబుతున్నా. ఈ కాలువ పని ముందుగాల కంప్లీట్ చేద్దాం. చెరువులను నింపుకొని రెండులక్షల ఎకరాల్లో పంటలు పండితే ఆటోమేటిక్‌గా పెట్టుబడులు ఉరికివస్తయ్. భూముల ధరలు పెరుగుతయ్. హైదరాబాద్ దారిలోనే నారాయణపేట దారినపడుతం. రాజేందర్‌రెడ్డి అడిగిన కోరికలను వందశాతం ఎన్నికల తర్వాత జీవోలు ఇచ్చి మంజూరు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.