హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. సమ్మె వద్దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, అధికారులు చెప్పినా వినకుండా ఒక భ్రమలో వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని తిరుగుతున్నరు. ఎంతోమందిని ఆదుకున్న ప్రభుత్వానికి వాళ్లపై కోపమెందుకు ఉం టది? వారికి ఒక పెద్దాయనలా హెచ్చరిస్తున్నా. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. భట్టివిక్రమార్క, మంత్రి దయాకర్, అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని మా ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మానవతా దృక్పథం తో ఆలోచించాం. అందరినీ వాపస్ తీసుకొంటున్నాం.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
ఉద్యోగులకు కడుపునిండా జీతాలిచ్చుకుంటున్నం. చిన్న ఉద్యోగులకు సైతం 30 శాతం పీఆర్సీ అమలుచేసినం. మంచి మనసుతోనే ఎంతోమంది గురించి ఆలోచిస్తున్నం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంప్లాయీస్ లీడర్. సెర్ప్, మెప్మా ఉద్యోగుల పరిస్థితి గురించి ఆలోచించాలని ఆడిగారు. సెర్ప్ సొసైటీ. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మహిళాసంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషిచేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ప్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెకలు తేల్చండి. ఉద్యోగులందరికీ మంచి చేద్దాం.