హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలకు, వడ్లు కొననందుకు, కరెంట్ బంద్ చేస్తమంటున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు కేంద్రం నషాళానికి అంటేలా దెబ్బ కొడుదామని చెప్పారు. ఓటేసేముందు ఒకసారి బాయికాడికి వెళ్లి బోరుకు, వంటింట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైతది? కనగల్ వాగులో పడేసినట్టే అయితది. కేంద్రంలో, రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఓటర్లు బలమైన దిక్కే మద్దతుగా నిలవాలి. తెలంగాణ దేన్ని బలపరుస్తున్నదో, ఆ మెసేజ్ దేశానికి వినిపించాలి. మునుగోడులో ఒక వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నరనేది మునుగోడులో వేసే ఓటు ద్వారా ఢిల్లీకి చేరాలి. ఈ ఎన్నికను దేశమంతా చూస్తున్నది. కాబట్టి గోల్మాల్, గారడీ విద్యలు, గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు చూసి మోసపోతే గోసపడ్తం. ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అమ్మలు అందరూ ఊళ్లకు వెళ్లిన తర్వాత పల్లెల్లో చర్చలు పెట్టండి. కేసీఆర్ సభలో చెప్పినవన్నీ నిజమా? కాదా? అని చర్చించండి. పింఛన్లు, కరెంట్, సౌకర్యాలు, వసతులు, పథకాలు అన్నీ ఇలాగే కొనసాగాలా? లేక ఊడకొట్టుకోవాలా? అని ఆలోచన చెయ్యండి.
పేదోళ్లపై పన్నులు.. పెద్దోళ్లకు రుణమాఫీలు
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు ఇష్టానుసారంగా వేస్తున్నారు. బతికితే జీఎస్టీ, చస్తే జీఎస్టీ. ఇదేం దోపిడీ? పిల్లలు తాగే పాల నుంచి శ్మశానాల వరకూ దేన్నీ వదల్లేదు. చేనేత కార్మికులపైనా జీఎస్టీ విధించారు. ఇవన్నీ తీసుకెళ్లి దొంగలు, దోపిడీదార్లకు పంచి పెడుతున్నడు. పేద ప్రజల పొట్టగొట్టి, బ్యాంకులను ముంచేవాళ్ల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నడు. అందుకే మునుగోడు ప్రజలు ఆలోచించాలి. పోలింగ్ బూత్‌కు వచ్చేముందు ఒకసారి వ్యవసాయ బోరు దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని రండి. అక్కాచెల్లెళ్లు గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చి ఓటెయ్యండి. గ్యాస్ ధర ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో తలుచుకొని ఓటెయ్యండి. గ్యాస్ ధర మళ్లీ రూ.400కు రావాలంటే ఈ దొంగలను తరిమికొట్టాలి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చెయ్యాలంటే కుదరదు. యుద్ధం చేసేవాడికే కత్తి ఇచ్చే చైతన్యం రావాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి.
గొర్రెల మందలా పోతే గోల్మాలే
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలన్నా, కరెంట్ పుష్కలంగా రావాలన్నా తెలంగాణతోనే సాధ్యమని చెప్పాను. తెలంగాణ వచ్చింది. ఫ్లోరైడ్ పోయింది. 24 గంటల కరెంట్ వచ్చింది. ఇదంతా నిజమో? కాదో? ఆలోచన చెయ్యండి. ఏవడో గాలిగాడు, గత్తరగాడు వచ్చి ఏదో చెప్తే, ఏది పడితే అది మాట్లాడితే వాడి వెంట గొర్రెలమందలా పోతే గోల్మాల్ అయిపోతం. బతుకులు ఆగమైతవి. ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నం. పేద, మధ్యతరగతి అందర్నీ కాపాడుకుంటున్నం. గతంలో ఆగమైనం కాబట్టి ఒక తొవ్వకు రావాలని పాటుపడుతున్నం. పాటుపడే వాళ్లను కాదని, మనకు పోటుపొడిచే వాళ్లకు ఓటేస్తే.. మనకే దెబ్బతగులతది. మీ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి.. ఈ విషయాలన్నీ నేను మీకు మనవి చేస్తున్నాను. మరోసారి సీపీఐ వాళ్లకు ధన్యవాదాలు. క్రియాశీల, ప్రగతిశీల శక్తులు అందరం ఏకమై ముందుకుపోవాలి. కర్షకులు, కార్మికులు, సామాన్య ప్రజలను కాపాడటం కోసం కంకణబద్ధులమై ఈ దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుంది. మునుగోడులో కూడా గిరిజన సోదరులు ఉన్నారు. మా తండాకు మా సర్పంచి కావాలని మీరు అడిగితే ఎవరైనా చేశారా? కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మూడున్నర వేల గిరిజన తండాలను పంచాయతీలుగా చేశాం. గిరిజన బిడ్డలు ఇవాళ రాజ్యమేలుతున్నారు. నేను చెప్పేవన్నీ మీ కండ్ల ముందు కనిపిస్తున్నవే. మీరందరూ అనుభవిస్తున్నవే. అటుకులు తిన్నమో, ఉపవాసం ఉన్నమో, పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. సాధించుకున్న రాష్ర్టాన్ని ఓ క్రమపద్ధతిలో పెట్టుకుంటున్నం. అవన్నీ గుర్తు తెచ్చుకోండి. మునుగోడు ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దు. క్రియాశీల, ప్రగతిశీల శక్తుల సందేశాన్ని దేశానికి చేరవేయాలి. ప్రజలు చైతన్యంతో ఆలోచించాలి. అందుకే.. ఆలోచించండి. అలవోకగా, ఏమరపాటుగా ఓటెయ్యకండి. మునుగోడు నుంచి అనూహ్యమైన ఫలితం రావాలి. అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మునుగోడు గెలుపుతో తెలంగాణ ప్రజల కాంక్ష ఢిల్లీకి బలంగా వినపడాలి.
పింఛన్ రూ.2 వేలు కావాలా? రూ.600 కావాలా?
మునుగోడులో లక్ష మంది రైతులకు రైతుబంధు వస్తున్నది. 8 వేల మంది దివ్యాంగ పిల్లలకు పింఛను వస్తున్నది. 40 వేల మందికి రూ.2 వేల చొప్పున పెన్షన్ అందుతున్నది. ఇవన్నీ బంద్కావాల్నా? వాళ్లు ఇస్తరా? సంక్షేమ పథకాలు బంద్ పెడ్తరు. బీజేపీ పాలిత గుజరాత్లో రూ.600 పింఛను ఇస్తున్నరు. బీజేపీని నమ్మి ఓటేస్తే భవిష్యత్తులో మునుగోడు పరిస్థితి అంతే అయితది. వడ్లు కొనాలని కేంద్రాన్ని అడిగితే రూ.2 వేల పింఛను ఎవరు ఇవ్వుమన్నరు? గుజరాత్లో రూ.600 ఇస్తే మాకు ఓటు వెయ్యటం లేదా? మీరెందుకు ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు? అని అడుగుతున్నరు. రూ.2 వేల పింఛను ఇచ్చే ప్రభుత్వం కావాల్నా? రూ.600 ఇచ్చే ప్రభుత్వం కావాల్నా?