హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా భారతజాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, లింగ వివక్ష, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని సమసమాజం దిశగా నడిపించేందుకు ఆమె తన జీవితాన్ని ధారపోశారని వివరించారు. ఆమె భర్త జ్యోతిబాఫూలే ప్రోత్సా హం మహోన్నతమైనదని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాలు, మహిళల సమాన హకుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీతరింపులు, అవమానాలు ఎదురైనా మొకవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకుసాగారని పేర్కొన్నారు. విద్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం దృఢచిత్తంతో, మహా సంకల్పంతో పోరాడారని కీర్తించారు. సంఘసంసర్తగా, రచయిత్రిగా, సామాజిక సంసరణల కోసం నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా సావిత్రీబాయి అందించిన స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి, సామాజిక అభ్యున్నతికి ఆమె ఆలోచనలు నేటికీ ఆచరణయోగ్యమైనవేనని తెలిపారు. జీవితపు చివరిక్షణం వరకు పీడిత ప్రజల సేవ కోసమే అంకితమైన సావిత్రీబాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భారతజాతికి ప్రాత:స్మరణీయమని పేర్కొన్నారు.
సావిత్రీబాయిఫూలే స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హకుల కోసం కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. స్త్రీ సాధికారత కోసం సావిత్రీబాయిఫూలే ఎనలేని కృషి చేశారని పలువురు మంత్రులు స్మరించుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం విశేష కృషి చేసి, తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సేవలందించారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ తదితరులు గుర్తు చేసుకున్నారు.