హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంటే ఇస్తామంటున్నారని, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్‌ను తీసేసి భూమాత పెడతామంటున్నారని, వీఆర్వోలను, పట్వారీలను తీసుకొస్తామంటున్నారని, అంటే మళ్లా తాకట్లు, పైరవీకారులు, లంచగొండుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు. మళ్లీ రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుందని, కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లయితదని అన్నారు. గురువారం మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు.
‘ధరణి ఊడగొడుతాం. రైతుబంధు తప్పు, 3 గంటల కరెంట్ ఇస్తం అనేటోళ్లు కరెక్టా? అన్ని విధాలా మీ వెంట ఉంటా అని చెప్పెటోళ్లు కరెక్టా? ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. పేద ప్రజలు, రైతుల తరఫున బీఆర్ఎస్ అలుపెరగని యుద్ధం చేస్తున్నదని, ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసేవాడికే ప్రజలు కత్తిని అందించాలని కోరారు. 50 ఏండ్లకుపైగా తెలంగాణ ప్రజలను గోసపెట్టిన కాంగ్రెస్ పాలనను, పదేండ్లలో సంక్షేమ ఫలాలను అందించిన బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పాలమూరును అడ్డుకున్నది కాంగ్రెస్సే
‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక్కటే మిగిలి ఉండే. పాలమూరు ఎత్తిపోతలను కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నరు. 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేసిన్రు’ అని కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరుకు అన్ని క్లియరెన్స్‌లు వచ్చాయని, పంచాయితీలు పోయాయని, ప్రాజెక్టు పూర్తయ్యిందని తెలిపారు. కేవలం వికారాబాద్‌కు తవ్వాల్సిన కాలువే మిగిలి ఉన్నదని అన్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతలలో వాటా ఉన్నదని, కచ్చితంగా ఏడాది కాలంలో నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ పవర్‌హాలిడేలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణలో మళ్లీ పవర్ హాలిడేలు వస్తాయని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, అందుకే విదేశాల నుంచి కూడా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తయితే మరో 4 వేల మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం పెరుగుతుందని, అప్పుడు తెలంగాణ విద్యుత్తు మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనకు పటాన్చెరు నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ అని తెలిపారు.
గతంలో కాలుష్య కోరలకు ప్రజల బతుకులను వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి నీళ్లు తాగారో ప్రజలు ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. కలుషిత నీళ్లు తాగి జబ్బుల బారిన పడేటోళ్లని, చర్మవ్యాధులు వచ్చేవని, దవాఖానల చుట్టూ తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఈ రోజు మిషన్ భరీగథతో ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. కార్మికుల కోసం పటాన్చెరులో 350 పడకల దవాఖానను నిర్మిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది?
‘వేల కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ మన రాష్ట్రం మనకైంది కాబట్టి, మన పైస మనదగ్గరే ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమైతంది’ అని కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఎవడో వచ్చి ఏదో చెప్తున్నాడని, అబద్ధాలు, అభూత కల్పనలు. ‘సాయి సంసారి లచ్చి దొంగా’ ఇట్లా లేని కథలన్నీ మోపయ్యాయని, దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మనకు తాగేందుకు చుక్క మంచినీరు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇవన్నీ మదిలో ఉంచుకొని మంచివాళ్లకు ఓటువేస్తేనే మంచి పాలన వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో మన వేలితో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నదని, కర్ణాటక ఇప్పటికే కాంగ్రెస్‌కు ఓటేసి చాలా ఇబ్బందులు పడుతున్నదని చెప్పారు.
పేదలు, రైతుల తరఫున బీఆర్ఎస్ యుద్ధం
తెలంగాణ వచ్చిన రోజున మంచినీళ్లు, సాగునీళ్లు లేవని, ఆకలి చావులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఇట్లా అనేక సవాళ్లు ఉండేవని కేసీఆర్ గుర్తుచేశారు. ఆర్థికవేత్తలతో చర్చించి సరైన ప్రణాళికలు రూపొందించుకొని, ఆ దిశగానే ముందుకుపోతున్నామని వివరించారు. ఆసరా పింఛన్లతోపాటు ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందేలా చూశామని చెప్పారు. అనంతరం వ్యవసాయాన్ని స్థిరీకరించి, అన్నదాతల వెన్నుదన్నుగా నిలిచామని తెలిపారు. పదేండ్లలో బీఆర్ఎస్ సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగ సూచికలే నిదర్శమని ఉదహరించారు.
ఈ సమయంలో పొరపాటు చేస్తే పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తొమ్మిదన్నరేండ్లలో ఒక్క కర్ఫ్యూ కూడాలేదని, ఒక్క మత ఘర్షణకు తావులేకుండా పరిపాలిస్తున్నామని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పదేండ్ల పాలనలో మైనార్టీ సంక్షేమానికి రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదన్నరేండ్లనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.
హిందూ, ముస్లింలు తమకు రెండు కండ్లని, ఎలాంటి పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ముస్లిం, ఇతర మైనార్టీల వెంట కేసీఆర్ ఉన్నాడని ఎవ్వరూ మర్చిపోవద్దని, ఇంకెవ్వరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ఇమాన్దార్ సర్కార్ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌గా వర్ధిల్లుతుందని చెప్పారు.
కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
పటాన్చెరులో కాలుష్యం తగ్గించేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నామని, కాలుష్యరహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పాశమైలారంలో కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి అక్కడ కూడా కాలుష్యాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. గుండెకు వేసే స్టంట్లు కూడా పటాన్‌చెరులోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. కంటి వెలుగు కింద 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చామని, ఆ అద్దాలు కూడా పటాన్‌చెరులోనే తయారవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పెద్దసంఖ్యలో ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. రాబోయేరోజుల్లో మొత్తం ఔటర్ రింగురోడ్డుకు మెట్రోను తీసుకొస్తామని, అప్పుడు పటాన్చెరు దశనే మారిపోతుందని చెప్పారు.
మేం ఢిల్లీకి గులాములం కాదు.. అక్కడ మాకెవడూ బాసుండడు. మాకు ప్రజలే బాసులు. వాళ్లు ఆదేశిస్తేనే చేస్తాం.
ఆనంద్‌ను గెలిపిస్తే ఒకేదఫాలో దళితబంధు
దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళిబంధును అమలుచేశామని, ఇప్పుడక్కడ దళితవాడలు దొరలవాడల మాదిరిగా తయారయ్యాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ దళితబిడ్డలు ఎక్కువగా ఉన్నారు. ఆనంద్‌ను గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడతలో దళితబంధు పెడతాం. ఈ దెబ్బతో దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలవుతాయి. ఎవరో ఎల్లయ్య గెలిస్తే వచ్చేదేం లేదు. ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అయితది’ అని అన్నారు. తన సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ 24 గంటల
కరెంట్ వేస్ట్ అంటున్నడు. 3 గంటల కరెంటే సరిపోతదని చెప్తున్నడు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలె అని అంటున్నడు. రైతులందరి దగ్గర 3 హెచ్‌పీ మోటర్లున్నయ్. 3 గంటల కరెంటు ఒకేసారి ఇస్తే.. అందరూ ఒకటేసారి కట్కలు ఒత్తితే.. ట్రాన్స్ఫార్మర్లు పటాకలు పేలినట్టు పేల్తయ్. అవేకాదు సబ్స్టేషన్లు కూడా పేలిపోతయ్. అంతలోడ్ తీసుకుంటయా? ఇప్పుడున్న తీగలు సరిపోతయా? రైతులకున్న తీగలుకూడా సరిపోతయా? ఇంతర నిర్లక్ష్యంగా మాట్లాడుతరు.
-సీఎం కేసీఆర్
మహిపాల్‌రెడ్డిని గెలిపిస్తే పటాన్చెరు మరింత అభివృద్ధి
గతంలో పటాన్చెరు వచ్చినప్పుడు ఆర్టీవో, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు, ఐటీఐ కాలేజీ కావాలని మహిపాల్‌రెడ్డి అడిగారని, తెల్లారే జీవో ఇచ్చేశామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఆఫీసులన్నీ పటాన్చెరు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ‘మేం ఢిల్లీకి గులాములం కాదు. మాకు ఢిల్లీలో ఎవడూ బాసు ఉండడు. తెలంగాణ ప్రజలే మా బాసులు. మమ్మల్ని నిర్ధేశించేది.. ఆదేశించేది ప్రజలే. ఒకరోజు నేనొచ్చిన. మీరు కోరినరు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చెబితే.. తెల్లారే జీవో వచ్చింది. ఈ విధంగానే అన్ని పనులు ఉంటయ్’ అని భరోసా ఇచ్చారు. మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే పటాన్చెరును మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తెలంగాణ తెచ్చినోడు ఎవడు?
24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు? ఇంటింటికీ మంచినీళ్లు తెచ్చినోడు ఎవడు? ఎన్కటికి ఎవడో అన్నడట మీరు మొత్తం వంటలు చేసి తయారు చేసి పెట్టుర్రి.. యాళ్లకు నేనొచ్చి వడ్డిస్తా అన్నడట. ఇప్పుడు కాంగ్రెసోళ్ల యవ్వారం అట్లున్నది.
-సీఎం కేసీఆర్
జహీరాబాద్‌కు ఆత్మగౌరవ పరీక్ష
ఈ ఎన్నికలు జహీరాబాద్‌కు ఆత్మగౌరవ పరీక్ష అని కేసీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జహీరాబాద్ నుంచి ఆత్మ బలిదానాలు జరిగాయి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు మంచివాడు. పద్ధతి కలిగిన మనిషి, చదువుకున్నవాడు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి మాణిక్‌రావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందిరిపై ఉంది’ అని పిలుపునిచ్చారు. ఎక్కడో వికారాబాద్‌లో చెల్లని రూపాయి.. జహీరాబాద్‌లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. స్థానికుడైన మాణిక్‌రావును తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పేదప్రజలు, రైతుల తరఫున బీఆర్ఎస్ అలుపెరగని యుద్ధం చేస్తున్నది. ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసేవాడికే ప్రజలు కత్తిని అందించాలి.
కాంగ్రెస్‌కు ఓటేస్తే పవర్ హాలిడేలే. వ్యవసాయంతోపాటు పరిశ్రమలకు 3 గంటల కరెంటే. అంతా కొంపలగుత్త యవ్వారం. కబ్జాకోరు, దగాకోరు కాంగ్రెస్‌ను నమ్మితే.. పొరపాటుచేస్తే మనకూ కర్ణాటక గతే
-సీఎం కేసీఆర్
కాంగ్రెస్‌ది కొంపలగుత్త యవ్వారం.బేకార్గాళ్లకు అధికారమిస్తే బేకారే జరుగుతది.ధరణి ఊడగొడుతాం. రైతుబంధు తప్పు, 3 గంటల కరెంట్ ఇస్తం అనేటోళ్లు కరెక్టా? అన్ని విధాలా మీ వెంట ఉంటా అని చెప్పెటోళ్లు కరెక్టా? ప్రజలంతా ఆలోచించాలి.
సబితమ్మకు భూదేవికి ఉన్నంత ఓపిక
వర్షం పడుతున్నా భారీగా తరలివచ్చిన జనాన్ని చూస్తేనే సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, నిత్యం ప్రజల్లోనే ఉంటారని, భూదేవికి ఎంత ఓపిక ఉంటదో సబితమ్మకు అంత ఓపిక ఉంటుందని ప్రశంసించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని, ఉద యం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ప్రజలను కలుస్తూనే ఉంటారని, సమస్య తన పరిధిలో ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తారని, తన పరిధిలో లేకుంటే పైస్థాయిలోకి వెళ్లి పట్టుబట్టి పరిష్కరిస్తారని వివరించారు. నగరంలో రూ.వెయ్యి కోట్లతో నాలా డెవలప్మెం ట్ కార్యక్రమం తీసుకోవడంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రకూడా ఉన్నదని చెప్పా రు.
రూరల్ ఏరియాకు కావాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి కందుకూరులో మెడికల్ కాలేజీ పెట్టించారని, ఆమె వల్లే అది సాధ్యమైందని వెల్లడించారు. తుక్కుగూడ ప్రాంతంలో ఈ మధ్యనే 53 పరిశ్రమలు వచ్చాయని, కలెక్టరేట్ పక్కనే ఫాక్స్‌కాన్ వచ్చిందని, దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. చైనా నుంచి మరో పెద్ద కంపెనీ వచ్చేందుకు సిద్ధమైందని, అది తుదిదశ చేరుకున్నదని, తద్వారా మరో 3 లక్షల మందికి ఉద్యోగాలు రా నున్నాయని వెల్లడించారు. నియోజకవర్గం గురించి సబితా ఇంద్రారెడ్డి పడే తపనకు ఇదే నిదర్శమని తెలిపారు. సబి తా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
పటాన్చెరు నియోజకవర్గం ఓ మినీ ఇండియా. అమీన్పూర్లో గతంలో 15 నుంచి 20 కాలనీలు ఉండేవి. ఇప్పుడు 300 కాలనీలు ఏర్పాటయ్యాయి.. ఇక్కడ అన్ని రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకించి ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉంటారు. అందులో పరిశ్రమల యజమానులు, పనిచేసే కార్మికులు ఉంటారు. కాంగ్రెస్ రాజ్యం ఎట్లుండేది? ఇప్పుడు బీఆర్ఎస్ రాజ్యం ఎట్లున్నది? అనేది పారిశ్రామిక కార్యకర్తలు ఆలోచించాలి.
-సీఎం కేసీఆర్