అదే ఊరు.. అదే సెంటర్.. అదే సందర్భం..
ఎన్నికల నామినేషన్ తర్వాత జరిగిన అదే ప్రచార సభ!
కానీ, తేడా అల్లా ఒక నాయకుడికీ మరో నాయకుడికి!
ఇటువైపు బీఆర్ఎస్.. అటువైపు కాంగ్రెస్! ఇటువైపు కేసీఆర్.. అటువైపు రేవంత్
ఇటువైపు ప్రజాసందోహం.. అటువైపు ఖాళీ కుర్చీలు! ఇటు జనహోరు.. అటు అత్తెసరు!
ఒక్కరోజు తేడాతో కామారెడ్డి గడ్డపై కనిపించిన రెండు భిన్న దృశ్యాలివి. గురువారంనాడు నామినేషన్ వేసిన అనంతరం కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాబహిరంగ సభావేదికపై సహచర నాయకులతో కలిసి కేసీఆర్ రణగర్జన చేశారు. శుక్రవారం రేవంత్ నామినేషన్‌కు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ నాయకగణం, పదుగురు సీఎం అభ్యర్థులు, గ్రూపుల సంస్కృతికి ప్రతిబింబంగా మందబలంతో వచ్చిన నాయకులు వేదికపై దర్పాన్ని చాటుకున్నారు. రెండు సభలకూ మధ్య ఒక్కటే తేడా. జనాదరణ!.. ప్రజాస్పందన!
వన్నె తగ్గని గులాబీ జెండాపై జనం పెట్టుకున్న ఆశలకు బీఆర్ఎస్ సభ ప్రతిరూపం కాగా, గతకాలపు శిథిల ప్రాభవాన్నీ ప్రజలు పట్టించుకోని తీరుకు కాంగ్రెస్ సభ ఉదాహరణగా నిలిచింది. వేలాదిగా తరలివచ్చిన జనం ‘సభ ముగిసింది’ అని ప్రకటించినా కదలనివైనం చూస్తే.. ఉద్యమకాలం నుంచీ నేటివరకు కేసీఆర్‌ను కామారెడ్డి ఎలా గుండెల్లో పెట్టుకున్నదో తెలుస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి అతిరథులు, స్టార్ క్యాంపెయినర్లు తరలివచ్చినా కాంగ్రెస్ వేదికవైపు జనం కన్నెత్తి చూడలేదు. ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు.. అక్కడక్కడా కార్యకర్తలు.. వారినీ వెళ్లిపోవద్దంటూ మైకుల్లో అభ్యర్థనలు.. ఇదీ వరస!
ఇప్పుడు కామారెడ్డిలాగే రాష్ట్రం ఆలోచిస్తున్నది!
ఏ గట్టున ఉండాలో ప్రజలకు బాగా తెలుసు!
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా తండోపతండాలుగా తరలిచ్చిన ప్రజలతో గురువారం కామారెడ్డి పట్టణం కిక్కిరిసిపోతే.. శుక్రవారం రేవంత్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి నిర్వహించిన సభ కళావిహీనంగా ముగిసింది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహా నియోజకవర్గం యావత్తు సీఎం కేసీఆర్‌ను పోటీచేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానించింది. దీంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్, స్థానిక నాయకులను వెంటబెట్టుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మైనార్టీ నాయకుడు షబ్బీర్‌అలీని పోటీ నుంచి తప్పించి, తానేదో పొడుస్తానంటూ రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి శుక్రవారం పొరుగు రాష్ట్రమైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘ఇప్పుడే లోకలోడ్ని కాన్తలేడు.. రేపెట్ల నమ్మేది?’ అని స్థానిక నాయకులు చిన్నబుచ్చుకోవటం విశేషం.
సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ జనంతో ఉర్రూతలూగింది. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి గురువారం సాయంత్రం 4 గంటలకు చేరుకోవాల్సి ఉండగా.. అప్పటికే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతంగా కిక్కిరిసిపోయింది. రోడ్లకు ఇరువైపులా జనం, చెట్లు తప్ప డివైడర్ కనిపించని తీరులో నిండిపోయింది. యువకులు, మహిళ లు, ముస్లింలు, వృద్ధులు, వర్తక, వ్యాపార సహా అన్ని వర్గాల ప్రజలు సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎదురెండను సైతం లెక్కచేయక సీఎం ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. సభాస్థలికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఎటుచూస్తే అటు జనమై కామారెడ్డి పట్టణం ఊగిపోయింది. ప్రజల ఉత్సాహం గమనించిన సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి నిర్దేశిత సమయం కన్నా ముందే చేరుకున్నారు. 3.23 గంటలకు ప్రసంగం మొదలుపెట్టి దాదాపు 40 నిమిషాలు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ కరతాళధ్వనులు హోరెత్తాయి. కేరింతలు, ఈలలు, చప్పట్లతో కేసీఆర్ ప్రసంగానికి సభాప్రాంగణం బ్రహ్మరథం పట్టింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచే కామారెడ్డి కాంగ్రెస్ సైలెంటయిపోయింది. శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సభ పేల వంగా ముగిసింది. రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకే నామినేషన్ దాఖ లు చేశారు. ‘జనం వస్తే వస్తం.. వచ్చిండ్రా లేదా? ఇంకెంత సేపు ఈడకూర్చోవాలె? ఆ పెద్ద మనిషి (కర్ణాటక సీఎం సిద్ధరామయ్య)ని ఎంతసేపు వట్టిగ కూర్చోబెడ్తాం? జర సూడుండ్రి.. పోయి జల్ది జనం వచ్చేట ట్టు చూడుండ్రి’ అని రేవంత్‌రెడ్డి ఎంత పురమాయించినా సభాస్థలికి జనం కరువయ్యా రు. రెండు, రెండున్నర గంటలపాటు పొరు గు రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యతోపాటు రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాకూర్, షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, వీహెచ్, మధుయాష్కీ సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ నేత కోదండరాం సహా అనేకమంది నేతలు జనం కోసం పడిగాపులు కాచారు.
చివరకు తమ వెంట తెచ్చుకున్న కార్లలో వచ్చినవారు, కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన కొద్దిపాటి జనంతోనే హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఆ షో ఎంతోసేపు సాగలేదు. పది, పదిహేను నిమిషాల్లో రోడ్లు ఖా ళీ అయ్యాయి. సభా వేదికపై బీసీ డిక్లరేషన్ విడుదల, నేతల ప్రసంగాలు పేలవంగా ముగిశాయి. వచ్చిన కొద్దిమంది కూడా మెల్లమెల్లగా సభా ప్రాంగణం నుంచి జారుకోవడం మొదలుపెట్టారు. దీంతో పది, పదిహేను నిమిషాల్లోనే సభా ప్రాంగణం దాదా పు ఖాళీ (ముందున్న రెండు గ్యాలెరీలు మిన హా) అయిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రేవంత్‌రెడ్డి మైక్ అందుకున్నారు. ఆయన అలా మైక్ పట్టుకొని ప్రసంగం మొదలుపెట్టగానే దాదాపు సభా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. ఖాళీ కుర్చీలకే రేవంత్ తన సందేశాన్ని వినిపించాల్సి వచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం ముందు ట్రాక్టరు, కార్లు సహా వాహనాలు సైతం వాటి వేగాన్ని తగ్గించకుండా వెళ్లిపోవడం గమనార్హం.
శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కన్నడలో ప్రసంగించారు. చివరలో ‘జై కాంగ్రెస్.. జై కర్ణాటక’ అంటూ ఆయన నినదించారు. తెలంగాణ గడ్డపై ఈ కర్ణాటక జయజయ ధ్వానాలేందని కామారెడ్డి వాసులు విస్తుపోయారు. నోటిమాటకైనా ‘జై తెలంగాణ’ అనకపోవడంపై ప్రజల్లో చర్చ సాగుతున్నది. ‘జై కర్ణాటక అనేటోళ్లతో మనకేం లాభం? ఢిల్లీ అధిష్ఠానాలుంటాయి కానీ తెలంగాణ ఓటర్లు ఇక్కడే ఉంటారు. తెలంగాణ సోయి లేని ఇట్లాంటి పార్టీలు మనకవసరమా?’ అన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఇతర రాష్ర్టాల నేతల్లాగే తమ ప్రసంగాల్లో ‘జై తెలంగాణ’ అని నినదించకపోవడంపైనా ఆసక్తికర సాగుతున్నది.