Rythu Bandhu | కాంగ్రెసోళ్ల గోస, బాధ పాపం.. అట్లనన్న గెలుస్తమేమో.. ఇట్లనన్న గెలుస్తమేమో లంగతనం చేస్తున్నరు. మొదట దరఖాస్తు పెట్టి రైతుబంధు పడకుండా ఆపిండ్రు. రైతులకు ఇబ్బంది అయితదని అడిగితే ఎలక్షన్ కమిషన్ ఒక్కరోజు వేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. మళ్లా కాంగ్రెస్ రాష్ట్ర వైస్‌ప్రెసిడెంట్ మొన్న మళ్లొక దరఖాస్తు ఇచ్చిండు. రేపు రైతులకు రాబోయే పైసల్ని కాంగ్రెస్ మళ్లా ఆపింది.
కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకొనే నాయకులు ఉన్నరు, కార్యకర్తలున్నరు. మీకేమైనా సిగ్గూ, మానం ఉన్నదా? అని నేను అడుగుతున్నా. రైతుల నోటికాడ బుక్క ఎత్తగొడుతున్న కాంగ్రెస్‌కు ఎట్ల సపోర్ట్ చేస్తున్నరు? ధరణి తీసేస్తం.. కరెంటు 3 గంటలే ఇస్తం.. అని చెప్తున్న కాంగ్రెస్‌లో ఎట్ల ఉంటున్నరు? రేపు రైతుబంధు ఎత్తేస్తే మీ కొంపలు కూడా ఆరిపోతయిగదా? ఇయ్యాల కాంగ్రెస్ అని తిరుగుతున్నవ్.. రేపు పొద్దుగాల నీ కొంప కూడా కొల్లారం కాదా? తెలిసీ తిరుగుతున్నవంటే నువ్వు రైతువేనా? ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గుండెమీద చెయ్యేసుకొని ఆలోచించాలె.
– షాద్‌నగర్ సభలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుస్తమేమోనని లంగతనం చేస్తున్నరు. ఢిల్లీకి షికాయత్‌ల మీద షికాయత్‌లు జేసి రైతుబంధును ఎత్తగొట్టిండ్రు. రైతు నోటికాడి బుక్క కొట్టిండ్రు. ఎన్ని రోజులు ఆపుతావ్ నువ్వు? మూడో తారీకు ఓట్లు లెకపెడితే మళ్ల బీఆర్ఎస్ గవర్నమెంటే.. ఆరో తారీఖు నుంచి ఎవరి మోతాదు లేకుండా సంతోషంగా రైతుబంధు ఇస్తాం’ అని స్పష్టంచేశారు.
షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో బీఆర్ఎస్ సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకునే నాయకులున్నరు.. కార్యకర్తలున్నరు. మీకేమన్నా సిగ్గు మానం ఉన్న దా? ఎట్ల సపోర్ట్ చేస్తున్నరు కాంగ్రెస్‌కు? రైతు ల నోటికాడ బుక్క ఎత్తగొట్టాలె.. ధరణి తీసే స్తం.. కరెంటు 3 గంటలే ఇస్తం అని చెప్పే కాం గ్రెస్‌ల ఎట్ల ఉంటున్నరు? కాంగ్రెస్ అని తిరిగి తే రేపు మీ కొంపలు కూడా ఆరుతయ్ కదా? కొల్లారమే కదా? నువ్ రైతువేనా? కాంగ్రెస్ కా ర్యకర్తలు కూడా గుండెమీద చేయ్యి వేసుకుని ఆలోచన చేసుకోవాలె’ అని సూచించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను పోల్చండి
అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి వెనుక ఉన్న పార్టీల పాలసీలను చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. ఓటును చెడ్డవారికి వేస్తే చెడ్డ ఫలితాలు, మంచివారికి వేస్తే మంచిఫలితాలు వ స్తాయని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి, ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ చేసిన మోసం వల్లే 58 ఏండ్ల పాటు అరిగోస పడ్డామని వాపోయారు. కాం గ్రెస్ చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. మళ్లా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, మరి ఇందిరమ్మ రాజ్యంలో ఏం సక్కదనం ఉన్నదని, ఎవరు బాగుపడ్డారని, ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఇంకా 1940 మాడల్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్తోనే లంబాడీల గౌరవం
లంబాడీలు దశాబ్దాలపాటు పోరాడినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వమే తండాలను పంచాయతీలుగా చేసి, లంబాడీలు స్వయం పాలన చేసుకొనే అవకాశం కల్పించిందని సీఎం చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి విద్య, ఉపాధి అవకాశాలు పెంచామని తెలిపారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఆ గౌరవం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వివరించారు. సేవాలాల్ మహరాజ్ జయంతిరోజు సెలవు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నందున ఆ రోజు తప్పనిసరిగా సెలవు ఇస్తామని ప్రకటించారు. ‘కాంగ్రెస్ వాళ్లు అనేక అబాండాలు వేస్తున్నారు.
పిచ్చిపిచ్చి మాటలు ప్రచారం చేస్తున్నరు. కాంగ్రెస్ నేతలు ఎన్నడ న్న దళితబంధు గురించి ఆలోచన చేశారా? ఇయ్యాల మనం దళితబంధు ఇచ్చుకొంటు న్నం. క్రమంగా అందరికీ తప్పకుండా ఇచ్చుకుంటం. దానిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న రు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి అమ్ముకొనే హక్కులు ఇద్దామని నేనే చెప్పిన. దానికి కాం గ్రెస్ దొంగలు ఉల్టా వచ్చి అసైన్డ్ భూము లు గుంజుకుంటరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు గుంజుకుంటరు? పోయిన పదేండ్లు గుంజుకున్నదా బీఆర్ఎస్? ఈ లంగ ప్రచారాన్ని నమ్మవద్దు. రేపు గెలిచాక తొలి క్యాబినెట్లో అసైన్డ్ భూములపై యజమానులకు పట్టాలిచ్చే నిర్ణయం చేస్తాం. తొలి నిర్ణయం అదే ఉంటది’ అని వెల్లడించారు.

కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకునే నాయకులున్నరు.. కార్యకర్తలున్నరు. మీకేమన్నా సిగ్గు మానం ఉన్నదా? ఎట్ల సపోర్ట్ చేస్తున్నరు కాంగ్రెస్‌కు? రైతుల నోటికాడ బుక్క ఎత్తగొట్టాలె.. ధ రణి తీసేస్తం.. కరెంటు 3 గంటలే ఇస్తమనే కాంగ్రెస్‌ల ఎట్ల ఉంటున్నరు? నువ్ రైతువేనా?
– సీఎం కేసీఆర్
రైతు బాగుండాలన్నదే మా విధానం
రైతుబంధు దుబారా, వ్యవసాయానికి మూడుగంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కౌలుదారులకు మాత్రమే రైతుబంధు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, మూడేండ్లు కౌలు చేసినోళ్లకే ఆ భూమి సొంతమవుతుందని అన్నారు. ‘కౌలురైతులపై అసెంబ్లీలో పెద్ద లొల్లి అయింది. భట్టి విక్రమార్క దీ నిపై వాదించారు. చావైనా.. బతుకైనా మేం రైతు పక్షానే ఉంటామని చెప్పినం. రైతు సేఫ్ గా, సుఖంగా ఉండాలి.
రైతు భూమి కౌలుకు ఇచ్చుడంటే కిరాయికి ఇచ్చుడే. కౌలుకు ఇస్తే రికార్డులో కబ్జాపేరు రాస్తారు. మరి బంజారాహిల్స్‌లో బిల్డింగులు కిరాయికి వస్తే అక్కడ కిరాయిదార్ల పేర్లు ఎందుకు రాయరు? బంజారాహిల్స్‌లో బిల్డింగులకు ఒప్పుకుంటే రైతులవి కూడా రాద్దామని స్పష్టంచేసిన’ అని గుర్తుచేశారు. ఆ లంగా ముచ్చట్లు వద్దనే ధరణి తె చ్చామని, నేడు రైతుల భూములకు ఎటువం టి ఢోకా లేకుండా పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లకిది జోక్‌లా ఉన్నా.. రైతులకు మాత్రం జీవన్మరణ సమస్య అవుతుందని హె చ్చరించారు. కౌలురైతును దూలం లెక్క మెడ కు పెడతా అని కాంగ్రెస్ అంటున్నదని, రైతులెవరైనా కట్టుకుంటరా? అని ప్రశ్నించారు.
రెండు నెలల్లోనే జీవో -111 క్లియర్
చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధానంగా రెండుమూడు సమస్యలున్నాయని, ఇక్కడ భూము లు అమ్మకుండా జీవో -111 పెట్టారని, దానిని ఎత్తివేసే ప్రయత్నం ఎవరూ చేయలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ జీవోను ఎత్తివేశామని గుర్తుచేశారు. జీవో -111 సమస్యలను రెండు నెలల్లో క్లియర్ చేయించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చేవెళ్ల, అందోల్ నియోజకవర్గాలకు ఆ స్థానాల ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, చంటి క్రాంతికిరణ్ కోరినట్టు ఒకే విడతలో దళిత బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దళితబంధు ఒకే విడుతలో వస్తది కాబట్టి.. ఒక దళిత ఓటు కూడా వేరే పార్టీకి పడొదని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుస్తమేమోనని లంగతనం చేస్తున్నరు. ఢిల్లీకి షికాయత్‌ల మీద షికాయత్‌లు జేసి రైతుబంధును ఎత్తగొట్టిండ్రు. ఎన్ని రోజులు ఆపుతావ్ నువ్వు? మూడో తారీకు ఓ ట్లు లెకపెడితే మళ్ల బీఆర్ఎస్ గవర్నమెంటే.
– సీఎం కేసీఆర్
రైతుల నోటికాడి బుక్క ఎత్తగొట్టిందే కాంగ్రెస్
‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుత్తమేమోనని లంగతనం చేస్తున్నరు. ఓ వైపు వానాకాలం వడ్లు వస్తుండగా, మరోవైపు రైతులు యాసంగి మడులు తడుపుకుంటున్నరు. ఇప్పటికే రైతుబంధు పడాల్సి ఉన్నది. అందుకు ఏర్పాట్లు చేస్తుండంగనే కాంగ్రెసోళ్లు రైతుబంధు నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చిన్రు. రైతుబంధు ఇయ్యినీయెద్దంటే.. ఇయ్యనీయొద్దని కాంగ్రెసోళ్లు ప్రతిరోజూ ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు పెట్టిన్రు.
ఇది రెగ్యులర్ కార్యక్రమం.. పాతదే అని చెప్తే ఒక రోజు టైం ఇచ్చా రు. నిన్న కాంగ్రెస్ మళ్లీ ఢిల్లీకి పోయి షికాయత్ చేసి రైతుబంధు ఆపేశారు. రైతుబంధు ఆపితే వాళ్లకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు. మూడో తారీకు ఓట్లు లెకపెడితే మళ్ల బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. ఆరో తారీకు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుందాం. తెలంగాణ రైతులెవరూ రంది పడాల్సిన అవసరం లేదు. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి డిసెంబర్ మూడో తేదీ వరకే. డిసెంబర్ 6వ తేదీ నుంచి యథావిధిగా రైతుబంధును రైతుల ఖాతాల్లో జమచేస్తాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ బతికుండగా రైతుబంధును ఆపగలరా? అని కాంగ్రెస్ నేతలను సవాల్ చేశారు.
మళ్లీ మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం
రాష్ట్రంలోని పేదలు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ సమ దృష్టితో చూస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎకువగా జీతాలు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో అత్యధిక వేతనాలు అందుకొంటున్నది తెలంగాణ ఉద్యోగులేనని వెల్లడించారు. ‘మళ్లీ మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం. బ్రహ్మాండంగా డీఏలు ఇచ్చుకుందాం. చిరు, చిన్న ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకున్నాం. అంగన్వాడీలు, ఆశా వరర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను చాలా మందిని రెగ్యులరైజ్ చేశాం. ఉద్యోగులకు పీఆర్సీ 30 శాతం ఇస్తే, చిన్న ఉద్యోగుల కడుపు నింపాలని వారికి కూడా 30 శాతం జీతాలు పెంచినం. చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఆర్టీసీ ఉద్యోగులను మొన్ననే ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇలా అందరినీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తు న్నాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ప్రజలందరి కండ్ల ముందే ఉన్నది. కొట్లాడి తెలంగాణ సాధించినం. పదేండ్ల పాలన కూడా ప్రజలకు తెలు సు. కాంగ్రెస్ పరిపాలన 50 ఏండ్లు. బీఆర్ఎస్ పరిపాలన 10 ఏండ్లు. రెండింటినీ బేరీజు వేసుకొని చూసి ఓట్లు వేయండి.
– సీఎం కేసీఆర్
అంజయ్యయాదవ్ అజాత శత్రువు
షాద్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ వజ్రపు తునకలాంటి మనిషని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. అలాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువమంది ఉంటారని అన్నారు. ఉద్యమం నుంచి ఇవ్వాళ్టి వరకు ఒక్క చెడ్డ పనికూడా చేయలేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం తండ్లాడుతడని, అంజయ్యయాదవ్ ఎమ్మెల్యేగా ఉంటే షాద్‌నగర్‌కు ఏది కావాలంటే అది వస్తదని తెలిపారు. మెట్రోరైల్ షాద్‌నగర్ వరకు రావాలని పట్టుబట్టి పెట్టించారని, అది పూర్తిచేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. మెడికల్ కాలేజీ కావాలని కోరారని, అది కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మెట్రోరైల్ పూర్తయితే ఇక్కడి భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అవన్నీ పోతాయని హెచ్చరించారు.
బీఆర్ఎస్ గెలుపుతో సంగారెడ్డి దశ మారుతది
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని, సింగూరు నిండు కుం డలా ఉండేలా కాళేశ్వరంతో లింక్ చేస్తున్నామని, అవి అయిపోయాయంటే సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణ్‌ఖేడ్ సస్యశ్యామలమవుతాయని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ‘సంగారెడ్డి పట్టణం హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతున్నది. సంగారెడ్డికి మెట్రో వచ్చిదంటే మీ దశ మారిపోతది. బీఆర్ఎస్ అభ్యర్థి చింతాప్రభాకర్‌ను పోయినసారి ఓడగొట్టినా నర్వస్ కాకుండా ప్రజల మధ్యలో ఉండి సేవ చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి. ఇకడ గతసారి గెలిచిన ఎమ్మెల్యే మాటలను నేను కూడా సోషల్ మీడియాలో చూశా. ఈ ఎమ్మెల్యే మొదట్లో బీఆర్ఎస్లో ఉండె. ఉద్యమ ద్రోహిగా మారి అమ్ముడు పోయిండు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదయ్యే నాకు ఆర్డర్లు వేస్తడు
కాంగ్రెస్ హయాంలో రంగారెడ్డి జిల్లా లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇవాళ భూముల ధరలు ఏ విధంగా పెరిగాయో, ఏ విధంగా లాభ పడుతున్నారో ఆలోచించాలని కోరా రు. కేంద్రం కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టినా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిసి చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలానికి రైల్వేకోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారని ప్రశంసించారు. ‘బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు. నేనేమో అందరికీ ఆర్డర్ ఇస్తాను. యాదయ్య నాకు ఆర్డర్ ఇస్తారు. నా దగ్గరోడు కాబట్టి.. ఆయన రాంగనే ఎమ్మెల్యే సాబ్ ఏం ఆర్డర్ వేస్తున్నారు.. ఏం కావాలని నేనే అడుగుతా. అడిగిన పని చేసేదాకా యాదయ్య ఊకోడు. ఈసీ వాగు, మూసీవాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను, మంత్రులను ఆగం పట్టించిండు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ మంత్రులైతే చచ్చే పరిస్థితి వచ్చింది. అంతగా వెంటపడి బ్రిడ్జిలు తెచ్చిండు’ అని వివరించారు. యాదయ్యను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మళ్లీ మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం. బ్రహ్మాండంగా డీఏలు ఇచ్చుకుందాం. అంగన్వాడీలు, ఆశా వరర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను చాలా మందిని రెగ్యులరైజ్ చేశాం. ఉద్యోగులకు పీఆ ర్సీ 30 శాతం ఇస్తే, చిన్న ఉద్యోగుల కడుపు నిం పాలని వారికీ 30 శాతం జీతాలు పెంచినం.
– సీఎం కేసీఆర్
ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నవ్ రాజనర్సింహ
కాంగ్రెస్ నేత దామోదర రాజ నర్సింహపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సమైక్యవాద పాలకులు మన నోళ్లుగొట్టి నిజాంసాగర్ ఆయకట్టును ముంచి, సింగూరును హైదరాబాద్ మంచినీళ్ల కోసం అప్పగిస్తే, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరు తెరవలేదని విమర్శించారు. ‘ఇక్కడి నుంచి దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా? ఆయన పదవిలో ఉండగా నీళ్లు ఎందుకు తేలేదు? ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంట అసెంబ్లీలో కూర్చున్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు?’ అని నిలదీశారు. అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్‌ను గెలిపించాలని కోరారు.
ప్రజాశీర్వాదం.. ప్రభంజనం కేసీఆర్ సభలన్నీ సూపర్‌హిట్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. తెలంగాణ గడ్డపై ఓట్లవేటకు ప్రధాని మోదీ, అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు జాతీయ నేతలు ప్రజల ముంగిట వాలిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారం ప్రజల మనసులను మరోసారి దోచుకున్నది. ప్రజల ఆశీర్వాదం కోరుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత నెల 15న హుస్నాబాద్‌లో ప్రారంభించిన ప్రజాఆశీర్వాద సభల ను నిరాటంకంగా సోమవారం వరకు కొనసాగించారు. ప్రతిరోజు నాలుగు సభల్లో పాల్గొంటూ ముందుకుసాగారు.
సోమవారం షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి నియోజకర్గాల్లో పాల్గొనటం ద్వారా ఆయన 94 సభలను పూర్తిచేశారు. మంగళవారం వరంగల్, గజ్వేల్ సభల్లో ప్రసంగించనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో 96 సభల్లో పాల్గొని అశేష ప్రజానీకాన్ని కలిసిన నేతగా కేసీఆర్ రికార్డు నెలకొల్పనున్నారు. ప్రత్యర్థి పార్టీల సభలు వెలవెలబోగా.. కేసీఆర్ ప్రతి సభ జనంతో హోరెత్తింది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రజల మధ్యనే ఉంటూ.. రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొని మద్దతును కూడగట్టారు. ఓ వైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు. మంత్రులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతోపాటు గులాబీ పార్టీ శ్రేణులు ఉద్యమస్ఫూర్తితో ప్రజా ఆశీర్వాదాన్ని పొందేందుకు పోటీలు పడ్డారు.