కోరుట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరును, మాటలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఏకిపారేస్తున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘దేశంలో పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు రైతులను కరెంటు బిల్లుల గురించి ఒత్తిడి చేసే అధికారులు లేరు. రైతుల నుంచి పన్నులు వసూలు చేసే వ్యవస్థ లేదు. మరి దీనికంతటికి కారణం ఎవరు..? బీఆర్ఎస్ పార్టీ కారణం. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం’ అని చెప్పారు.
‘వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలె, పల్లెలు బాగుండాలె, పల్లెల్లోకి సంపద రావాలె, రైతు మంచిగుంటే గ్రామాలు బాగుంటయని ఆలోచించి మేం ఒక పాలసీని పెట్టుకున్నం. అందుకే రైతులకు గుదిబండగా మారిన అన్ని రకాల శిస్తులను రద్దు చేసినం. గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేసేవి. కరెంటుపైన పన్నులు వేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నీళ్లకు ట్యాక్సులు లేవు. కరెంటుకు ట్యాక్సులు లేవు. పైగా రైతు బంధు ఇస్తున్నం. రైతు బీమా ఇస్తున్నం. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పడుతున్నది. దాంతో రైతుల అప్పులు తీరుతున్నయ్. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవసరం తప్పింది’ అని సీఎం తెలిపారు.
‘రాష్ట్రంలో రెండుసార్లు రైతు రుణాలు మాఫీ చేసినం. ఈసారి కూడా లక్ష రూపాయల వరకు రైతు రుణాలు మాపీ అయినయ్. లక్షకు పైన ఉన్న రుణాలు కూడా మాఫీ చేసేలోగా ఎలక్షన్ కోడ్ వచ్చి మాఫీ ఆగిపోయింది. ఎన్నికల తర్వాత లక్షకు పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తం. అదేవిధంగా రైతుల భూముల్లో అక్రమాలకు తావు లేకుండా ధరణిని తెచ్చినం. ధరణి వల్లనే రైతుబంధు వస్తున్నది. రైతు బీమా వస్తున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు. రైతు బీమా ఇవ్వడం కుదరదు. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తం అంటున్నరు. ధరణిని కాదు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి’ అని సీఎం అన్నారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తం. కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు. సంజయ్ మంచి వైద్యుడు. ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా గడ్డకు సేవ చేసుకుంటా అనే సంకల్పంతో పోటీకి సిద్ధమైండు. నేను నిరాహార దీక్ష చేసిన సమయంలో డాక్టర్ సంజయ్ నన్ను దగ్గురుండి చూసుకున్నడు. నా ప్రాణాలు కాపాడిండు. డాక్టర్ సంజయ్ నాకు బిడ్డ లాంటి వాడు. రాష్ట్రంగానీ, దేశంగానీ బాగుపడ్డదా..? వెనుపడ్డదా..? అని తెలుసుకునేందు రెండే గీటురాళ్లు. అందులో ఒకటి ఆ రాష్ట్రం లేదా దేశం తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ 18వ స్థానంలో ఉండె. ఇప్పుడు అద్బుతమైన పంటలతో ఆర్థికంగా ఎదిగి రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది. కరెంటు సప్లయ్‌లో కూడా తెలంగాణ నెంబర్ వన్‌గా ఉన్నది. కాబట్టి మీ అందరి సహకారంతో తెలంగాణ ఇదేవిధంగా ఇంకా ముందుకు పోవాలి. డాక్టర్ సంజయ్ స్థానిక బిడ్డ. ఆయనను మీరంతా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.