మధిర: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడిని పెంచుతూపోతున్నరు. మంగళవారం మధిరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒరిగిందేమీ లేదంటూ ఏకిపారేశారు. ఇందిరమ్మ రాజ్యంల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైళ్లల్ల పడేసిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు తప్ప దళితుల కోసం ఒక్క పని చేసిండ్రా..? దళితబంధు లాంటి పథకం తెచ్చిండ్రా..? తెస్తరా వాళ్ల జీవితంల..? తెచ్చే ఆలోచన వాళ్లకు ఉన్నదా..? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇదివరకే అమ్మను జూడు, బొమ్మను జూడు అని మస్తుగ ఓట్లు గుద్దుకున్నరు. ఇందిరమ్మ రాజ్యంల ఎవరు బాగుపడ్డరు..? ఎవరికి ఏం ఒరిగింది..? ఇందిరమ్మ రాజ్యంల ఎమర్జెన్సీ పెట్టి అందర్ని తీస్కపోయ్ జైళ్లల్ల పడేసిండ్రు. దళితులు దళితుల లెక్కనే ఉన్నరు. గిరిజనులు గిరిజనుల లెక్కనే ఉన్నరు. ఏం అభివృద్ధి లేదు, మన్ను గూడా లేదు. కరెంటు రాలేదు. నీళ్లు రాలేదు. తెలంగాణకైతే మరీ అన్యాయం జరిగింది’ అని సీఎం విమర్శలు గుప్పించారు.
‘కాంగ్రెసోళ్లు ఏదో ఒకటి చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నరు. మార్పు కావాల్నట.. ఏం మార్పు నాకు అర్థం కాదు. మరె మార్పు గావాల్నంటె ఈడ భట్టి విక్రమార్కను కూడా మార్పు జెయ్యాలె గదా..? ఇట్ల ఒట్టి కథలు చెప్పి మిమ్మల్ని ఏమారుస్తరు. జాగ్రత్తగా ఉండాలె. నేను బోనకల్ మండలానికి వచ్చి మక్క చేలు చూస్తందుకు పోయిన. వర్షం పడి కరాబ్ అయినయ్. ఆన్ ది స్పాట్ ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రకటించిన. తిరిగొస్తుంటే 20, 25 మంది దళిత ఆడబిడ్డలు కారు ఆపిండ్రు. నేను దిగి ఏందమ్మా అని అడిగిన. సార్ బోనకల్లుకు కూడా దళితబంధు పెట్టుండ్రి, మేం మారిపోయినమ్ అన్నరు. దాంతో బోనకల్ మండలానికి కూడా దళితబంధు ప్రకటించిన’ అని చెప్పారు.
‘ఇప్పుడు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్న మీరు మధిర నియోజకవర్గంలో కమల్‌రాజ్‌ను గెలిపించండి. నేను నియోజకవర్గం అంతటికీ ఒకేసారి దళితబంధు ప్రకటిస్తనని హామీ ఇస్తున్నా. కరీంనగర్, హుజూరాబాద్‌లో 20 వేల కుటుంబాల చొప్పున ఇచ్చినట్టే మధిరలో కూడా ప్రతి కుటుంబానికి దళితబంధు ఇప్పిస్తనని నేను మనవి చేస్తున్నా’ అన్నారు.