కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ గడ్డ కేంద్ర బిందువుగా ఉన్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
‘ఈ సభ జరుగుతున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జణ సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తీసుకరాకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నాడు జరిగిన సభలో నేను చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు. గంగుల కమాలకర్ చెప్పినట్లు దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, వ్యక్తిగతంగా నాకు అనేక విజయాలను అందించిన ఈ కరీంనగర్ మట్టి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని చెప్పారు.
‘కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనలను 58 ఏళ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ. 2004లో మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంల, కేంద్రంల అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆర్నెళ్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు దోకా చేశారు. 13, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దాంతో కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన. ఆ దీక్ష కూడా ఈ కరీంనగర్ గడ్డనే వేదికైంది. నన్ను అలుగునూ చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో ఉండేది కరీంనగర్ మట్టి, కరీంనగర్ గడ్డ’ అని సీఎం కరీంనగర్ నేలపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకున్నారు.
‘ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పదల్చుకున్నా. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు పంతొమ్మిదో, ఇరవైయ్యో ఉండె. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత నా తెలంగాణ 3.18 వేల తలసరి ఆదాయంతోటి దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు ఉండె. దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉండె. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతోటి దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం’ అన్నారు.