హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఇప్పటికే ముంబై చేరుకుందని, మరో ఫ్లయిట్ అర్ధరాత్రి 2 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకున్నదని సోమేశ్ కుమార్ తెలిపారు.
విద్యార్థులను హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందించడానికి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ విద్యార్థులు ప్రత్యేక ఫ్లయిట్ ద్వారా ఆదివారం ఉదయం బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని వివరించారు. ఉక్రెయిన్ నుండి వచ్చే విద్యార్థినీ విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటికే న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని సెక్రెటేరియేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎస్ గుర్తుచేశారు.