హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఇరువురూ సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటుచేసిన రెవెన్యూ జిల్లాల్లో జిల్లా కోర్టు సముదాయాల నిర్మాణాలకు ప్రభుత్వ సహకారం అవసరమని సీజే చెప్పారు. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న పది రెవెన్యూ జిల్లాల సంఖ్యను ప్రభుత్వం 33కు పెంచింది. ఇందులో 32 జ్యుడీషియల్ జిల్లాలను హైకోర్టు ఏర్పాటుచేసింది. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో కోర్టుల సముదాయాల కోసం ప్రభుత్వం ఐదు నుంచి ఇరవై ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూముల్లో ఒకే తర హా కోర్టు సముదాయాలను నిర్మించాలని హైకోర్టు ప్రతిపాదన చేసిందని సీజే తెలిపినట్లు సమాచారం.
అన్ని జిల్లా కోర్టులు ఒకేలా ఉండటానికి వీలుగా న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్‌ను హైకోర్టు గతంలోనే విడుదల చేసిందని గుర్తు చేశారని తెలిసింది. హైకోర్టు కోరిన మేరకు సిబ్బంది నియామకాలు చేశామని, కోర్టుల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాల సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన భూ ముల్లో భనవాల నిర్మాణాలకు తక్షణమే అనుమతులు ఇస్తామని తెలిపారని సమాచారం. ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. హైకోర్టు ప్రతిపాదనలకు అనుమతుల విషయంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోశీ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి, న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఇతరులు పాల్గొన్నారు.