గురువారం 02 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:39

ధైర్యంగా ఉండండి..

ధైర్యంగా ఉండండి..

  • అన్ని విధాలా ఆదుకుంటాం
  • కర్నల్‌ కుటుంబానికి సీఎం భరోసా
  • పిల్లలతో మాట్లాడుతూ భావోద్వేగం

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కర్నల్‌ సంతోష్‌బాబు లేని లోటును పూడ్చలేమని, కానీ.. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన కుటుంబసభ్యులతో అన్నా రు. ధైర్యంగా ఉండాలని చెప్తూ ఓదార్చారు. సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ సూర్యాపేటలోని కర్నల్‌ సంతోష్‌బాబు ఇంటికి మధ్యాహ్నం 3.39 గంటలకు చేరుకొన్నది. సెల్ల ధరించిన సీఎం.. దానినే మాస్కుగా వాడుకొని కారు దిగారు. ఇంట్లోకి వెళ్లి పాదరక్షలు విడిచి, సంతోష్‌బాబు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రిని సంతోష్‌ తండ్రి ఉపేందర్‌ ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంటిలోపల సంతోష్‌బాబు భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌తోపాటు సోదరి శ్రుతి, బావ ముక్తేశ్వర్లును సీఎం పరామర్శించారు. పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌.. రెండు చేతులు జోడించి నమస్కరించగా సీఎం పలుకరించారు. కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. అనంతరం సీఎం కేసీఆర్‌ వారితో సంభాషించారు. 

సీఎం కేసీఆర్‌: సారీ అమ్మా.. (నమస్కరిస్తూ)..

కుటుంబసభ్యులు: నమస్కారం సార్‌..

కొద్దిక్షణాలు మౌనం..

కేసీఆర్‌: సంతోష్‌ లేని లోటును ఎవరూ తీర్చలేరు. మీరు ధైర్యంగా ఉండాలి. 

కుటుంబసభ్యులు: థాంక్యూ సార్‌.. మీరిస్తున్న ధైర్యం మాకు ఎంతో ఊరటనిస్తున్నది.

కేసీఆర్‌: ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉం టుంది. ఏ సమస్య వచ్చినా మేముంటాం. ఇక్కడ జగదీశ్‌రెడ్డి ఉంటారు. ఆయనకు చెప్పండి.

కుటుంబసభ్యులు: ఓకే సార్‌. మంత్రి.. ఇంకా అందరూ మాకు వెన్నుదన్నుగా ఉన్నారు.

కేసీఆర్‌: సంతోష్‌బాబును తెచ్చివ్వలేం కానీ చెప్పిన ప్రకారం ఉద్యోగం, ప్లాట్‌, నగదుకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు ఇస్తున్నాం. 

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి

ప్రభుత్వ సాయానికి సంబంధించిన వివరాలన్నింటినీ సీఎం కేసీఆర్‌ స్వయంగా సంతోష్‌ కుటుంబీకులకు వివరించారు. అనంతరం కుటుంబపరిస్థితిపై ఆరా తీశారు. పిల్లలతో ముచ్చటించారు. పిల్లలు చెప్పిన మాటలతో కొద్దిక్షణాలు భావోద్యేగానికి గురయ్యారు. పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలని సూచించారు. ఉద్యోగం విషయంలో మీకు అనుకూలమైన విభాగాన్ని ఎంచుకోవాలని చెప్పారు. సూర్యాపేటలోని ఏదైనా చౌరస్తాకు సంతోష్‌ పేరు పెట్టాలని కుటుంబసభ్యులు కోరగా సానుకూలంగా స్పందించారు. పక్కనే ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆ విషయాన్ని సూచించగా, పాత కోర్టుచౌరస్తా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే అది పూర్తిచేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. సూర్యాపేటలో సంతోష్‌ పేరు మీద సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుచేయాలని సంతోషి విజ్ఞప్తిచేశారు. అది కేంద్రం పరిధిలోనిదని కేసీఆర్‌ తెలిపారు. అనంతరం సంతోష్‌ చిత్రపటంపై కుటుంబసభ్యుల కోరిక మేరకు ‘జై హింద్‌..’ అని రాసి సంతకంచేశారు. సాయంత్రం 4.10 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

గ్రూప్‌-1 అధికారిగా సంతోషి

  • హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌ 14లో ఇంటి స్థలం
  • రెండు ఉత్తర్వులు జారీచేసిన సీఎస్‌

కర్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషిని తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1 అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కంపార్సినేట్‌ గ్రౌండ్స్‌లో దీనిని ప్రత్యేక కేసు కింద పరిగణించి నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జీవో జారీ అయిన 30 రోజుల్లోపు సంతోషి విధుల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. సూర్యాపేటలో కర్నల్‌ సంతోష్‌ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వెళ్లి గ్రూప్‌-1 నియామక ధ్రువీకరణ పత్రం అందించిన గంటల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

బంజారాహిల్స్‌లో 711 గజాల భూమి

మరోవైపు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14, ఈ బ్లాక్‌, వార్డు నంబర్‌ 10, టౌన్‌ సర్వే నంబర్‌ 6/1 లో 711 గజాల భూమిని బీ సంతోషికి కేటాయిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మరో ఉత్తర్వు జారీచేశారు. 


logo