Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్: నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్ల క్రితం నాటి తెలంగాణ రైతన్నల గోస ఇది. ఇప్పుడు ఈస్ట్..వెస్ట్.. నార్త్.. సౌత్.. ఏదిక్కున చూసినా పచ్చని పొలాలు.. నిటారుగా నిలబడి నవ్వుతున్న పంటలు. నిండు గర్భిణిలా చెరువులు, కుంటలు జలాశయాలు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దార్శనికతకు ఇవి నిలువుటద్దాలు. సీఎం కేసీఆర్ కృషితో నిండిన జలాశయాలు రైతన్నకు పుష్కలంగా నీటిని అందించాయి. కరువన్నది తెలియకుండా చేశాయి. ఓవైపు నీటితో తొణికిసలాడుతున్న జలశయాలు. నిండుగా భూగర్భ జలాలు. 24 గంటలు నిరంతర విద్యుత్తు.. పొలం పనులతో బిజీగా ఉంటున్న రైతన్నలు ఇప్పుడు కాలంతో పోటీ పడి పంటలు పండించుకుంటున్నారు. పిల్లా పాపలతో హాయిగా ఉంటున్నారు. తమ గోస తీర్చి బతుకులు బాగుచేసి, రైతును రాజును చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆనందంగా చెబుతున్నారు అన్నదాతలు.
అప్పుడు ఎకరం భూమి రూ.70వేలు.. ఇప్పుడు రూ.50లక్షలు
నేను చిన్నప్పటి సంది వ్యవసాయం చేస్తున్నా. నా పెండ్లప్పుడు మా అత్తమామలు ఎకరం భూమి ఇచ్చిన్రు. అప్పటినుంచి నా భార్య సావిత్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నా. అప్పట్ల వ్యవసాయానికి అప్పు తీసుకచ్చేది. తెలంగాణ వచ్చే ముందట ఒక ఎకరం భూమిని 70వేలకు కొన్నా. ఇప్పుడు అదే భూమిని ఎకరాన రూ.50లక్షలకు అడుగుతాండ్లు. మా పక్కన రూ.70లక్షలకు ఎకరం భూమి మొన్ననే అమ్ముడుపోయింది. ఇప్పుడు నాకు ఉన్న 10ఎకరాల భూమికి ఆ లెక్కన రూ.5కోట్లు వస్తయ్. ఈ భూమిలో కొంత పట్టా అయింది. 4ఎకరాల భూమికి రైతుబంధు వత్తాంది. బిడ్డల పెండ్లి అప్పుడు కట్నం కింద 2 ఎకరాల చొప్పున ఇచ్చి 10తులాల బంగారం పెట్టుబోతల అప్పజెప్పిన. ఇదివరకు నీళ్లకు, కరెంటుకు మస్తు ఇబ్బంది ఉండేది. వానల కోసం ఎదురుచూస్తూ కాలం ప్రకారం పంటలు వేసేది. ఇప్పుడు రంది లేకుంట వానలు పడుతున్నయ్. కేసీఆర్ పుణ్యాన కరెంట్ ఎప్పటికీ ఫుల్లు ఉంటాంది. రామప్ప చెరువుల అప్పుడు గిన్ని నీళ్లు లెవ్వు. ఇప్పుడు ఈ చెరువుల గోదావరి నీళ్లు నింపుతాండ్లు. దీని వల్ల యాడాది పొడుగూత నీళ్లు ఉంటానయ్. ఆ నీళ్లనే నేను మోటర్లతోని నా పొలాలకు పారించుకుంటాన. వ్యవసాయం చేసుకుంటా రంది లేకుండా బతుకుతున్నా.
– బుద్దె రాములు, సింగరకుంటపల్లి, ములుగు జిల్లా
రైతులను కేసీఆర్సారు ఆదుకుంటాండు
ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24గంటలు కరెంటు ఇయ్యడమే కాకుండా సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లను తెచ్చి ప్రతి చెరువును నింపుతాండు. ధైర్యంగా పంటలు వేసుకొని పంటలు పండిస్తున్నం. రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇచ్చి ఎరువులు అందుబాటులో ఉండేటట్టు చూస్తాండ్లు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిండు. రైతుకు ఏమైనా ప్రమాదం జరిగి చనిపోతే వెంటనే రూ.5లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాండు. పదేండ్ల కింద బోర్లు వేసి అప్పులపాలైన. అప్పటి సంది నా పొలం కౌలుకు ఇచ్చిన. నీళ్లు, కరెంటు పుష్కలం ఉన్నయి కాబట్టి ఎనిమిదేండ్ల సంది నేనే పొలం పనులు చేసుకుంటాన. చెరువు నీళ్లు ఉండడంతో ఏటా మూడు పంటలు పండిస్తాన. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నయ్. మంచిగ లాభాలు వస్తున్నయ్. ఇదంతా కేసీఆర్ సార్ వల్లనే సాధ్యమైంది.
– ఆలేటి సారయ్య, రైతు, జయగిరి, హనుమకొండ జిల్లా
పొలం జూస్తే ఆకలైతలేదు
మాది సాగర్ ఆయకట్టు అయినప్పటికీ నీళ్లకు ఇబ్బందులు ఉండొద్దనే గతంలో బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నం. వాటితోనే పంటలు పండించుకుంటున్నం. ఈ సారి సాగర్‌లో నీళ్లు లేకపోవడంతో వడ్లు ఎట్ల పండుతయోనని రైతులంతా గాబరా పడ్డారు. ఉన్న నీటి వనరులతోనే వరిని నాటుకున్నం. నాకున్న ఆరెకరాల్లో ఒక బాయి, రెండు బోర్లు ఉన్నాయి. కరెంట్ నిరంతరం ఇస్తుండడంతో ఏ మాత్రం తగ్గకుండా పోస్తున్నయ్. పొలం కాడికిపోతే ఆకలైతలేదు. పొలాలు పొట్ట దశకు చేరే సమయానికి సాగర్ నీటిని తాగునీటి అవసరాలకు వదులుతామంటున్నది. అట్లయితే ఇగ నీటి కష్టాలు ఉండవు. వేసిన పంట కచ్చితంగా చేతికందుతుందనే నమ్మకం కలిగింది.
– కందుల రాంరెడ్డి, రైతు, కొండాయిగూడెం, నల్లగొండ
ఎండాకాలంల సుత చెర్ల నీళ్లుంటానయ్
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతుకు కరెంట్ కష్టాలు తీరినయ్. స్టార్టర్ నొక్కి ఇంటికి వస్తే పొలం నిండుగా నీళ్లు పారుతున్నయ్. ముదాం పొలం దగ్గర ఉండే పనిలేదు. ఇదివకు కరంటు కోసం ఎదురు చేసేటోళ్లం. కేసీఆర్ పుణ్యమా అని రైతులకు ఇప్పుడు ఆ కష్టాలు పోయినయ్. పంటల మీదనే ఆదెరువు. 25 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. కేసీఆర్ రైతులకు మంచే చేస్తుండు. పండిన పంటను అడ్డికి పావుసేరు అన్నట్లు అమ్మేది. ఇప్పుడు కేసీఆర్ గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు పెడుతాండు. పండిన పంటకు ఇక రంది లేకుంట అమ్ముకుంటున్నం. వర్షాలు సుత మస్తు పడుతున్నయ్. ఇదివరకు చెరువులు నిండితెనే పల్లెల్లో సాగు పనులు నడిచేటియి. ఇప్పుడు కేసీఆర్ సర్కారు ప్రాజెక్టులు కట్టి కాల్వల తోటి ఎండాకాలంలో చెరువులను నింపుతాంది. శాన ఊర్లల్ల ఒక్కటీ రెండు వానలకే చెరువులు అలుగు పోత్తానయ్. ఇప్పుడు రెండు పంటలకు ఢోకాలేదు. కే
– పేరం రవి, రైతు, చిన్నగూడూరు, మహబూబాబాద్ జిల్లా
పడావు భూములన్నీ సాగులోకి
తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి శానా మెరుగైంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక రైతులకు కావాల్సిన అన్ని సౌలతులు కల్పించిండు. రాష్ట్రం రాక ముందు ఎవుసంజేసుడు శానా కష్టంగుండేది. సాగు నీళ్లు ఉండకపోయేవి. ఒక్క పంటకు నీళ్లుండుడే గగనమయ్యేది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా మాదాక అచ్చేటియి కాదు. కరెంటు గోసలు కూడా అన్నీ ఇన్నీ కావు. నాకు ఏడెకరాల భూమి ఉంటె అప్పుడు సగంలనే పంటలు ఏసేది. గిప్పుడు కేసీఆర్ సార్ అచ్చినంక రైతుల బాధలన్నీ పోయినయ్. చెరువులు, కుంటలు బాగు చేయించిండు. మానేట్ల చెక్‌డ్యాంలు కట్టించిండు. 24 గంటలు వట్టిగనే కరెంట్ ఇత్తండు. కొత్తగ ప్రాజెక్టులు కట్టించి ఎస్సారెస్పీ నుంచి నీళ్లు అందిస్తండు.
-నల్లాల వెంకటరెడ్డి, కొలనూర్, పెద్దపల్లి జిల్లా
కేసీఆర్ అచ్చినంకనే కరువు పోయింది
తెలంగాణ అచ్చినంక, కేసీఆర్ సీఎం అయినంకనే కరువు పోయింది. అప్పట్ల అరిగోసపడ్డం. బావుల్ల నీరు లేక అప్పులు తెచ్చి బోర్లు వేస్తేది. బోరు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి ఎన్నో తిప్పలు పడ్డం. పంటలు చేతికొచ్చే టైంకు బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోయేది. అప్పటిరోజులు తలుచుకుంటే ప్రతి రైతు కండ్లలో నీళ్లు తిరుగుతయ్. కేసీఆర్ సీఎం అయినంక కరువన్న ముచ్చట్నే లేదు. వ్యవసాయం దండుగన్న రోజుల నుంచి వ్యవసాయం పండుగ అనేటట్టు చేసిండు. కరువన్నది తెల్వకుంట ఉన్నది. కరెంట్ సక్రమంగా వత్తాంది. రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు అందించి పెట్టుబడి సాయం చేయడంతో పంటల పెట్టుబడికి ఢోకాలేదు. వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటూ వరి, పత్తి, మిర్చి పంటలను బాగా పండిస్తున్నాం.
– బోరగాని గోపాల్, సాగరం గ్రామం, జనగామ జిల్లా
రైతు రాజయ్యిండు
తెలంగాణ రాకముందు ఎవుసం చేయాలంటే మస్తు తిప్పలయ్యేది. నీళ్లుంటే కరెంట్.. కరెంట్ ఉంటే నీళ్లుండేటివి కావు. అప్పో, సప్పో చేసి ఎవుసం చేస్తే ఎండిపోయేటివి. అట్లా మస్తు లాస్ అయ్యేది. ఇట్లయితే కుదరదనుకొని కూలి పనులకు పోయినం. తెలంగాణ వచ్చినంక మా బతుకులకు భరోసావచ్చింది. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ కింద చెరువులను మంచిగ చేయించిన్రు. ప్రాజెక్టులు కట్టించిన్రు. ఉచితంగా కరెంట్ ఇస్తున్నరు. రుణమాఫీ చేస్తున్నడు. మా ఊరిలోని భీమన్న చెరువు బాగైంది. మెరునిపరుపు వద్ద చెక్‌డ్యాం నిర్మించిన్రు. పుష్కలంగా నీళ్లుంటున్నయి. మాకున్న భూమిలో యేటా రంది లేకుంట రెండు పంటలు తీస్తున్నం. రైతును రాజు చేసింది సీఎం కేసీఆరే.
– పుప్పాల రాజేందర్, రైతు, పెంబి, నిర్మల్ జిల్లా
రైతుల సంక్షేమం కోసం గింతగనం కృషిచేసిన ప్రభుత్వం లేదు
నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. 20 ఏండ్ల నుంచి మా అమ్మానాన్నలతో కలిసి ఎవుసం చేస్తున్నా. తెలంగాణ వచ్చిన ఈ ఎనిమిది, తొమ్మిదేండ్ల నుంచే మా చేన్లు ఎండిపోకుండా పంటలు తీస్తున్నాం. నా ఎరక సంది చూస్తున్న రైతన్నల సంక్షేమం కోసం గింతగనం కృషి చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. ఉమ్మడి పాలనలో ఆనవాళ్లు లేకుండాపోయిన చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయంటే అది కేవలం సార్ తెలివితోనే అయింది. చెరువులు బాగుచేయించి, ప్రాజెక్టులు నిర్మించి మా సిరిసిల్ల మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. ఆనాడు వర్షాలు టైంకు పడక, కరెంటు లేక ఇబ్బందులు పడ్డం. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడైండు.
– కుంబాల లక్ష్మారెడ్డి, హరిదాస్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా